ఒక గంట తేడా!!!?;-డా.ప్రతాప్ కౌటిళ్యా
సమయాన్నిబట్టి నీడ కూడా నిన్ను వీడుతుంది మారుతుంది. 
సమయం ఇప్పుడు 
భూగోళంలో ఒక గంట మారింది.!!

అన్ని ఆకర్షణలు భుజం మార్చుకుంటున్నాయి. 
తరంగాలు తడుముకుంటున్నాయి 
బిందువులు సరళరేఖలు త్రిభుజాలు చతురస్రాలు తప్పుకుంటుంన్నవీ
సున్నా ఒకటి పది వంద దండం పెడుతున్నాయి. 

ఎగిరేందుకు రెక్కల అవసరం లేదేమో 
గాల్లో తేలిపోయేందుకు శూన్యం లేదు 
నడవాల్సిన అవసరం లేదు 
ఎగరాల్సిన అవసరం లేదు. 

కనిపించే రూపం మనిషిదే కాదు 
పదార్థం అర్థం కూడా అంతే 
గుర్తుపెట్టుకోకూడదు గుర్తుపట్టుకోకూడదు. 

మాటతో పనిలేదు చిరునవ్వు చెదిరిపోయిన పర్వాలేదు. 
సమస్తం శూన్యం మనసు లేదు వయసు లేదు అంతా అనంతం. 

తేజస్సు మేదస్సు తెలుసుకునే అవసరం లేదు. 
ఉన్నది ఉన్నట్లు ఉండదు 
లేనిది కొత్తగా పుట్టదు 
పరిణామం ఆగిపోయింది 
జీవం పదార్థం యదార్థ స్థితిని కోల్పోయింది 

తయారు చేసే యంత్రాంగం పగిలిపోయింది 
మళ్లీ పుట్టేది 
ఆకర్షణో తరంగమో తెలియదు. 

ఉన్నదంతా ఎక్కడికి పోతుందో 
కొత్తదేది తిరిగి వస్తుందో చెప్పడానికి 
తరంగం తెగిపోయింది 
ఆకర్షణ ఆగిపోయింది. 

చివరిసారి రెండు కళ్ళు రెండు చెవులు రెండు చేతులు రెండు కాళ్లనూ
ఒక తల ఆడించింది. 

ఒక తోలుబొమ్మలాట మళ్లీ మొదటికి వచ్చింది. 
గడియారంలో సమయం మారింది 
తల కూడా గడియారంలా గిర్రున తిరిగి తెగిపడింది.!!!!?

డా.ప్రతాప్ కౌటిళ్యా

కామెంట్‌లు