సునంద భాషితం;- వురిమళ్ల సునంద, డల్లాస్ అమెరికా
 న్యాయాలు -517
జంబుకార గ్వధ న్యాయము
******
జంబుకా అంటే నక్క, నీచమైన మనిషి.అరగ్వధ అంటే ఒక రకమైన కాసియా జాతికి చెందిన చెట్టు. అరగ్వధ కాయలు అంటే రేల కాయలు అని అర్థము.
రేల కాయలు తిని కడుపు నొప్పి తెచ్చుకున్న నక్క ఇక ఎప్పుడూ రేల కాయలు తినకూడదు అనుకుంటుందట.కానీ కడుపు నొప్పి తగ్గగానే మళ్ళీ రేలకాయలు తినడానికి వెళ్ళినట్లు" అని అర్థము.
మరి ఆ రేల కాయలు, చెట్టు ఎలా వుంటాయో తెలుసుకుందాం.
 ఈ రేల కాయల చెట్టు  ఆకులు మెరుపుతో కూడిన ముదురాకు పచ్చ రంగులో ఉంటాయి.కాయలు నలుపులో గానీ, పూర్తి ముదురు గోధుమ రంగులో గానీ సన్నగా గుండ్రంగా ఉండి 50 నుండి 60 సెంటీమీటర్ల పొడవు వుండి వేలాడుతూ వుంటాయి.
ఈ చెట్టు ఎక్కువగా తేమ ప్రదేశాలలో, అటవీ ప్రాంతంలో కనిపిస్తుంది. దీని పూలు అందంగా ఉండటం వల్ల ఉద్యానవనాల్లో పెంచుతారు. రోడ్ల వెంట కూడా పెంచుతారు.ఇది ఏడు నుండి ఎనిమిది మీటర్ల వరకు పెరుగుతుంది.పువ్వులు పొడవైన గుత్తులు గుత్తులుగా వేలాడుతూ బంగారం ముద్దలు ముద్దలుగా భూమిపైకి రాలుతుందా? అన్నంత అందంగా కనిపిస్తాయి. ఇక రేలపండ్ల గుజ్జు తీయగా ఉంటుంది.
ఈ రేల చెట్టు పూలు, ఆకులతో సహా అన్ని భాగాలు ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి.ఆయుర్వేదంలో దీనిని అనేక విధాలుగా ఉపయోగిస్తారు.
 ఇక ఈ రేలకాయల మీద ఉన్న సామెతను చూద్దాం."రేలకాయలు కొన్నమ్మ నీ నెత్తినే కొట్టుకో"  అనే సామెతను చిన్నప్పుడు మా తాతగారు తరచూ చెబుతుండేవారు.ఎందుకంటే ఇవి ఎక్కువగా తింటే మలబద్ధకం పోవడంతో పాటు విరేచనాలు కూడా కొంతమందికి అవుతాయి.అందుకే వాటి జోలికి ఎవరూ పోరన్న మాట.
అసలైతే నక్క మాంసాహారి.ఇది ఒకరకమైన అడవి జంతువు.కుక్క, తోడేలు మొదలగు జంతువుల కుటుంబానికి చెందినది. ఈ జంతువు వేటాడం చాలా తక్కువ.పెద్ద జంతువులు  తిని మిగిల్చిన ఆహారంపై ఎక్కువగా ఆధారపడి జీవిస్తుంది.
అలాంటి నక్క శాఖాహారమైన రేల కాయలు తింటుందని ఎలా పేరు వచ్చిందో తెలియదు.పైగా అది  ఎక్కువ ఇష్టంగా రేల కాయలు తిని కడుపు నొప్పి తెచ్చుకుంటుందనీ, తగ్గడంతో మళ్ళీ తింటుందనే సామెత ఎలా వచ్చిందో తెలియదు కానీ... దీనిని వ్యక్తులకు వర్తింపజేసి ఎందుకు చెప్పారో చూద్దాం.
కొందరికి కొన్ని ఆహారపదార్ధాలు పడవని, ఎక్కువగా తింటే అరగక పోవడం లాంటి యిబ్బందులు ఉంటాయని తెలుసు. అయినా జిహ్వ చాపల్యం ఆపుకోలేక తిని ఇబ్బంది పడుతూ,ఆ యిబ్బంది తగ్గడానికి ఏదో ఒక చిట్కా వైద్యమో,మందో వాడుతూ ఉంటారు.ఆ తర్వాత షరా మామూలే. మళ్లీ తినడానికి తయారవుతారు. దీనికి "అడుసు తొక్క నేల- కాలు కడుగ నేల" అనే సామెత కొంచెం దీనికి సారూప్యంగా ఉంది  కదండీ!
ఇది కేవలం తినడం వరకే కాదు. ఏవైనా పనుల విషయంలో కూడా ఇదే తరహాలో చేస్తుంటారు.అలాంటి వారిని ఉద్దేశించి కూడా మన పెద్దలు ఇలా "జంబుకార గ్వధ న్యాయం"తో పోల్చి చెబుతుంటారు.
 మరి ఇదంతా తెలుసుకున్న  మనం  అలాంటి పనులు అస్సలు చెయ్యం గాక చెయ్యం కదండీ!

కామెంట్‌లు