శ్రీ మాల్యాద్రి నారసింహ శతకము.;- టి. వి. యెల్. గాయత్రి.-పూణే. మహారాష్ట్ర.
 తేటగీతి పద్యములు.
101.
భక్త సులభుడ నీచెంత భయము లేక 
వచ్చి నిల్చితి దీర్పవే వాంఛితమ్ము 
కాంక్ష మీరగ నీరూపు కనగ వేడు 
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//
102.
బంధు వర్గము పెట్టెడు బాధలందు 
మునిగి పోయితి మనమున ముసురు పట్టి 
బెదిరి వగచితి దిగులున బేలనైతి 
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//
103.
బంధు మిత్రులు లేరయ్య భయము తోడ
నొంటరిగ నుంటి జేకొని యుద్ధరింప
నాత్మ బంధువ వైతివి యాది దేవ! 
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//
104.
భ్రాంతి నొందితి సంసార పాథి యందు 
ముందు దారిని గానక మునిగి బోతి 
నుద్ధరింపవే నన్నొక యోడ వోలె
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//
105.
నీదు రూపంబు కన్నుల నిలుపు కొంటి 
పలుకు చుంటిని నామంబు పట్టు బట్టి 
దయను జూపగ రావయ్య దాన వారి 
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//
106.
ప్రణవ నాదంపు రూపమై ప్రభవ మొంది 
విశ్వ మంతయు నిండిన వేల్పువీవె 
స్థూల సూక్ష్మపు రూపంబు సొరిది వెలయ 
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//
107.
సన్నుతించగ నీ కీర్తి సమధికముగ
శతకమొక్కటి రచియించి శక్తికొలది 
నీదు ముంగిట భక్తితో నిలిచియుంటి 
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ.//
108.
వినతి చేసితి నీ మ్రోల విబుధ వినుత!
నాదు పద్యముల్ వినినంత నగవుతోడ 
పరుగు పరుగున రావయ్య!పంకజాక్ష!
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//

కామెంట్‌లు