సునంద భాషితం;- వురిమళ్ల సునంద, డల్లాస్ అమెరికా
 న్యాయాలు -529
తంతు న్యాయము
  ****
తంతుః అనగా నూలు పోగు,తంతు నాగము అనే అర్థాలు ఉన్నాయి.
నూలు పోగులు అన్నీ ఒక చోట చేరి వస్త్రముగా తయారవుతాయి అని అర్థము.
నూలు బట్టలు నేయాలంటే ముందుగా నూలు కావాలి. నూలు అనేది పత్తి నుండి వస్తుంది. పత్తి నుండి తయారు చేసిన దారాన్ని నూలు అంటారు.దారం తయారు చేయడాన్ని నూలు వడకడం అంటారు.
ముందుగా పత్తి లోని గింజలను తొలగించి అందులో ఉన్న మలినాలను దువ్వెన లాంటి ద్వారా ఏకుతారు.అలా శుభ్రం చేసిన పత్తిని స్థూపాకార ఉండలుగా చుడతారు.రాట్నం ఉపయోగించి ఆ పత్తి నుండి దారాన్ని తెగిపోకుండా తయారు చేస్తారు.అలా తయారు చేసిన దారాన్ని పొరలు పొరలుగా విడిపోకుండా గట్టితనం కోసం అవసరమైన గంజి పెడతారు.అలా తయారు చేసిన దారంతో వస్త్రాలను మగ్గం మీద నేస్తారు.
ఇక నేయడంలో వాడే నిలువు పోగులను 'పడుగు' అని ,అడ్డం పోగులను 'పేక'లని  అంటారు. అవి రెండూ కలిసి అల్లుకు పోతేనే వస్త్రం తయారవుతుంది.
అయితే నూలు పోగులు అనగానే మనకు ముందుగా "చంద్రునికో నూలు పోగు"అనే సామెత గుర్తుకు వస్తుంది కదూ!
అమావాస్య తరువాత రెండవ రోజున కనీ కనిపించని విదియ చంద్రుడిని చూసి దండం పెట్టేటప్పుడు వేసుకున్న నూలు బట్టలలోంచి ఓ నూలు పోగు తీసి చంద్రుడికి  చూపిస్తూ బట్టలకు కొదువ లేకుండా చేయమని,కొత్త బట్టలు ఇవ్వమని కోరుకుంటారు.
మా చిన్నప్పుడు మా వూరిలో  వేసుకున్న నూలు దుస్తుల్లోంచి ఓ చిన్న పోగులాగి చంద్రునికి చూపిస్తూ భక్తితో దండం పెట్టుకోవడం ఇప్పటికీ బాగా గుర్తు.
అయితే దీనికి ఓ కథ కూడా ఉంది.ఇప్పటిలా ఎవరికీ యిబ్బడి ముబ్బడిగా బట్టలు ఉండేవి కావు. ఎవరో ధనవంతులకు తప్ప. మా తాతగారు అనేవారు ఒంటి మీద ఒకటి బండమీద లేదా దండెం మీద ఆరేసి ఒకటి మాత్రమే వస్త్రం అని. అలా చాలా మందికి తక్కువ బట్టలు వుండేవి. 
అందులోనూ  ఊరిలోని చేనేత వస్త్రకారుడు నేస్తేనే బట్టలు. ప్రతి ఊరిలో కొన్ని చేనేత కుటుంబాలు ఉండేవి.వారు ముందే మాట తీసుకుని బట్టలను నేసి ఇచ్చే వాళ్ళు. అలా ఊరి వాళ్ళ అందరికీ నేసి ఇచ్చే సరికి చాలా సమయం పట్టేది.ఎవరికీ ఎక్కువ తక్కువ బట్టలు ఉండేవి కావు.అందుకే కాబోలు పెద్దలూ పిల్లలూ అందరూ ఆ చంద్రునికి నూలుపోగు సమర్పిస్తూ మరిన్ని వస్త్రాలు కావాలని కోరుకునేవారు.
 "మరి చంద్రుడికే నూలు పోగు ఎందుకు చూపి అడగాలి" అని మా తాతగారిని అడిగితే ఆయనను అంటే  చంద్రుడిని భూమికి తమ్ముడు అంటారు కదా! అందుకే మనందరికీ మేనమామ కాబట్టి ఆయన్నే అడగాలని చెప్పేవారు.
ముఖ్యంగా మన సంప్రదాయంలో ఏ చిన్న శుభకార్యం జరిగినా ముందుగా అమ్మమ్మ గారి ఇంటి నుంచి మేనమామలు కొత్త బట్టలు తీసుకొని వచ్చేవారు.అలా తెచ్చినవి పీటల మీద కూర్చోబెట్టి పుట్టింటి  వారి బట్టలు అంటూ పెడుతుండటం ఆనవాయితీ. శుభ కార్యం అనగానే కొత్త బట్టలు వస్తాయని పిల్లలు సంబరపడి పోయేవారు.
ఇక విషయానికి వస్తే పడుగు పేకల నూలు కలయికతో వస్త్రం తయారైనట్లు అలా మనమూ ఐకమత్యంగా ఏ పనైనా చేస్తేనే దానికో రూపము వస్తుందని ,ఆచరణలో ఉపయోగంలోకి వస్తుందనే అర్థంతో ఈ "తంతు న్యాయము" ను మన పెద్దలు ఉదాహరణగా చెబుతుంటారు.
 కాబట్టి అందులోని అంతరార్థం గ్రహించి  పడుగు పేకల్లా చేయీ చేయీ కలుపుదాం.అందమైన పట్టువస్త్రమై అందరికీ ఆనందాన్ని పంచుతూ అనుకున్న కార్యాలు సాధించి చూపుదాం.

కామెంట్‌లు