తిరుమలరావుకు దీపావళి పురస్కారం

 జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత, యుటిఎఫ్ జిల్లా కౌన్సిలర్ కుదమ తిరుమలరావుకు మరో అరుదైన పురస్కారం లభించింది. విశాఖపట్నం శ్రీదేవి విజ్ఞాన జ్యోతి పరిష్కార్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు డా కుప్పిలి కీర్తి పట్నాయక్ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో ఆదర్శవంతమైన సేవలు అందిస్తున్న వారిని గుర్తించి దీపావళి పురస్కారాలను ప్రకటించిన నేపథ్యంలో, ఉపాధ్యాయ రంగానికి సంబంధించి కుదమ తిరుమలరావుకు పురస్కారాన్ని ప్రకటించడం జరిగింది. విశాఖపట్నంలో నిర్వహించనున్న కార్తీక సమారాధన వేదికపై త్వరలో ఈ పురస్కార ప్రదానం గావించనున్నట్లు పురస్కార పత్రంతో పాటు తిరుమలరావుకు సమాచారాన్ని పంపారు. విశాఖపట్నం శ్రీదేవి విజ్ఞాన జ్యోతి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ కుప్పిలి కీర్తి పట్నాయక్, తదితర ప్రముఖులచే ఈ ప్రత్యేక పురస్కార సత్కారాన్ని తిరుమలరావు స్వీకరించనున్నారు. 1989లో సెకండరీ గ్రేడ్ టీచరుగా నియామకం పొందిన తిరుమలరావు, 1999లో జిల్లాస్థాయి, 2004లో రాష్ట్రస్థాయి, 2009లో జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను పొందియున్నారు. విద్యాశాఖకు, పాఠశాలకు నిరంతరము తనదైన శైలిలో కొత్త సృజనాత్మకతతో ఎనలేని సేవలతో విద్యార్థుల విద్యా స్థాయి మెరుగుదలకు ఎంతగానో కృషి చేస్తున్న తిరుమలరావు, అదనపు సమయాల్లో చిత్రకారునిగా, రచయితగా, స్వరకల్పకునిగా, దర్శకునిగా, గాయకునిగా, నటుడిగా, సామాజిక స్పృహ కలిగిన సేవకునిగా మరో వైపు మిక్కిలి కృషి చేయుచున్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా, కొత్తూరు మండలం, కడుము పాతపొన్నుటూరు పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. తిరుమలరావు నిరంతరం విశిష్ట సేవలతో, సృజనాత్మకత కలిగిన ప్రతిభతో, అనేక పురస్కారాలు పొందుట పట్ల రాజాం రచయితలు వేదిక కన్వీనర్ గార రంగనాథం తదితరులు హర్షం వ్యక్తం చేసారు.
కామెంట్‌లు