పట్టుదల : సరికొండ శ్రీనివాసరాజు
 వాసు చిన్నప్పటి నుంచి చదువులో వెనుకబడి ఉన్నాడు. ఆటపాటల్లో మునిగిపోయి, చదువును పక్కన పెట్టాడు. పెద్దవుతున్నా కొద్దీ తోటి వారిని చూసి చదువుకోవాలని ఆసక్తి పెరగసాగింది. కానీ ఏమీ అర్థం చేసుకోలేక ఆత్మవిశ్వాస లోపంతో తన వల్ల ఏమీ కాదని బాధపడుతున్నాడు.
       ఇప్పుడు వాసు 9వ తరగతికి వచ్చాడు. వాసు వాళ్ల మేనమామ కొద్దిరోజుల పని నిమిత్తం వాసు వాళ్ల ఇంటికి వచ్చాడు. తీరిక సమయంలో టివీలో వింబుల్డన్ టెన్నిస్ పోటీలు చూస్తున్నాడు. మేనమామతో పాటు వాసు కూడా టెన్నిస్ చూస్తూ ఆట అర్థం చేసుకుంటున్నాడు. 
       ఫైనల్స్ ఆసక్తిగా చూస్తున్నాడు. ఏకపక్షంగా సాగుతున్న ఆ ఆటలో 6-3, 6-2, 5-0తో ప్రసిద్ధ క్రీడాకారుడు దూసుకు పోతున్నాడు ఇంకా ఒక్క గేమ్ సాధిస్తే ఛాంపియన్ తానే. కానీ అనూహ్యంగా అవతలి క్రీడాకారుడు పుంజుకొని వరరసగా ఏడు గేమ్స్ గెలిచి ఆ సెట్ ను 7-5తో గెలుచుకున్నాడు. ఆ తర్వాత మరింత పట్టుదలతో రెండు వరుస సెట్లలో పూర్తి ఆధిపత్యం కనపరచి 6-0, 6-0 తో చివరి రెండు సెట్లను గెలిచి ఛాంపియన్ షిప్ సాధించాడు. ఓడిపోతున్నాడు అని ప్రేక్షకులు అనుకున్న క్రీడాకారుడు అనూహ్యంగా పుంజుకుని 3-6, 2-6, 7-5, 6-0, 6-0 తో పోరాడి గెలిచాడు. 
      ఈ ఆట వాసులో కనువిప్పు కలిగించింది. తాను చదువులో ఎంత వెనుకబడినా పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే ముందంజ వేయవచ్చని అనుకున్నాడు. తెలివైన విద్యార్థుల, గురువుల సహాయంతో తనసందేహాలను నివృతి చేసుకుంటూ చదువులో అనూహ్యంగా పుంజుకున్నాడు. 

కామెంట్‌లు