సుప్రభాత కవిత ; -బృంద
చిరు గాలుల తాకిడికి
చిరు అలల సవ్వడి...
చిరు చీకటి నీడలలో
చిరు వెలుగుల సందడి

దవ్వున వెలిగే తూరుపు
పువ్వులా రేకులు విచ్చుతూ 
రవ్వలా మెరుపులు చిందిస్తూ
నవ్వుతూ విచ్చేయు వేలుపు

మంచితనపు పూదోటలోని
మానవత్వపు పరిమళంలా.
సహకారపు సర్దుబాట్ల
ఉపకారపు ఉత్సాహంలా...

నీరవ నిశీధిని తరుము
నిశ్శబ్ద విస్ఫోటనపు వేకువలో
ఉదయపు హృదయమాలపించే
వేకువ రాగాలాపనలు

గడచిన క్షణమొక గతమై
వేచిన దినమొక కలయై
తోచిన కలలకు రూపమై
నిలిచిన క్షణమే నిజమై....

వేదన గీసిన గీతలన్నీ
చెరిపేసే వేడుక గీతాలై..
కలతల కాసారాన విరిసి
కన్నుల వెలుగులు నింపే కలువలై

జీవనవాహిని అలలుగ
మోహనరాగం పలుకగ
గగనపు వేదిక వెలయగ
భువనపు ముంగిట విరిసే

వెలుగుల పువ్వుకు

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు