సునంద భాషితం;- వురిమళ్ల సునంద, డల్లాస్ అమెరికా

 న్యాయాలు -528
డమరుక మణి న్యాయము
******
డమరుకము అంటే ఒక వాద్య పరికరము.దీనిని జానపద కళలలో బుడబుక్కల వాళ్ళు, ఒగ్గు కథలు చెప్పేవారు ఉపయోగిస్తారు. డమరుకము పరమ శివుని హస్తభూషణము.శివ తాండవ నృత్యంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. మణి అనగా ఇక్కడ డమరుకాన్ని మ్రోగించేందుకు మధ్య లో వున్న గిలక్కాయ వంటి చెక్క ముక్క. దీనినే మణి అంటారు.
డమరుకమునకు మధ్య గల మ్రోగించు సాధనము వలె.
శివునికి ఒకచేతిలో డమరుకము వుంటుంది.ఆ డమరుకము వాయించడానికి మధ్యనొక కొయ్య ముక్క వుంటుంది.దానినే మణి అంటారు. డమరుకము కదిలించినపుడు మణి డమరుకమునకు అటూ ఇటూ తగిలి డమరుకము చప్పుడు అయ్యేలా చేస్తుంది.అలా ఒక మణియే రెండు వైపులా తాకి డమరుకమును మ్రోగించుటకు ఉపయోగపడుతున్నది.
అలాగే ఒకే వస్తువుతో రెండు రకాల ఉపయోగం కలిగినప్పుడు ఈ "డమరుక మణి న్యాయము"తో పోల్చి ఉదాహరణగా చెబుతుంటారు.
మరి ఈ డమరుకము గురించి కొన్ని విశేషాలూ, విషయాలను తెలుసుకుందాం.
 హిందూ మతములో డమరుకాన్ని తాంత్రిక సంప్రదాయాలతో ముడిపడి ఉన్న శివుని యొక్క పరికరంగా పిలుస్తారు.ఆధ్యాత్మిక శబ్దాలను ఉత్పత్తి చేయడం కోసం శివుడే దీనిని సృష్టించాడని చెబుతారు.దీని ద్వారా విశ్వం మొత్తం సృష్టించబడింది మరియు నియంత్రించబడిందని చెబుతుంటారు.ఈ డమరుకమును వాయించడం ద్వారా శబ్దము, వ్యాకరణము మొదలైనవి సృష్టించాడని, ఆ శబ్దంలో 'ఓం 'అనే శబ్దం అన్నిటికీ మూలం అంటారు.ఈ విధంగా స్పందన లేదా వాక్కు/ నాదము అనేది  ఓ శివుని శక్తి. ఆ శక్తి నుండే విశ్వం సృష్టించబడిందని  ఆధ్యాత్మిక వాదులు అంటారు.
అంతే కాదు ఈ డమరుక శబ్దం అనాహత నాద లేదా తాకబడని శబ్దం అని అంటారు.ఇది శూన్యం నుండి ఉద్భవించిన సృష్టి యొక్క శబ్దాన్ని సూచిస్తుందని, విశ్వం ఆవిర్భావానికి ముందే ఈ శబ్దం ఉందని భగవద్భక్తులు చెబుతుంటారు.
అలాంటి డమరుకము మధ్యలో ఉన్న గిలక్కాయ వంటి కొయ్య ముక్క రెండు వైపులా తాకి శబ్దం వచ్చేలా చేస్తుంది.ఒకే వస్తువు చేత రెండు పనులు కావడం లేదా చేయడం అంటే ఇదే.
అలా కొన్ని వస్తువులతో రెండు పనులేం కర్మ బోలెడు పనులు చేయించుకోవచ్చు.
బడిలో ఓ ఉపాధ్యాయుడి చేతిలోని  రూళ్ళ కర్ర  ఉంటుంది.అలా రూళ్ళ కర్ర బెత్తం లాంటింది.అది నిషేధం కదా! అలా ఉండొచ్చా?అనే సందేహం ఈ పాటికి ఎప్పుడో వచ్చే వుంటుంది. అదేనండీ! సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు రాష్ట్రాలు,ఎల్లలూ చూపడానికి, అలాగే తెల్ల కాగితాలపై గీతలు  కొట్టడానికి కూడా ఉపయోగపడుతుంది కదా!అయినా ఇదేం ఉదాహరణ బాగా లేదు అంటారా!
 సరే మన చేతిలో ఉన్న సెల్ ఫోన్ అనే వస్తువునే  ఉదాహరణగా తీసుకుందాం.అది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో వేరే చెప్పక్కర్లేదుగా!
ఇక వంటింట్లో ఉపయోగించే కత్తి, అప్పడాల కర్ర లాంటివే కాకుండా పిన్నీసు, గుండు సూది లాంటివి ఎన్నో  వస్తువులను అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు.
ఇలా ఆలోచిస్తూ పోతే చాలానే వస్తువులు ఉన్నాయి.
ఇవండీ! "డమరుక మణి న్యాయము" ద్వారా మనం అటు ఆధ్యాత్మికతకు సంబంధించిన విశేషాలూ,ఇటు నిత్య జీవిత విషయాలను తెలుసుకున్నాం.ఇలాంటివి పరిశీలించి ఓ న్యాయంగా సృష్టించిన మన పూర్వీకుల నిశిత దృష్టికి వినయంగా నమస్కరిస్తూ మనకు కూడా దీనిని అన్వయించుకుందాము మనిషిగా ఒక్కరమే కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకూ రకరకాల పాత్రలు పోషిస్తూ వాటికి తగిన పనులు చేస్తూ ఉంటాం‌. అలా దేహంలో చేతులను ఉదాహరణగా తీసుకుంటే రెండు చేతులే ఎన్నో రకాల పనులు చేస్తాయి  కదా! హమ్మయ్య మంచి ఉదాహరణతో పోల్చి మిమ్మల్ని ఈ పాటికి మెప్పించే వుంటాను.కదండీ!

కామెంట్‌లు