పర్యావరణ పరిరక్షణ;- - యామిజాల జగదీశ్
 స్వచ్ఛమైన వాయువు ఓ గొప్ప ఔషధం,  శుభకరం,  ఆనందకరం `  అని  చెప్తోంది ` వేదంలోని ఓ మంత్రం.
గాలి అమృతంలా,  నదులు అమృతంలా, స్వచ్ఛమై,  ఆహ్లాదకరమై అనుగ్రహించాలని మహర్షులు ప్రార్థించేవారు.
ప్రకృతి శాంతిగా ఉంటే అంతటా అమృతమే. పర్యావరణ  పరిశుద్ధికి సంబంధించిన భావాలు వేదవిజ్ఞానంలో ఎన్నో కనిపిస్తాయి. మన  చుట్టూ ఉన్న భూమి,  వాయువు, నీరు, మొదలైనవన్నీ  క్షేమకరంగా  ఉండాలనీ, ఉంచాలనీ  వేదం  ఆకాంక్ష. యజ్ఞయాగాదులు పర్యావరణాన్ని, శుద్ధిగా పరిరక్షించేందుకే  ఏర్పాటైనవే.
 ఏఏ  ఋతువులలో ఏవేవి తినాలి, తాగాలి,  ఏ విధంగా  జీవించాలో చాలా మంత్రాల్లో  ఉన్నాయి. ఈ  వేదాంశాలే,  ఆయుర్వేద వైద్య శాస్త్రంలో స్వీకరించడమైంది. భూమినీ, నీటినీ, క్షయంకాకుండా  నిస్సారం కాకుండా  పరిరక్షించవలసిన  విధానాలను  వేదాలు  వివరించాయి. స్వచ్ఛమైన  దానిని  మనం త్రాగే నీరు, స్వచ్ఛంగా ఉండాలని చెప్తోంది. దశరథుడి పాలనలో  మధురమైన స్వచ్ఛ జలాలు  సమృద్ధిగా ఉండేవని  వాల్మీకి రామాయణంలో వర్ణించాడు.
 ప్రస్తుత కాలంలో ఎక్కడికెళ్ళినా  ధైర్యంగా ఓ గ్లాసెడు నీళ్ళు తాగలేని  పరిస్థితిలో  ఉన్నాం. నదీజలాలు పరిశ్రమల  వ్యర్థాలతో కలుషితమై, మన ప్రాణాలకే  ముప్పు తెప్పిస్తున్నాయి.  తాగే  నీళ్ళు  కొనుక్కునే స్థితిలో  ఉన్నాం.
 పర్యావరణాన్ని  కాపాడే  వృక్షాలను నరకడం పాపమని  ఎన్నో మంత్రాలు  పేర్కొన్నాయి. ఆదికాలంలో వృక్షాలను  దైవసమానంగా భావించేవారు. వృక్షాల రూపంలో ఉన్న పరమేశ్వరునికి నమస్సులని ఓ వేదమంత్రం ఉంది. యజ్ఞయాగాదుల్లో వాడే సమిధలు   మాత్రమే  వాడటం తెలిసిందే కదా.  ఔషధీ విలువలు కలిగిన తులసి, వేప,  బిల్వం, ఉసిరిక, గరిక  వలన  వాయుమండలం శుభ్రపడుతుంది.  ఈ  ధూమం  వాయుమండలంలో  శుద్ధిని కలిగించడమే కాక, ప్రాణశక్తిని  నింపి,  పర్యావరణాన్ని బలోపేతం  చేస్తుందన్న యజ్ఞ  విజ్ఞానం, ఈనాటి శాస్త్ర  పరిశోధనల్లో కూడా సత్యమని తేలింది.
 విజ్ఞానం పేరుతో  ప్రగతి సాధిస్తున్నామనే భ్రమలో భూ, జల, వాయు, ధ్వని కాలుష్యాలను విస్తరింపచేస్తున్న  నేటి  నాగరికత, వేద సంస్కృతి యొక్క  ఆదర్శాలను స్వీకరించాల్సిన  ఆవశ్యకత ఉన్నది.
 మౌనం, ధ్యానం, పవిత్రమైన  వాక్కు, స్వరసహిత  వేద  ఉచ్చారణ మొదలైనవి ధ్వని  కాలుష్య  నివారణ  సాధనాలుగా వేదనాగరికతలో  కనిపిస్తాయి.  యంత్రాల రొదలో,  వాహనాల జోరులో  బ్రతుకుతున్న మనకి  ప్రశాంత  ప్రకృతి  నాదాలతో సహజీవనాన్ని బోధించిన  తపోభూముల నిర్మలత్వాన్ని  స్మరిస్తే చాలు, శాంతి  లభిస్తుంది.
పూర్వకాలపు వైదిక భావన, నేటి సమాజంలో కలిగిన నాడు, మళ్ళీ నాటి  నిర్మల దేశాన్ని  సాధింపగలమేమో! భావశుద్ధి  ఉంటే,  కర్మలో శుద్ధత్వం  ఉంటుంది.  భౌతిక కాలుష్యాలనే కాక, అంతరంగ కాలుష్యాలను సైతం నివారించే పవిత్ర భారత ఋషి  సంస్కృతిని,  తిరిగి ప్రతిష్ఠించగలిగినప్పుడు  ప్రపంచ  కాలుష్య  సమస్యను  నివారించి చల్లని పుడమిని  సాధించగలం.

కామెంట్‌లు