న్యాయాలు -562
దూరస్థ వనస్పతి న్యాయము
******
దూరస్థ అనగా దూరము,దూరస్థుడు,వ్యవహితుడు.వనస్పతి అనగా పూయకనే ఫలించు అడవి చెట్టు, చెట్టు, వృక్షము అనే అర్థాలు ఉన్నాయి.
చాలా దూరం నుండి చూస్తే వృక్షము దాని యందు ఉన్న వస్తువులు ఒకటిగా అభేదముగా ఉన్నట్లు కనిపిస్తాయి అని అర్థము.
దూరం నుంచి చూస్తే చెట్టయినా,గుట్టయినా ఏక వస్తువుగా కనిపిస్తాయి. చెట్టు పచ్చదనాన్ని ముద్దగా రాశి పోసినట్లు కనిపిస్తుంది.గుట్ట నునుపుగా కనిపిస్తుంది.చెట్టుకు ఉన్న శాఖోపశాఖలుగాని వాటిపై వాలిన పక్షులు,వాటి గూళ్ళు ఏమీ విడివిడిగా కనబడవు.
దీనిని మనవాళ్ళు "దూరపు కొండలు నునుపు" అనే సామెతతో పోలుస్తూ వుంటారు. అయితే ఇందులో రెండు రకాల అర్థాలు ఇమిడి ఉన్నాయి.
భౌతికంగా చూస్తే అవును నిజమే దూరంగా ఉన్న చెట్టును గానీ కొండను గాని చూస్తే కళ్ళకు ఏకమొత్తంగా కనిపిస్తుంది.
అయితే దీనిని మన పెద్దలు చెప్పడంలో అంతరార్థం ఏమిటంటే లోతు పాతులు తెలుసుకోకుండా,నిజా నిజాలు ఆలోచించకుండా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అందంగానో, అద్భుతంగానో ఊహించుకోవద్దని చెప్పడము.ఇది ఎక్కువగా యుక్త వయస్సులో ఉన్న యువతీ యువకులను హెచ్చరిస్తూ చెప్పడం కోసమే.ఎందుకంటే ఆ వయస్సులో వారికి లోకం తీరు తెలుసుకునే విచక్షణ, వివేకం వుండవు.తమకు కనిపించిందే నిజమనీ, తాము చేసేదే సరియైనదనే అపోహలతో వుంటారు.
వీరిలో కొందరు ఒకరి గురించి మరొకరు పూర్తిగా తెలుసుకోకుండానే ప్రేమలో పేరుతో దగ్గరవుతారు . ఒకరు లేకుండా మరొకరు జీవించలేం అన్నంతగా గుడ్డిగా నమ్ముతూ పెద్దలను ఎదిరించో,ఒప్పించో స్వయం నిర్ణయాలతో ఒక్కటవుతారు.ఆ తర్వాత వారిలో నచ్చని,మెచ్చని లోపాలు లక్షణాలు,ప్రవర్తనలో మార్పులు ఒక్కొక్కటిగా కనిపించి కలిసి జీవించలేక, విడిగా ఎవరికి వారు ఉండలేక బతుకును దుర్భరంగా మార్చుకుంటారు . అలాంటి వారిని చాలా మందిని గమనించినప్పుడు మన పెద్దలు ఈ "దూరస్థ వనస్పతి న్యాయము"ను ఎందుకు చెప్పారో అర్థమవుతుంది.
ఇక కొందరి మాటలు,చేతలు చూసి వారికి వీరాభిమానులుగా మారుతుంటారు.వారిని అతి దగ్గరగా పరిశీలించినప్పుడు వాళ్ళ అసలు స్వభావం,కౄర,కుత్సిత లక్షణాలు బయటపడి వీరినా ఇంతగా అభిమానించామని బాధ పడేవారూ ఉన్నారు.
ఇలాంటివే కాకుండా సినిమారంగానికి చెందిన కొందరైన తారల జీవితాలు కూడా తెగ ఆకర్షిస్తూ వుంటాయి.వాళ్ళు నటనలో జీవించడం, ఆదర్శాలు వల్లించడం చూసి నిజ జీవితంలో కూడా అలాగే వుంటారని అనుకోవడం.అంతే కాదు బయటికి కనిపించే వారి ఆడంబరం చూసి ఏమా అదృష్టం? అని ఈర్ష్యగా అనిపిస్తుంది. కానీ వాళ్ళు ఆ అదృష్టం కోసం పడే పాట్లు,పొందే ఉత్తాన పతనాలు ఎవరికీ కనబడవు.
అలాగే మన చుట్టు,పక్కల ఉన్న వాళ్ళ మనస్తత్వాలను కూడా పైపైన చూసి ఎలాంటి వారో పసిగట్టలేం.పైకి కనిపించినంత గొప్పగానో,ఆనందంగానో అందరూ ఉండరనే సత్యాన్ని గ్రహించాలి.
ఇది కేవలం మనుషులు, మనస్తత్వాలకే కాదు ప్రస్తుతం ఎంతో గొప్పగా ఊహించుకుని చదువులు,ఉద్యోగాల కోసం తాము పుట్టి పెరిగిన దేశాన్ని వదిలి విదేశాలకు వెళ్ళడం.అయితే ఇందులో మళ్ళీ రెండు కారణాలు ఉన్నాయి.అక్కడి సంపాదనను స్వదేశీ డబ్బుతో పోల్చుకుని కేవలం దాని కోసమే వెళ్ళే వాళ్ళు కొందరు.అక్కడంతా స్వర్గంలా ఉంటుందని ఊహిస్తూ వెళ్ళేవారు కొందరు. కానీ ఎక్కడ ఉండే ఇబ్బందులు అక్కడ ఉంటాయనేది మరువ కూడదు.
ఏది ఏమైనా మనిషి మనస్సు ఎప్పుడూ ఎదుటి వారిని, వాటిని పోల్చుకుంటూ బాధ పడుతూ వుండటం సహజమే.కానీ అది ఎప్పుడూ "దూరస్థ వనస్పతి న్యాయము" లాంటిదేనని భావిస్తే మనసు. నెమ్మదిస్తుంది/ నెమళిస్తుంది. మీరూ నాతో ఏకీభవిస్తారు కదూ!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి