కృష్ణ వర్ణం త్విశాకృష్ణం సంగోపంగాస్త్ర పార్శదమ్
యజ్నైః సంకీర్తన ప్రాయైర్ యజంతి హి సుమేధసః
(శ్రీమద్భాగవతము 11.5.32)
‘ఈ కలియుగంలో ఆవిర్భవించి, సదా కృష్ణ నామాన్ని గానం చేసే భగవత్ అవతార మూర్తిని… మేధోసంపత్తి కలిగిన మనుషులు సామూహిక సంకీర్తనలతో ఆరాధిస్తారు. తన వర్ణం నలుపు కాకపోయినా, అతను సాక్షాత్తూ శ్రీకృష్ణుడే. ఆయన సంకీర్తన ఉద్యమాన్ని స్థాపించడానికి తన అనుచరులతో కలిసి ఈ భూమిపై అవతరిస్తారు’.
భగవద్గీత ప్రకారం మనం మరణ సమయంలో భగవంతుడిని స్మరించగలిగితే, ఆయనను ఖచ్చితంగా పొందగలము. కాబట్టి, రోజువారి పనులు చేస్తూనే, ఆయనను అన్ని సమయాల్లో స్మరిస్తూనే ఉండాలి. ఆ స్వామి యొక్క గుణములు, లక్షణములు, మరియు మహిమలు గుర్తు చేసుకుంటూ ఆయనను స్మరించవచ్చు. దృఢ సంకల్పముతో యోగ ధ్యానములో మనస్సుని నామ సంకీర్తన ద్వారా ఆయనపైనే కేంద్రీకరించాలి. మన మనస్సుని సంపూర్ణంగా అనన్య భక్తితో ఆయన పైనే నిమగ్నం చేసినప్పుడు మనము ఈ భౌతిక జగత్తుకి అతీతంగా ఆధ్యాత్మిక స్థాయిలోనికి వెళతాము.భగవంతుడు సర్వజ్ఞుడు, అత్యంత ప్రాచీనుడు, అందరినీ శాసించేవాడు, సూక్ష్మము కంటే సూక్ష్మమైన వాడు, అన్నింటికీ ఆధారమైన వాడు, ఊహాకందని దివ్య స్వరూపం కలవాడు; ఆయన సూర్యుడి కంటే తేజోవంతుడు మరియు సమస్త అజ్ఞానపు చీకట్లకీ అతీతుడు. ఎవరైతే మరణ సమయంలో, యోగ అభ్యాసము చేత లభించిన అచంచలమైన మనస్సుతో, ప్రాణములను కనుబొమల మధ్యే నిలిపి, నిశ్చలంగా దివ్య మంగళ భగవంతుడిని అత్యంత భక్తితో స్మరిస్తారో, వారు ఖచ్చితంగా ఆయనను పొందుతారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి