సునంద భాషితం;- వురిమళ్ల సునంద, అర్కెన్సాస్ అమెరికా
 న్యాయాలు-587
పర్ణమయి న్యాయము
     *****
పర్ణమయి అనగా మోదుగ కఱ్ఱతో చేయబడిన స్తుక్కు లేదా వస్తువు/ సాధనం.
ఈ వస్తువును ప్రతి యజ్ఞం లోనూ ఉపయోగిస్తారు.ఈ స్తుక్కు లేనిదే యజ్ఞం జరుగదు కూడా.కావున దీనిని విధిగా అన్ని కర్మలందు ఉపయోగిస్తారు.అందుకే అన్ని తావులందు ఉపయోగించే సాధనంగానూ దీనిలాగే అన్ని సందర్భాల్లో అన్నింటిలో ఏదైనా వస్తువు గానీ ఎవరైనా వ్యక్తి గానీ ఉపయోగపడినప్పుడు ఈ "పర్ణమయి న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
 దీనినే తెలుగులోని "తలలో/ నోట్లో నాలుకలా" అనే సామెతతో పోల్చవచ్చు.
మరి నోట్లో నాలుక ఏం చేస్తుందో చూద్దాం.రుచులన్నింటినీ అనుభూతించేలా చేస్తుంది. నోటికి ఏది అహితమో, హితమో, ఏది శరీరానికి పడుతుందో? ఏది శరీరానికి పడదో తెలిపేది నాలుకే.నచ్చని రుచిని స్వీకరించడానికి అస్సలు ఇష్టపడదు.ఇది రుచులకు సంబంధించిన విషయమైతే ఇక నలుగురితో ఎలా మసలాలనే విషయానికి వస్తే నోట్లోంచి వచ్చే మాటలే కదా కొలమానాలు. ఆ కొలమానాలకు మూలం నాలుకే. "నరం లేని నాలుక" ఎటంటే అటు తిరుగుతుందని అంటుంటారు. అంటే మంచైనా చెడైనా పేరు వచ్చేది ఈ నాలుకతోనే అని అర్థము.
 ఇక వ్యక్తిగా తలలో నాలుకలా ఉండటం అంటే ఎదుటి వారి మనోభావాలను సరిగా అర్థం చేసుకుని వారికి అనుకూలంగా మసలుకుంటూ తన అవసరమైనప్పుడు చక్కని సలహాలిచ్చి వారికి సదా మేలు కలుగచేసే వ్యక్తి అన్నమాట.
అలాంటి వ్యక్తిని ఆత్మీయునిగానో, స్నేహితునిగానో, శ్రేయోభిలాషిగానో పొందిన వ్యక్తులు ఆ వ్యక్తి లేనిదే ఏ పనీ జరగదు,ఏ క్షణం గడవదు అతడు అన్నింటిలో ఉండాల్సిందే అంటుంటారు.
మరి తలలో నాలుకలా ఉండటం అంటే మామూలు విషయమేమీ కాదు.మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధి కలిగిన వారే అలా వుండగలరు.అలాంటి వారికి ఉదాహరణగా మహాభారతంలో పాండవులని చెప్పవచ్చు. వారు మొదటి నుంచి మంచి మనసు కలిగిన వారు, పరోపకార పరాయణులు.
అందుకే శ్రీకృష్ణ రాయబారంలో వాళ్ళ గొప్ప తనాన్ని విశ్లేషిస్తూ వారు తలలో నాలుకల వంటి వారని పొగుడుతాడు. మరి వారి గురించి చెప్పడమే కాదు.తాను కూడా  అనగా శ్రీకృష్ణ పరమాత్మ కూడా తలలో నాలుకలాంటి వాడే. ఆ విషయం ఆయన జీవితం చదివిన ఎవరికైనా తెలుస్తుంది.
 ఈ విధంగా భక్తితో కొలిచే శ్రీకృష్ణ పరమాత్మ మరియు పాండవులు మొదలైన వారిని గురించి తెలుసుకున్నప్పుడు "పర్ణమయి న్యాయము" లోని అంతరార్థము మనకు బోధపడుతుంది. మనమూ మన వంతుగా ఎలా ఉండాలో తెలుస్తుంది.

కామెంట్‌లు