సుప్రభాత కవిత ; - బృంద
మనసు మడుగులో
అడుగున దాగిన
రంగుల కలలన్నీ
శిలలై మిగిలి పోయేనా?

ఒకో కలకూ ఒకో కారణం
రానేలేదు తీరే తరుణం
వర్ణాలే  కనిపించే
అసంపూర్ణ స్వప్నాలు

అలల రాపిడికి అందం
పెరుగుతోందే కానీ
కోరిక కొంచెం కూడా
తరగడం లేదు...

స్వఛ్ఛమైన నీటిలోన
మచ్చలేక మెరిసే
ఎచ్చోటనూ దొరకని
ముచ్చటైన  ముత్యాలు

ఆశ చావని  ఆకాంక్షల
అంతరంగ మధనాలు
అంతులేని నమ్మకాల
అదుపులేని  భావాలు

కోరి చేరే తీరాలూ
మది కోరే మధుసీమలూ
తుది లేని పయనాలు
విధి ఇచ్చే కానుకలు..

నాదన్నది నాతో వుంది
రేపన్నది ఎపుడూ వుంది
మాపులోనే మగ్గిపోని
ఊపు తెచ్చి ఊరించి

ఊహల ఉయ్యాలలూపే
ఉదయానికి హృదయనివేదనగా

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు