సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు -642
మండూక తులా న్యాయము
*****
మండూకము అనగా కప్ప,ఒక ఋషి పేరు.తులా అనగా త్రాసు,తూనిక,పోలిక,సామ్యము అనే అర్థాలు ఉన్నాయి.
 మండూక తులా అనగా కప్పల తక్కెడ.కప్పలు ఒక చోట కుదురుగా వుండవు. వాటిని తూచడం సాధ్యం కాదు అని అర్థము.
 మరి మండూక తులా న్యాయము అంటే ఏమిటో తెలుసుకుందాం.
 ముందుగా కప్ప గురించి విషయాలు విశేషాలూ తెలుసుకుందాం.కప్పను ఉభయచరం అంటారు.నీటిలోనూ భూమి మీద నివసిస్తుంది.దృఢమైన శరీరం,పొడుచుకు వచ్చిన కళ్ళు,ముందు భాగంలో జోడించబడిన నాలుక,కింద ముడుచుకున్న అవయవాలు కలిగి ఉంటుంది. కొన్ని కప్పలు తమను తాము రక్షించుకోవడానికి ఊసరవెల్లిలా రంగులు మారుస్తుంటాయి.
పర్యావరణంలో జరిగే నష్టాన్ని తమ అరుపుల ద్వారా ముందస్తు హెచ్చరికలు చేస్తుంటాయి.అందుకే కప్పలను పర్యావరణ పరిరక్షకులు అంటారు.
 సాహిత్య పరంగా  చూసినట్లయితే  మండూకం గురించి ఏకంగా ఒక ఉపనిషత్తు ఉండటం విశేషం.దీనిని మాండూక్యోపనిషత్తు అంటారు.ఇది అథర్వణ వేదానికి చెందినది.ఇందులో 12 మంత్రాలు మాత్రమే ఉన్నాయి.కానీ మొత్తం ఉపనిషత్తుల సారం ఇందులో ఇమిడి ఉంది.నాలుగు మహా కావ్యాలలో ఒకటైన 'అయమాత్మా బ్రహ్మ ' అనేది ఈ ఉపనిషత్తులోనే ఉంది.ఇది మండూక మహర్షి ప్రోక్తమైనందున దీనిని మాండూక్యోపనిషత్తు అంటాం.
 ఇక అసలు విషయానికి వద్దాం.
 మండూక తులా అంటే కప్పల తక్కెడ అని మనకు తెలుసు కదా! మరి ఆ పేరు ఎందుకు వచ్చిందో ముందే చెప్పుకున్నాం. కానీ దీనిని మన పెద్దలు   మనుషులకు వర్తింపజేసి చెప్పడానికి కారణం ఏమిటో  చూద్దాం.
మనిషికి కప్పల తక్కెడ వంటి మనసు వుంటే చాలా కష్టం. ఒకే పని మీద దృష్టి పెట్టకుండా రెండు మూడు పనులు ఒకే సారి మొదలు పెడతారు. ఒక పని పూర్తి కాకముందే మరోపనిలోకి  కప్పలా దూకుతారు. సరే అక్కడైనా చివరిదాకా వుండి దానిని పూర్తి చేస్తారా అంటే అదీ చేయరు.మళ్ళీ మొదటి పనిలో జొరబడతారు. ఇలా ఎందులో నిలకడ లేకుండా చేస్తుంటారు.
ఇలా సాధ్యం కాని పనులను మొదలు పెట్టి నిలకడగా  ఆ పని మీద నిలబడక తెలివి తక్కువగా,అనేక లొసుగులతో చేసే పనులను కప్పల తక్కెడ వ్యవహారం అంటారు.
 వాళ్ళు ఎంతో సమర్థవంతంగా చేయాలని అనుకున్నా  ఏదో ఒక పొరపాటు జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి వారిని ఎవరూ ఇష్టపడరు.ప్రోత్సహించరు.వాళ్ళు చేసే పనిని గుర్తింపుకు నోచుకోదు.సానుభూతి  పొందదు.ఇలా లొసుగులతో కూడిన తెలివితక్కువగా అనాలోచితంగా చేసే పనులను "కప్పల తక్కెడ వ్యవహారం"అంటారు.
 దీనికి ఓ  సరదా కథ కూడా  ఉంది.ఓ తెలివి తక్కువ  వ్యక్తి  చెరువుకు వెళ్లి కొన్ని కప్పలను పట్టుకొని వచ్చాడట.వాటిని  సమానంగా రెండు భాగాలుగా చేయాలనుకొని తూచడం మొదలు పెట్టాడట.కప్పలు కుదురుగా వుండవు కదా! ఒకవైపు పెట్టి మరొక వైపు పల్లెంలో పెట్టేలోపే ముందు తక్కెడలో పెట్టిన వన్నీ దూకసాగాయి. అలా ఎంత సేపు చేసినా అతని ప్రయత్నం సఫలం కాలేదు. అది చూసిన వారు నవ్వుతూ" కప్పల తక్కెడ వ్యవహారం" ఎంతకూ తేలేది కాదురా బాబూ! వాటిని తూచాలని అనుకోవడమే తెలివితక్కువ తనం అని వెళ్ళిపోయారు.
 మరి ఇందులో ఇమిడి ఉన్న అంతరార్థం ఏమిటో తెలుసా! కప్పల్లో అనైక్యత సహజ లక్షణం.మరి అలాంటి వాటిని మనుషులుగా భావిస్తే  మనుషుల్లో కూడా ఆ కప్పల్లాంటి వారు ఉన్నారని చెప్పడమన్న మాట.
 కలిమిడితనం లేని వారిని ఒక దగ్గర చేర్చి ఏదైనా పని చేద్దాం అనుకుంటే అయ్యే పని కాదు.కప్పల్లాగే మనుషులు కూడా నిలకడగా ఉండక పోవడం వల్ల పని పూర్తి కాదు.కారణం వీరిలో ఐక్యత లేకపోవడం. .
ఏదైనా కార్యాన్ని చేయడానికి ఎన్ని సార్లు ప్రయత్నించినా   మనుషుల్లో ఐక్యత లేకపోవడం వల్ల పని ఆగిపోయినప్పుడు అందరూ అనే మాట "మండూక తులా న్యాయము"అంటే ఇదేనని.
మరి అవంటే జంతువులు.మనుషులం అలా కాదు కదా! ఇలా అనైక్యత ఉన్నంత కాలం ఏవీ సాధించలేమని తెలుసుకోవాలి.ఏదైనా సాధించాలంటే  ఐకమత్యం,కృషి, పట్టుదల మొదలైనవి ఉండాలి.అప్పుడే  ఈ "మాండూక తులా న్యాయము" లోని లొసుగులు తొలగిపోతాయి.అనుకున్న కార్యం విజయవంతం అవుతుంది .


కామెంట్‌లు