ఎడిసన్ - ఫోర్డు స్నేహబంధం;- - యామిజాల జగదీశ్
 ఎలక్ట్రిక్ బల్బ్ ఆవిష్కర్త అయిన థామస్ ఎడిసన్, కారు రూపకల్పనలో బిజీగా ఉన్న రోజులవి. అయితే తన కంపెనీలో ఒక యువకుడు ఒక ప్రయోగాత్మక కారుని సృష్టించాడని విన్నాడు ఎడిసన్. 
ఎడిసన్ ఆ యువకుడైన హెన్రీ ఫోర్డుని న్యూయార్క్‌లోని ఒక కంపెనీ పార్టీలో కలుసుకున్నాడు. అతని గ్యాసోలిన్ ఆధారిత కారు ఆలోచనను తెలుసుకుని ఎంతగానో ఆకట్టుకున్నాడు. 
విద్యుత్తును శక్తి వనరుగా భావించిన ఎడిసన్, ఫోర్డ్‌ను ప్రోత్సహించాడు.  "యువకుడా, అదీ విషయం! నీలో ప్రయోగాలు చేసే కృషి ఉంది! నీ ఆలోచనాశక్తి నన్నెంతగానో కట్టిపడేసింది. నీ ప్రయోగాలను కొనసాగించు" అని చెప్పాడు.
ఎడిషన్ తో ప్రోత్సహింపబడిన హెన్రీ ఫోర్డ్ తన పనిని కొనసాగించాడు, చివరికి అతనిని సంపన్నుడిగా మార్చిన కారును కనిపెట్టాడు.
1914 డిసెంబర్ 9న, ఎడిసన్ ప్రయోగశాల, కర్మాగారం అగ్నిప్రమాదానికి ధ్వంసమయ్యాయి. అప్పటికి ఎడిసన్ వయస్సు 67 ఏళ్ళు. భీమా సొమ్ములు పొందే అవకాశం లేదు. అయితే అతని పెను నష్టాన్ని గ్రహించిళ హెన్రీ ఫోర్డు ఎడిసన్‌కి 750,000  డాలర్లిచ్చి ఆదుకున్నాడు. నిజానికి ఎడిసన్ మరింత డబ్బు అడిగితే ఇవ్వగల స్థాయిలో ఫోర్డు ఉన్నాడు. కానీ అడగలేదు.
1916లో, ఫోర్డు తన ఇంటిని ఎడిసన్ ఇంటి పక్కనే మార్చాడు.  ఎడిసన్ తర్వాత వీల్ చైర్‌కు పరిమితమైనప్పుడు కూడా ఫోర్డు అతనితో కంటికి రెప్పలా మెలిగాడు.
మరోవైపు థామస్ ఎడిసన్ ఎప్పటికప్పుడు హెన్రీ ఫోర్డ్‌కు నమ్మకం కలిగించాడు. వారి మధ్య స్నేహ బంధానికి గట్టి పునాది వేశాడు.
వీరిద్దరి మైత్రీ బంధం చెప్పే పాఠం ఒకటి... ఇతరుల విజయాలను చూసి ఎప్పుడూ అసూయపడకూడదు. మనం పోటీ పడటంలో గెలవలేకపోతే, మన ముందున్న వ్యక్తి సంచలనొల సృష్టికి సహాయపడాలి. ఒక కొవ్వొత్తి మరొక దానిని వెలిగించడం ద్వారా దాని కాంతిని అది కోల్పోదంటే ఇదేమరి!!

కామెంట్‌లు