సుప్రభాత కవిత ; -బృంద
ఉవ్వెత్తున పొంగిన ప్రేమా?
అసలందక ఊరించే ఆకాశాన్ని
అందుకుని తీరాలన్న ఆరాటమా?
అలవికాని అనురాగపు ఆవేశమా?
అల అందుకోగలదా అలనీలి  గగనాన్ని?

చిన్ని చిన్ని కెరటాలుగా మొదలైన
కొన్ని కలల ఊయలలు
నింగి దాకా సాగాలని 
పొంగి పోయి రావాలని కోరికలు

మేఘాలకావల మెరిసే 
స్వప్న సదృశ్యమైన 
నభ ప్రాంగణము చేరి
మురిసి మబ్బుల తో
నడయాడు ఆశ తీరునా 
అంబుధికి?

ఎంత ఎత్తుకు ఎగిరినా
చేరుకోని గగనాలు
ఎన్ని పరుగులు తీసినా
చేతికందని తీరాలు
ఎంత ఎదురు చూసినా
కనికరించని కాలాలు

వేగంగా సాగిన కెరటాలకు
తీరాన ఆగే  గమనాలు
తల్లి ఒడిని చేరే తీరున
తిరిగి కడలి లోకే పయనాలు

కొన్ని మనసులంతే!
కొన్ని మమతలంతే!
కొన్ని  జీవితాలంతే
కొన్ని పరుగులంతే!

కడలిని మించిన ఆశల
ఆలోచనలు దాచిన అంతరంగానికి
ఉప్పెనలూ....ఉప్పొంగులూ
విరాగాలు...విరక్తులూ

గడచిన గతపు గందరగోళం
గుర్తు రానీయక  ఎదురుచూసేలా
ఎప్పటికప్పుడు కొత్తపోకడలతో
ఉత్సాహం పంచే ఉదయానికి

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు