సుప్రభాత కవిత ; - బృంద
ఎవరి సందేశాలో మోస్తూ
గాలిలో తేలుతూ హాయిగా సాగే
పాలమబ్బుల రాయంచలు
కెంపుగా  మారెనే ఎంత అతిశయమో!

ఎడతెగక హోరు చేస్తూ
అలల  గెంతుల జోరుతో
నిరంతరమూ చలిస్తూ ఉండే
సంద్రపు మౌనమెంత అతిశయమో!

కదిలీ కదలక ఊగుతూ
తెలిసీ తెలియని నాట్యాన్ని
తేలికగా ఆడేస్తూ ఆనందించే
పచ్చిక  సంతోషమెంత అతిశయమో!

అరుణోదయ వేళలో
ప్రకృతిలో ప్రతి అణువూ
కొత్త అందాలు సంతరించుకునే
రంగులీను సొగసెంత అతిశయమో!

నిన్న ఒక గతమనుకుని
రేపు ఒక కల అనుకుని
ఈ రోజొక వరమనుకునే
తృప్తిదెంత అతిశయమో!

మంచిని మనసుల్లో పరుస్తూ
ప్రేమను మనసులకు పంచుతూ
ఆశను మనసులో ఉంచుతూ
సాగే జీవనమెంత అతిశయమో!

అడ్డుగోడలు అంతరింపచేసే
అతిశయమైన అరుణోదయాన్ని
అపురూపమైన వరంగా 
మహదానందంగా స్వాగతిస్తూ

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు