న్యాయాలు -596
పింగళా జప న్యాయము
*****
పింగళ అనేది ఒక స్త్రీ పేరు,భాగవత పురాణాలలో ఒకానొక వేశ్య వృత్తి చేసే స్త్రీ పేరు.జప అంటే మంద్ర స్వరంతో ఉచ్ఛరించుట.ఏదేని మంత్రమును మంద్ర స్వరంతో పలుమార్లు ఉచ్ఛరించుట.వేద వారము చేయుట.దేవతల నామములను పలుమార్లు ఉచ్ఛరించుట అనే అర్థాలు ఉన్నాయి.
భాగవత కథల్లో పింగళ అనే స్త్రీకి సంబంధించిన కథ వుంది.పురాణాల్లో కూడా ఈ పింగళ ప్రస్తావన ఉంది.ఇంతగా పింగళ అనే స్త్రీ గురించి, ఆమె జపం గురించి చెప్పుకోవలసిన అవసరం ఏమిటా? అనే ఆలోచన మనకు తప్పకుండా వస్తుంది.మరి ఆ పింగళాకు సంబంధించిన వివరాలు విశేషాలు తెలుసుకుందామా...
విదేహ అనే పట్టణంలో పింగళ అనే స్త్రీ వుండేది. వృత్తి పరంగా ఆమె ఒక వేశ్య. చాలా సౌందర్యవతి. ఎందరో ధనవంతులు ఆమె అందానికి దాసోహమై తమ సమస్త సంపదలు పోగుట్టుకుని బికారులు అయిన వారు ఉన్నారు.
ఆమె చూపరులను ఆకర్షించే విధంగా అందంగా అలంకరించుకుని ప్రతి సాయంకాలం తన భవంతి ముందు కూర్చునేది. ఆ వీధిలో పోయే ధనవంతులు ఆమె అందానికి ఆకర్షితులై వచ్చే వారు.
అలా కాలం గడుస్తూ వుండగా ఒకరోజు సాయంత్రం యథావిధిగా సింగారించుకుని భవంతి ముందు కూర్చుంది. గంటలు గడుస్తున్నా ఎవరూ రాలేదు.అలా ఏ వ్యక్తి రాకపోవడంతో విసుగు చెంది లోపలికి వెళ్ళిపోయింది. చీమ చిటుక్కుమన్నా ఎవరో వచ్చారని అనుకోవడం.ఎవరూ రాలేదేమిటని ప్రశ్నించుకోవడం.అలా అర్థరాత్రి వరకు ఎదురు చూస్తున్న సమయంలో ఆమె మనసులో ఒకలాంటి విరక్తి భావన కలిగింది.
నేనేంటి? నేను చేస్తున్న పనేమిటి? ఎవరెవరి కోసమో ఎదురు చూడటం ఏమిటి?ఎందరో ధనవంతులు నన్ను నా అందాన్ని మెచ్చి ఇచ్చిన ధనంతో తరగని సంపద చేకూరింది.ఈ విధంగా సంపాదించిన సొమ్ములో చనిపోయేటప్పుడు కొంతైనా తీసుకుని పోగలనా?ఇంతకాలం చేసిన వృత్తి వలన ఎన్ని కుటుంబాలు ధన హీనమైపోయాయి? నాలాంటి వ్యక్తి చనిపోతే ఎవరైనా సానుభూతి చూపుతారా? .... ఇలా పరిపరివిధాల ఆలోచనలు, ప్రశ్నలు పింగళిని చుట్టుముట్టాయి. నిద్ర పట్టలేదు .తెలియని ఆవేదన ఆమె మనసులో నిండిపోయింది. తన వృత్తి మీద అసహ్యం వేసింది.ఇంతకాలం ఐహిక సంబంధమైన సుఖాలు,భోగాలనే ఎండమావుల వెంట పరుగులు తీశాననే పశ్చాత్తాపం కలిగింది.
ఆ ఆలోచనలు,వివేచన, విచక్షణ,అపరాధ భావన ఆమెలో ఒకలాంటి వైరాగ్యాన్ని , పశ్చాత్తాపాన్ని కలిగించాలి. తను చేయాల్సిన కర్తవ్యం ఏమిటో బోధపడింది. అప్పటికప్పుడే ఒక నిర్ణయానికి వచ్చి తన వేశ్యా వృత్తి జీవితానికి స్వస్తి పలికింది. ఆమె ఎప్పుడైతే తనలోని ఆశలను వదిలేసుకుందో ఆ క్షణమే ప్రశాంతతతో కూడిన నిద్ర పట్టింది.
ఆ విధంగా మార్పు వచ్చిన పింగళ నచ్చిన అన్ని రకాల ఆశలు,వ్యామోహాలను వదిలేసింది.దైవ జపం చేస్తూ తాను సంపాదించిన సొమ్మును ధర్మకార్యాలకు ఉపయోగిస్తూ,తీర్థ యాత్రలు చేస్తూ అంతిమ జీవితాన్ని అసలైన తృప్తితో గడుపుతూ తనువు చాలించింది.
ఇదీ పింగళ జీవిత కథ. మరి దీనిని మన పెద్దవాళ్ళు, ఆధ్యాత్మిక వాదులు ఎందుకు ఉదాహరణగా చెప్పారో చూద్దాం.
మనిషిలోని విపరీతమైన ఆశలు,భోగ లాలస ఇంద్రియాలను తప్పుదోవ పట్టిస్తాయి, ఎండమావి వంటి ఐహిక సుఖాలకు వెంపర్లాడేలా చేస్తాయి. పింగళది వృత్తి కావచ్చు.కానీ మనిషి ప్రవృత్తి ఎప్పుడూ కోరికలు లేదా ఆశలకు బానిసై, తానేంటో తన పుట్టుక ప్రయోజనం ఏమిటో తెలియకుండా జీవిస్తుంది.కాబట్టి మానవ జీవన పరమార్థం ఏమిటో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ "పింగళా జప న్యాయము"ను చెబుతూ ఈ శ్లోకాన్ని ఉదహరించారు.
"ఆశాహి పరమం దుఃఖం/ నైరాశ్యం పరమం సుఖం/ యథా సంఛింద్య కాంతాశాం/ సుఖం సుష్వాప పింగళా/
అంటే ఆశను జయించడం అంత సులభం కాదు కానీ సాధన చేస్తే ఆశను జయించడం అసాధ్యమేమీ కాదు.కాబట్టి ఆశను ఆశయ రూపంలో మార్చుకుంటే సమాజానికి మేలు జరుగుతుంది.మనకూ ఆత్మ తృప్తి అలౌకికమైన ఆనందమూ కలుగుతుంది. ఈ న్యాయము ద్వారా మనం తెలుసుకోవలసిన విషయం ఇదే.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి