పెద్దపాప నాగేంద్రుడు ;- డా.ఎం.హరికిషన్-కర్నూల్-9441032212

  ఒకూర్లో ఒకడుండేటోడు. వానికో కూతురుంది. ఆమె సక్కదనాల సుక్క. అచ్చం రబ్బరు బొమ్మ లెక్కుంటాది. దాంతో మొగుడూ పెండ్లాలు ఆ పాపను బాగా మురిపెంగా చూసుకునేటోళ్ళు. ఏదడిగినా కాదనకుండా తెచ్చిచ్చేటోళ్ళు. ఆ పాపకు మూడేళ్ళ వయసొచ్చేసరికి వాళ్ళమ్మ చచ్చిపోయింది. దాంతో వాడు ఇంట్లో దీపం పెట్టేటోళ్ళు ఎవరూ లేక మళ్ళా పెండ్లి చేసుకున్నాడు. ఆ వచ్చినామె పెద్ద గయ్యాలిది. మొగుని మాట అస్సలు పడనిచ్చేది కాదు. దాంతో వాడు ఆమె నోటికి భయపడి ఆమె ఏమి చెప్పినా నోరు మూసుకోని మట్టసంగా వూకొట్టేటోడు.
కొద్ది రోజులు పోగానే ఆమెకు గూడా ఒక కూతురు పుట్టింది. ఆ పాప గూడా బాగానే వుండేది. కానీ పెద్ద పాపంత అందగత్తె కాదు. దాంతో ఆమెకు పెద్దపాపను చూస్తానే ఒళ్లు మండిపోయేది. ఇంటి పనంతా ఆ పాపతోనే చేపిచ్చేది. పొద్దు పొడిసినప్పట్నించీ పొద్దు గూకేంత వరకూ ఒకటే పని.
పొద్దున్నే లెయ్యాల. కసులూడ్చాల. పెండకల్లు చల్లాల. కన్నెగా బండలు తుడ్చాల. అంట్లు తోమాల. బరగొడ్లను కడగాల. వాటికి కుడితి తాపాల. పాలు పితకాల. నీళ్ళు తావాల. అన్నం సేయాల. ఒక్కటని కాదులే అన్ని పనులూ పెద్దపాపే సేయాల. అట్లా పనులన్నీ సేసినాక బరగొడ్లను వూరి బైటకు తోలుకోని పోయి మేపుకోని రావాల.
పాపం ఇంత పని చేపిస్తా వుంది గదా... కనీసం తిండైనా బాగా పెడ్తాదా అంటే అదీ లేదు. ఉడుకుడుకన్నం తాము తినుకుంటా పాచిపోయిన అన్నం, మిగిలిపోయిన కూరలు మూటగట్టి బరగొడ్లకు పోయేటప్పుడు ఇచ్చేది. పాపమా పెద్దపాప వాటిని తినలేక పస్తులు పడుకుంటా చానా బాధలు పడ్తా వుండేది. సరిగా తిండి లేక ఆ పాప ముఖం పీక్కపోయి కళ తప్పింది.
ఒకరోజు పెద్దపాప ఆ పాచిపోయి కంపు కొడతావున్న అన్నం తినలేక, ఆకలికి తట్టుకోలేక ఏడుస్తా వుంటే అప్పుడే అటువేపుగా వచ్చిన ఒక ముని అది చూసి ''పాపా ! ఎందుకట్లా ఏడుస్తా వున్నావు? ఏంది నీ బాధ'' అనడిగినాడు. దానికాపాప కళ్ళెమ్మటి నీళ్ళు కారిపోతా వుంటే వెక్కి వెక్కి ఏడుస్తా జరిగిందంతా చెప్పింది.
దానికా ముని ''అయ్యో పాపం! అని జాలిపడి, జోలెలోంచి ఒక లడ్డు తీసిచ్చి దీన్ని ఎవరికీ కనబడకుండా యాడైనా గుంత తీసి బూడ్చి రోజూ నీళ్ళు పోయి. ఆ తర్వాతేమవుతాదో నువ్వే చూడు'' అన్నాడు.
ఆ పాప సంబరంగా ఆ లడ్డును తీస్కోని ఒక గుట్ట దాపున నాటి నీళ్ళు పోసింది. తర్వాత రోజొచ్చి చూస్తే ఆడొక మొక్క మోకాలంతెత్తు పెరిగి కనబడింది. ''ఇదేం మొక్కబ్బా ఒక్క రోజులోనే ఇంతెత్తు పెరిగింది'' అని ఆశ్చర్యపోతా మళ్ళా బిందెతో నీళ్ళు దెచ్చి పోసింది. తరువాత రోజు పొద్దున్నే ''ఈ రోజెంతైందో ఏమో?'' అనుకోని వురుక్కుంటా పోయి చూస్తే మొక్క పెరిగి పెద్దగై పూలు గూడా పూసింది. ఆ పాప సంబరంగా వురుక్కుంటా పోయి బిందెలకు బిందెలు నీళ్ళు దెచ్చి బాగా పోసింది.
తర్వాత రోజు పొద్దున్నే చకచకా పనులన్నీ చేసి, బరగొడ్లను తోలుకోని వురుక్కుంటా వచ్చి చూస్తే ఇంకేముంది... చెట్టు నిండా యాడ చూసినా సందు లేకుండా లడ్లేలడ్లు. ఆ పాప బెరబెరా కావాల్సినన్ని లడ్లు తెంపుకోని హాయిగా తినింది. ఆ రోజు నుండీ ఆ పాప బరగొడ్లను తోలుకోని పాసిపోయిన అన్నం కూర పాడేసి కావాల్సినన్ని లడ్లను కోసుకోని కడుపు నిండా తినసాగింది. కడుపు నిండా కమ్మగా తింటా వుంది గదా దాంతో మళ్ళా ఆమె ముఖం కళకళలాడ్డం మొదలుపెట్టింది.
అది చూసిన సవతి తల్లి ''ఇదేందబ్బా నా కూతురికి ఎంత పెట్టినా దాని మొఖం పీక్కోనిపోతా వుంటే దీనికి ఏమీ పెట్టకున్నా కళకళలాడతా వుంది. ఏంది కత'' అనుకోని కూతుర్ని పిల్చి ''ఈ రోజు నువ్వు అక్క వెనకాలనే ఆమెకు తెలీకుండా పో'' అని చెప్పింది. దాంతో చిన్నపాప అక్క వెనకాలనే దాచిపెట్టుకోని పోయి లడ్ల చెట్టును చూసి పరుగెత్తుకోని వచ్చి వాళ్ళమ్మకు చూసింది చూసినట్లు చెప్పింది. ''ఓహో! అదన్నమాట సంగతి'' అనుకోని ఆమె రాత్రికి రాత్రి ఎవరూ చూడకుండా గొడ్డలెత్తుకోని పోయి ఆ లడ్ల చెట్టును ఏళ్ళతో సహా నరికి పాడేసింది.
పెద్దపాప ఎప్పట్లాగా తర్వాత రోజు కూడా బరగొడ్లను తోలుకోని అడవికి పోయింది. అన్నం, కూరలు బరగొడ్ల ముందు పారనూకి ఎగురుకుంటా గుట్టకాడికి పోయింది. ఆడ చెట్టూ లేదు, లడ్లూ లేవు. పాపమా పాప బాధతో కిందామీదా పడి ఏడ్చసాగింది.
పెద్దపాప అట్లా ఏడుస్తా వుంటే మళ్ళా అదే దారిన తిరిగొస్తా వున్న ముని చూసి ''పాపా ! పాపా ... మళ్ళా ఏమొచ్చింది? ఎందుకట్లా ఏడుస్తా వున్నావు? ఏంది నీ బాధ?'' అనడిగినాడు. దానికా పాప కండ్లమ్మటి నీళ్ళు కారిపోతా వుంటే వెక్కి వెక్కి ఏడుస్తా జరిగిందంతా చెప్పింది. దానికా ముని అయ్యో పాపమని జాలిపడి జోలెలోంచి ఒక బంగారు పెట్టె తీసిచ్చి ''ఇది తీస్కో... ఇది అట్లాంటిట్లాంటి పెట్టె కాదు. కోరికలు తీర్చే బంగారు పెట్టె. నువ్వేం కోరుకుంటే అవి దీంట్లో నుండి వస్తాయి. నీ పెండ్లయ్యేంతవరకే ఇది పని చేసేది'' అని చెప్పినాడు. ఆ పాప ఆ పెట్టె తీసుకోని ఎవరికీ కనబడకుండా మట్టసంగా ఒకచోట దాచిపెట్టుకోని కావాల్సినవన్నీ తినుకుంటా హాయిగుంది.
ఒకరోజు వూర్లో రాకుమారునికి స్వయంవరం ఏర్పాటు చేసినారు. దేశదేశాల నుండి అందమైన ఆడపిల్లలు కిందినుండీ పైవరకూ నగలూ, హారాలు దిగేసుకోని రాసాగినారు. చిన్నపాపను గూడా వాళ్ళమ్మ బాగా అలంకరించి తీస్కోనిపోతా వుంటే పెద్దపాప ''అమా, అమా నేనూ వస్తా. నన్నూ తీస్కోని పో'' అనడిగింది. దానికామె ''అందరమూ ఆడికి పోతే ఇంట్లో పనులెవరు చేస్తారే'' అంటూ ఆమె చూడకుండా బియ్యంలో పిడికెడు రాళ్ళు కలిపి ''దీన్నిండా రాళ్ళున్నాయి. మేమొచ్చేసరికి అన్నీ మట్టసంగా ఏరి పెట్టు'' అని చెప్పి కూతుర్తో స్వయంవరానికి పోయింది.
పెద్దపాపకు గూడా స్వయంవరానికి పోయి రావాలనిపించింది. దాంతో అట్లా వాళ్ళు పోవడం ఆలస్యం గబగబా రాళ్ళన్నీ ఏరిపారేసి, తలస్నానం చేసి, వురుక్కుంటా పోయి పెట్టె తెచ్చుకోనింది. ఆమె కోరుకోవడం ఆలస్యం పట్టులంగా, పట్టు రైక, పట్టు కోక, గజ్జెలు, కమ్మలు, పాపిడి బిళ్ళ, వడ్డాణం, గాజులు, చెప్పులు... ఇట్లా ఒక్కటనేంది కింది నుండి పై వరకూ కావాల్సినవన్నీ ధగ ధగ మెరుస్తా ప్రత్యక్షమయినాయి. పెద్దపాప అవన్నీ ఏసుకోని ఏడు గుర్రాల రథమెక్కి స్వయంవరానికి ఝామ్మని పోయింది.
స్వయంవరంలో ధగ ధగా మెరిసి పోతా తిరుగుతున్న పెద్దపాపను చూసి అందరూ నోళ్ళు వెల్ల బెట్టినారు. . పెండ్లిగానోళ్ళు చేస్కుంటే ఇట్లాంటి బంగారు బొమ్మనే చేస్కోవాల అనుకుంటే... పెండ్లయినోళ్ళు కంటే ఇట్లాంటి సక్కదనాల సుక్కనే కనాల అనుకోసాగినారు. అట్లా పెద్దపాప కిలకిలకిల నవ్వుకుంటా, తిరుగుతా వుంటే చిన్నపాప చూసి వురుక్కుంటా వాళ్ళమ్మ దగ్గరికి పోయి ''అమా! అమా! అక్క గూడా ఈడికొచ్చిందే, అచ్చం దేవకన్య లెక్క, ఎంతందంగుందో తెల్సా'' అని చెప్పింది. దాంతో ఆమె ''పని చేయమంటే చేయకుండా వచ్చిందా, వుండు దాని సంగతి చెప్తా'' అని కోపంగా కట్టె తీసుకోని పెద్దపాప కోసం వెదకడం మొదలుపెట్టింది.
రాకుమారుడు ఒక్కొక్కరినే చూసుకుంటా వస్తా వుంటే కిలకిలకిల నవ్వుతా తిరుగుతా వున్న పెద్దపాప కనబడింది. ''ఎంతందంగుందీ పిల్ల... అచ్చం మెరుపు తీగ లెక్క'' అని సంబరంగా పోయి ఆమె చేయి పట్టుకున్నాడు. అప్పుడే పెద్దపాపను వెదుక్కుంటా ఆమె సవతి తల్లి అటువేపు వచ్చింది. పెద్దపాప అదిరిపడి ఆమె కంట పడగూడదని చేయి వదిలిచ్చుకోని పరిగెత్తి రథమెక్కి క్షణాల్లో మాయమైపోయింది. ఆమె అట్లా విడిపిచ్చుకొనేటప్పుడు ఆమె వేలికున్న వజ్రపుటుంగరం జారి రాకుమారుని చేతిలోకొచ్చింది.
రాజు భటులను పిల్చి ''ఇంటింటికీ పోయి దీన్ని అందరికీ తొడిగి చూడండి. ఎవరికి సరిపోతే వాళ్ళను తీస్కోనిరాండి'' అని చెప్పి పంపిచ్చినాడు. వాళ్ళు ఆ వుంగరం ఎవరికి సరిపోతాదా అని వెదుకుతా ఒకొక్క ఇండ్లే తిరుగుతా వీళ్ళింటికొచ్చి ''మీ ఇంట్లో పెండ్లి గావాల్సిన ఆడపిల్లలున్నారా'' అనడిగినారు. దానికామె ''వున్నారు'' అంటూ తన సొంత కూతుర్ని పిల్చుకోనొచ్చింది. ఆ పాప దాన్ని తొడుక్కోబోతే అది పట్టలేదు. అప్పుడే గడ్డిమోపు నెత్తిన పెట్టుకోని అటువేపు వచ్చింది పెద్దపాప.
భటులు ఆ పాపను చూసి ''ఆమె ఎవరు'' అనడిగితే ''మా పనిమనిషి'' అని చెప్పింది. కానీ వాళ్ళు ''అందరికీ తొడిగి చూస్తా వున్నాం గదా. ఈమెకు కూడా తొడిగి చూద్దాం. ఓ పనైపోతాది'' అనుకోని ఆ పాపను పిల్చి తొడిగి చూస్తే సరిగ్గా సరిపోయింది. దాంతో వాళ్ళు వురుకులు పరుగుల మీద పోయి రాకుమారునికి విషయం చెప్పినారు.
రాకుమారుడు సంబరంగా రథం మీద ఆడికొచ్చి పెద్దపాపను బంగారు పల్లకీలో కూచోబెట్టుకోని రాజభవనానికి తీస్కోనిపోయినాడు. దాసీలు ఆమెకు బాగా స్నానం చేపిచ్చి, పట్టుబట్టలు కట్టి, నగలు పెట్టేసరికి చూసేవాళ్ళ కళ్ళు జిగేల్‌మన్నాయి. ''అబ్బ! అచ్చం అప్సరస లెక్క ఎంత ముచ్చటగుందీ పిల్ల'' అనుకున్నారు. రాకుమారుడు వూరందరినీ పిల్చి అంగరంగ వైభోగంగా పెండ్లి చేసుకున్నాడు. పెద్దపాప చానా మంచిది గదా. అందుకని జరిగిందంతా మరిచిపోయి అమ్మను, చెల్లిని గూడా పెండ్లికి పిలిచి, బాగా మర్యాదలు చేసి మోయలేనన్ని నగలూ, హారాలు కానుకగా ఇచ్చి పంపిచ్చింది.
పెండ్లయిన కొన్ని నెలలకు పెద్దపాపకు కడుపొచ్చింది. ఆ పాపకు ఒకసారి పుట్టింటికి పోయి అమ్మను, చెల్లిని, వూర్లో వాళ్ళందరినీ చూసి రావాలనిపించింది. ఆమె అడిగిందే ఆలస్యం రాకుమారుడు ''సరే! పోయి తొందరగా రా'' అంటూ పల్లకీలో తీస్కోనిపోయి పుట్టింటిలో దిగబెట్టి వచ్చినాడు. ఆమె వూరందరికీ మంచి మంచి కానుకలు తెచ్చిచ్చింది.
సవతి తల్లి పైకి నవ్వుతూ మాట్లాడ్తా వున్నా లోపల మాత్రం ఈమె వైభోగం చూసి కుతకుతా వుడికిపోసాగింది. ''ఎట్లాగైనా దీన్ని చంపేసి, దీని స్థానంలో నా కూతురిని పెడ్తే నా కూతురు రాణైపోతాది గదా'' అనుకోని కూతుర్ని పిలిచి ఏం చేయాల్నో చెప్పింది.
ఒకరోజు చిన్నపాప, పెద్దపాప దగ్గరికి పోయి ''అకా! అకా! వూరి బైటున్న దేవాలయం చూసొద్దాం ... దా!'' అంటూ తీస్కోనిపోయింది. 
ఆ దేవాలయం పక్కనే ఒక పెద్ద బావి వుంది. అక్కను ఆ బావి కాడికి తీస్కోనిపోయి ''అకా! అకా! నీ నగలన్నీ నేనేసుకుంటా. నావన్నీ నీవేసుకో. అప్పుడు నీవందంగా వుంటావో, నేనందంగా వుంటానో నీళ్ళలో చూసుకుందాం'' అనింది. దానికి పెద్దపాప ''ఎవరందం వాళ్ళదిలే చెల్లీ... మనలో మనకు పోటీ ఎందుకు?'' అనింది. కానీ దానికి చిన్నపాప ఒప్పుకోలేదు. సరేనని పెద్దపాప తన నగలన్నీ చిన్నపాపకిచ్చి, చిన్నపాప నగలన్నీ తానేసుకోనింది. ఇద్దరూ బావిలోకి తొంగి చూసుకున్నారు. పెద్దపాప అలా చూస్తా వుంటే చిన్నపాప మట్టసంగా వెనుక నుండి ఆమె కాళ్ళు పట్టుకోని దభీమని లోపలికి తోసేసింది.
అట్లా తోసేసినాక ఇంటికి పోయి అచ్చం పెద్దపిల్ల లెక్కనే నగలన్నీ ముస్తాబు చేసుకోనింది. వారం రోజులు దాటినాక తీస్కోనిపోవడానికి ఆమె మొగుడొచ్చినాడు. వాడు ఆమెను చూసి ''ముఖమంతా పీక్కపోయి నా పెండ్లాం ఇట్లా వుందేందబ్బా...'' అనుకున్నాడు. అప్పుడు వాళ్ళమ్మ ''నిన్న చెరువుకాడ కాలు జారి మెట్ల మీద నుండి దబదబా కిందపడింది. కడుపు పోయింది. దాంతో ఏడ్చీ ఏడ్చీ ముఖమంతా అట్లా మాడిపోయింది''. అని కల్లబొల్లి మాటలు చెప్పి తన కూతురిని రాకుమారునితో పంపించేసింది.
ఈడ పెద్దపాపను బాయిలో తోసేసింది గదా. ఆ బాయిలో ఎన్నాళ్ళ నుండో ఒక ఏడు పడగల నాగేంద్రుడు పెళ్ళాం బిడ్డలతో కాపురమున్నాడు. ఆ నాగేంద్రునికి నాలుగు నెల్ల కిందట పడగ మీద పెద్ద పుండయింది. రోజురోజుకీ నొప్పి ఎక్కువయి పోతా వుందే గానీ తగ్గడం లేదు. ఆ సమయంలో పెద్దపాప, అంత పైనుండి సరిగ్గా పాముకి పుండెక్కడయితే అయిందో అక్కడ దభీమని పడింది. ఆ దెబ్బకు పుండు చిదిగిపోయి, లోపలున్న చెడంతా కారిపోయి, దెబ్బకు నొప్పి తగ్గిపోయింది. పెద్దపాప గూడా పడడం పడడం నాగరాజు మీద పడింది గదా దాంతో ఆమెకు గూడా దెబ్బలేం తగల్లేదు.
నాగరాజు సంబరంగా ఆమెను చూస్తా ''ఎవరమ్మా నువ్వు. చూస్తే నిండుమనిషి లెక్కున్నావ్‌, ఎందుకిట్లా బాయిలో పడినావు. ఏంది నీ బాధ'' అనడిగినాడు. అప్పుడామె వెక్కి వెక్కి ఏడుస్తా జరిగిందంతా చెప్పింది. నాగేంద్రుడు అయ్యో పాపమని జాలిపడి ''నువ్వేం బాధపడొద్దు. నీ మొగుడొచ్చి తీసుకోనిపోయేదాకా మా నాగలోకంలో మాతోపాటే వుండు'' అంటూ ఆమెను ఇంటికి తీసుకోని పోయినాడు. 
కొంతకాలానికి ఆమెకు పండులాంటి పిల్లోడు పుట్టినాడు. నాగేంద్రుడు, ఆయన పెండ్లాం బిడ్డలు, వూరోళ్ళు ఆ పిల్లోన్ని ప్రేమగా సొంతబిడ్డ లెక్క పెంచడం మొదలుపెట్టినారు. అట్లా ఆమెకు నాగలోకమే పుట్టినిల్లయింది. పిల్లోడు నెమ్మదిగా పెరిగి పెద్దగయి ఐదేండ్ల వయసుకొచ్చినాడు.
ఒకరోజు ఒక గాజులాయన ''గాజులమ్మా ! ... గాజులు !'' అని అరుసుకుంటా పోతా వుంటే అది విన్న పెద్దపాప ''అనా ! అనా! ఓ గాజులన్నా ... కాస్త ఇట్లావొచ్చి మాకు గాజులేసి పోన్నా'' అని బావిలోపల్నుండి పిలిచింది. వాడు చుట్టూ చూసి బావి లోపలికి తొంగి చూస్తే ఆమె కనబడింది. 
''లోపలికి ఎట్లా రావాలా'' అనడిగినాడు.
ఆమె నాగేంద్రున్ని తల్చుకోగానే పైనుండి లోపలికి మెట్లు ప్రత్యక్షమయినాయి. గాజులోడు లోపలికి దిగినాడు. ఆమె వానికి కనబడకుండా మొఖం మీద ముసుగేసుకోనింది. వాడు గాజులు తొడుగుతా వుంటే ఆమె కొడుకు ఆడుకుంటా ఆడికొచ్చినాడు. ఆ గాజులోనికి ఆ పిల్లోన్ని చూస్తే అచ్చం తమ రాజుని చూసినట్టే అనిపించింది. దాంతో వాడు ''అమా ! అమా ! ఎవరు నీవు ... ఈ బాయిలో ఎందుకున్నావు?'' అనడిగినాడు. ఆమె జరిగిందంతా చెప్పింది.
ఆ గాజులోడు పైకొచ్చినాక వురుక్కుంటా రాజు దగ్గరికి పోయి జరిగిందంతా చెప్పినాడు. దానికి రాజు ఆచ్చర్యపోయి ''అది నా పెండ్లామయితే మరి ఈడ ఇంట్లో వుండేదెవరు? దీని సంగతేందో కనుక్కోవాల్సిందే'' అనుకోని గాజులోని వేషమేసుకోని ''గాజులమ్మా! గాజులు!'' అని అరుసుకుంటూ మరుసటి రోజు బావికాడికి పోయినాడు.
ఆ అరుపులినగానే ''ఓ గాజులన్నా ! లోపలికి రా, నాకు మంచి గాజులేసి పోదువు గానీ'' అని పిల్చింది. వెంటనే బావిలోనికి మెట్లు ప్రత్యక్షమయినాయి. రాజు లోపలికి పోయినాడు. పిల్లోన్ని చూస్తే అచ్చు గుద్దినట్లు తన లెక్కనే కనబన్నాడు.
ఆమె మొగం వంక చూసినాడు. ఆమె మేలిముసుగు వేసుకోనింది గదా ... దాంతో మొఖం సరిగ్గా కనబల్లేదు. ధైర్యం చేసి ముసుగు పట్టి ఒక్క గుంజు గుంజినాడు. ఇంకేముంది తన పెండ్లామే. ఆచ్చర్యపోయినాడు.
రాజు అట్లా ముసుగు గుంజేసరికి ఆమె అదిరిపడి ''ఎవర్రా నువ్వు ? .... నా ఇంటికొచ్చి నా ముసుగే గుంజుతావా? ... వుండు, నీ పని చెబ్తా'' అంటూ నాగేంద్రున్ని పిల్చబోయింది. అప్పుడు రాజు ''ఆగాగు ! నేనెవరనుకుంటావున్నావ్‌. గాజులోన్ని కాదు. నీ మొగున్ని'' అంటూ వేషం తీసేసినాడు. ఆమె మొగున్ని గుర్తుపట్టి సంబరంంగా నాగలోకంలోకి తీసుకోనిపోయింది. నాగలోకమంతా వాళ్ళిద్దరినీ చూసి ''ఎంత ముచ్చటైన జంట. చిలకా గోరింకల్లెక్క'' అనుకుంటా ఆశీర్వదించి పుట్టింటోళ్ళు పెట్టినట్లు చీరాసారె పెట్టి కండ్లనీళ్ళతో అత్తింటికి సాగనంపినారు.
రాకుమారుడు ఇంటికొచ్చినాక ఇన్ని రోజులూ తనను మోసం చేసినందుకు చిన్నపాపకు గుండు కొట్టించి, గాడిద మీదెక్కించి, వూర్లో నుండి తన్ని తరిమేసినాడు.
*********** 

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
తెలుగు సాహిత్యము-కాసె సర్వప్ప కవి--తెలుగు సాహిత్యంలో కవిగా పేరు పొందిన వాడు కాసె సర్వప్ప కవి. ఈయన ఛందోబద్ధముగ, కవిత్వ లక్షణాలతో రాయ లేకపోయినప్పటికీ, ఇతడు రాసిన ద్విపద కావ్యం తర్వాత కాలం కవులకు కవిత్వం వ్రాయడానికి ఆధారమైంది. ఈయన రాసిన సిద్దేశ్వర చరిత్రమను నామాంతరం గల ప్రతాప చరిత్రమను ద్విపద కావ్యంగా ప్రసిద్దికెక్కింది.ఈ కావ్యమును అనుసరించి కాల నిర్ణయము చేయుట కష్టమని చరిత్ర కారులు అంటారు. కానీ ఈ కావ్యం చాలా పురాతనమైనదని చెప్పవచ్చును. ఈ గ్రంథము తర్వాత కాలంలో కూచిమంచి జగ్గకవి తను రాసిన సోమదేవ రాజీయ మునందు సర్వప్ప రాసిన ప్రతాప చరిత్రమను గ్రంధము నుండి అధిక భాగము సేకరించి యున్నాడు. అలాగే ప్రసిద్ధ కవి తిక్కన సోమయాజి చరిత్రమునందీ గ్రంధము నుండి చాలా భాగము ఉదహరించి రాసినాడు. ఇందుగల కొన్ని పంక్తులు గ్రహింపబడినవి. ద్విపద:- గణ ప్రసాదత గలిగిన సుతుని/గణపతి నామంబు ఘనముగా బెట్టి/తూర్పు దేశం బేగి తూర్పు రాజు లను/నేర్పుతో సాధించి యోర్పు మీరంగ/బాండు దేశాధీశు బాహు బలాఢ్యు/గాండంబులనుగొని గం డడగించి/చండవిక్రమ కళాసార దుర్వార/పాండిత్య ధనురస్త్రభద్రు డారుద్రు// ***. ***. ***. *** ఇది శ్రీసకలవిద్వదిభ పాద కమల/ సదమల సేవన సభ్యసంస్మరణ/భాసురసాధు భావనగుణానూన/భూసురాశీర్వాద పూజనీయుం డు/ కాసె మల్లన మంత్రి ఘనకుమారుండు/ వాసిగా జెప్పె సర్వప్పనునతడు.// కాసే సర్వప్ప రాసిన సిద్దేశ్వర చరిత్ర మరియు ప్రతాప చరిత్రము ఈ గ్రంథము కాదని వేరు వేరు గ్రంథాలని, కొందరు సాహితీ విమర్శకులు అంటారు. వాస్తవానికి ఈ కవి యొక్క ఇతర గ్రంథాలు కాలాదులు నిర్ణయించడానికి సరైన ఆధారాలు లేవు. కవిగా చరిత్రలో నిలిచాడు. *****. *****. *****. *****. ***** "*తెలుగు సాహిత్యము - భాస్కర పంతులు*" తెలుగు సాహిత్యములో భాస్కర పంతుల్ని ఒక కవిగా చెప్పుకుంటారు . ఈయన భాస్కరపంతులు కాదని భాస్కరాచార్యుడు అని కూడ తెలుస్తుంది. ఈ కవి తండ్రి పేరు బాల్లన. వీరి నివాస స్థానము పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఇది చరిత్ర ప్రసిద్ధమైన గ్రామము కాదు. ఈయన రచించిన గ్రంథం పేరు "కన్యకా పురాణము" అనే ఎనిమిది ఆశ్వాసముల పద్యకావ్యము. ఈ పురాణములో ఒక కథ ఉంది. ఈ కథ చారిత్రిక కథను పోలి ఉంటుంది. పెనుగొండలో కుసుమ శెట్టి అను ఒక కోమటి ఉంటాడు. అతనికి ఒక కుమార్తె ఉంటుంది. ఆమెను విష్ణువర్ధనుడు అను రాజు కామించి తన కివ్వ మంటాడు. తండ్రి అయిన శెట్టి అందుకు అంగీకరించడు. అందుకు కోపోద్రిక్తుడైన విష్ణువర్ధన మహారాజు ఆ కన్యను బలాత్కారము చేస్తాడు. శెట్టి , ఆతని కూతురు అగ్నిహోత్రములో పడి మృతులయినట్టు, వారితో పాటు 102 గోత్రముల వారు మృత్యు లయ్యారు. అప్పుడు కన్యక కోమట్ల లో ఎనుబది కుటుంబములు తూర్పునకును, నూరు కుటుంబాలవారు పడమటకును, ఇన్నూరు కుటుంబములు దక్షిణమునకును, నూట ముప్పది కుటుంబములు ఉత్తరమునకును పారిపోయారు. కన్యకా శాపము చేత విష్ణువర్ధనుని శిరస్సు ముక్కలై మరణించాడు. అతని కుమారుడైన రాజ నరేంద్రుడు వైశ్యులను శాంత పరచి కుసుమ శెట్టి కొడుకు అయిన విరూపాక్షునికి పదునెనిమిది పట్టణములకు అధికారిగా చేసి కోమట్లను శాంత పరిచాడు. మిగిలిన వారిని పెనుగొండలో ఉండమన్న ట్లు చెప్పబడింది.ఇప్పటికిని పెనుగొండ కోమట్లకు ముఖ్య పుణ్యస్థలం. ఎక్కడ కన్యకా పరమేశ్వరి ఆలయము నిర్మింపబడినా, ఆ దేవత వైశ్యులచే పూజలందుకోబడుతున్నది. గ్రంథకర్త అయిన భాస్కర పంతులనుబ్రాహ్మణుడు పెనుగొండ, కొండవీడు, రాజ మహేంద్ర వరం మొదలైన ప్రదేశములందుండీన కోమట్ల కు గురువయ్యాడు. కన్యకా పురాణం రచించి వైశ్యుల విషయమై కొన్ని కట్టుబాట్లను చేసి వాటిని ఆధారముగా 102 గోత్రముల వారిని లోబరుచుకున్నాడు. ఈ ఏర్పాటుకు కాదన్న వారిని కులభ్రష్టులుగా చేసి బహిష్కరించాడు. తనకు లోకువ అయిన వారికి పురోహితుడయ్యాడు.ఇదీ కన్యకా పరమేశ్వరి కథ నేటికిని ప్రాచుర్యంలో ఉన్నది. ఈ కవి గురించి నిశ్చయముగా తెలియకపోయినప్పటికీ ఇతడు 16వ శతాబ్దము ముందు వాడని అనిపించు చున్నది.ఈతని కన్యకా పురాణము నుండి రెండు పద్యములు: ఉ. అంతట నింకితజ్ఞు డగు నాకుసుమాఖ్యుడు నాదరంబున్/గాన్తను జూచి పల్కె ననుకంప దలిర్పగ నీ మనంబున్/జింత వహించి యిట్లనికి చెప్పుము నీకు మనో రథార్థముల్/సంతసమంద నిత్తును విచారము మానుము దైన్య మేటికిన్// ***. ****. *** *** చ. జలనిధి మేరదప్పిన నిశాకరబింబము త్రోవ దప్పినన్/బలువిడి ధాత్రి క్రుంగినను భాస్కరు డిట్లుదయింప కుండినన్/గులగిరి సంచలించినను గూర్మము భూమి భరింపకుండినన్/బలికిన బొంక నేరరు కృపా నిధులై తగు వైశ్యు లెప్పుడున్// ***. *****. ‌‌. **** ‌‌. *** ఈ పద్యములందు "కన్యకా పరమేశ్వరి" కావ్య చరిత్రలో వైశ్యుల నీతి నిజాయితీల గురించి వివరింపబడింది, ఈ కన్యకా పురాణము వ్రాసిన భాస్కర పంతులనుఆచార్యుడు తెలుగు సాహితీ చరిత్రలో శాశ్వతంగా నిలిచాడు.(54 విభాగము)-- బెహరా ఉమామహేశ్వరరావు సెల్ నెంబరు:9290061336
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
కాలములు - వర్తమాన కాలం - భూత కాలం - భవిష్యత్ కాలం - తద్ధర్మ కాలం వివరణను ఉపాధ్యాయులు కూకట్ల తిరుపతి ర్'ఇస్తారు వినండి. 
చిత్రం
భళిరే నైరా
చిత్రం