సరిగమపదని సప్తస్వర మాలిక
తెలుగు వెలుగుల విరిసిన మల్లికా
మందార మకరంద మొలికే
వాణి మృదు పాణి వీణపలికే
బౌళి భూపాలరాగాలలో
తెలుగు వెలుగు కిరణాలు
కొమ్మ కొమ్మలో కోయిలల సన్నాయి రాగాలు
జుంటితేనె ఊటలు
తెలుగు మాట తెలుగు నోట
పలుకుపలుకులో చిలుకు
కర్పూరపు గుబాళింపు
పెద్ద బాలశిక్షతో అమ్మ భాష
అమరికగా నేర్పు అక్షరాలవిన్యాసాలు
అడుగడుగున అచ్చతెలుగు
ఆటలతో పాటలతో ముంగిళ్లు
అన్నమయ్య స్వరార్చనతో
అచ్చతెలుగు _ క్షేత్రయ్య జావళీలు అందెల రవళులు
పానుగంటి సాక్షి విజ్ఞానపు కుక్షి
వేమన ఆటవెలదులు ఆడెప్రతీనోట
నండూరి ఎంకి సిగ్గుల మొగ్గలు
గురజాడ పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కన్నీటి గాథలు
ముత్యాల సరాలు ముంగిట రంగవల్లులు
త్యాగరాజు రామదాసు కీర్తనలు
తెలుగు తల్లి భుజకీర్తులు
కూనలమ్మ పదాలు కృష్ణ శాస్త్రి గీతాలు
మల్లెపూదండలతో తెలుగు తల్లికి స్వాగత తోరణాలు
బాస యాస ఏదైనా మనసులో భావాలు మనసుకే తెలుసు
అది మానవ జాతికే స్వంతం
అందుకే అమ్మ పాలభాష అమరం అజరామరం 🌷
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి