న్యాయాలు-667
రక్త పట న్యాయము
*****
రక్త అనగా రంగు వేయబడిన, ఎఱ్ఱనైన,అనురాగయుక్తమైన, ప్రియమైన, మధురమైన.పట అనగా వస్త్రము,వలువ, దుస్తులు,చీర అనే అర్థములు ఉన్నాయి.
"రంగు చీర కట్టుకోవడం వల్లనే ముత్తైదువ అని తెలిసినట్లు" అనగా చెప్పక్కర్లేకుండానే లక్షణాదులను బట్టి వాస్తవిక స్థితి తెలియవచ్చినట్లు.
ముందుగా చీర గురించి, స్త్రీల వస్త్రధారణ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం.
వస్త్రము అంటే చీర కానీ వాడుకలో స్త్రీలు మాత్రమే కట్టుకునే వస్త్రాన్ని చీర అని పిలవడం జరుగుతోంది.భారతదేశంలో స్త్రీలు ధరించే దుస్తులలో ముఖ్యమైనది చీర. ఈ చీర అత్యంత పొడవైన వస్త్రము. ఇది నాలుగు మీటర్లు మొదలుకొని తొమ్మిది మీటర్ల వరకు ఉంటుంది. పరికిణీ లేదా లంగాను ధరిస్తారు. దాని పైన ఛాతీ భాగాన్ని లేదా వక్షస్థలం కప్పేందుకు రవిక ధరిస్తారు.పరికిణీ లేదా లంగా చుట్టూ చుడుతూ కుచ్చిళ్ళు, కొంగుతో చీర కట్టుకుంటారు.చీర కొంగు వేసుకునే విధానంలో ఉత్తర భారత దేశానికి దక్షిణ భారతదేశానికి తేడా వుంటుంది. ఉత్తర భారత దేశంలో స్త్రీలు కుడివైపు, దక్షిణ భారత దేశంలో స్త్రీలు ఎడమవైపు పైట వేసుకుంటారు.
యువతులు పెళ్ళికి ముందు లంగా ఓణీని ధరిస్తారు నేటికీ ఈ ఆచారాన్ని కొన్ని చోట్ల తప్పకుండా ఆచరించడం మనం చూడవచ్చు.
యువతి పెళ్ళయిన తరువాత కట్టూ బొట్టులో మార్పు వస్తుంది.చేతులకు ఆకుపచ్చ, ఎరుపు రంగులో గాజులు వేసుకోవడం, కట్టుకునే వస్త్రాల్లో ఇలాంటి రంగు రంగుల చీరలు ధరించడం చూస్తుంటాం.అలా రంగు రంగుల చీరలు ధరించడాన్ని బట్టి ఆమె ముత్తైదువా కాదా అని తెలిసేది.
ఎందుకంటే భర్తను కోల్పోయిన స్త్రీ కేవలం తెలుపు రంగు చీరలనే ధరించాలనే నియమం ఉండేది. అలా అప్పటి వరకు సంతోషంగా ఉన్న జీవితం నడిసంద్రంలో విసిరేసినట్లు ఉండేది. వారు కట్టుకునే చీరలే కాదు భోజనంలో కూడా మార్పు ఉండేది.
ఆ ఉద్దేశ్యంతోనే, అలాంటివి చూసి ఈ "రక్త పట న్యాయము" మన పెద్దలు సృష్టించారేమో అనిపిస్తుంది.
ఈ న్యాయం ఆడవాళ్ళకే సంబంధించినది అంటే అవుననే చెప్పాలి.
తెల్ల చీర స్వచ్ఛతమ చిహ్నం అని అంటారు కానీ భర్త చనిపోయిన స్త్రీకి తెల్లచీర మాత్రమే కట్టుకొమ్మని ఆదేశిస్తూ వుంటారు.అందుకే చీరను బట్టి ఎవరో ఇట్టే తెలిసిపోయేది.
మరి ఇది కేవలం "స్త్రీలు కట్టుకునే వస్త్రాల "మీద ఉందా? ఇంకేదైనా ఉందా?: అంటే ఉందనే చెప్పాలి.
చేసే పనులు, మాట్లాడే మాటలు కొన్ని కులాల వారీగా , జాతుల వారీగా, మతాలు ఉంటాయని మనకు తెలుసు. ఉదాహరణకు కొన్ని సామెతలు ,జాతీయాలను చూద్దాం... పక్కలో బల్లెం - రాజులు ఉపయోగించే మాటలు.2.కొత్త కుండలో నీళ్ళు చల్లన- కుమ్మరి.3. వీసంలో మాసం తీస్తారు- స్వర్ణకారులు.4.కోటిచ్చి కోమటిని కొనాలి- వైశ్యులు 5. ఏతమేసి తోడినా ఏరు ఎండదు- రైతులు.. వారు ఉపయోగించే మాటలను బట్టి వాళ్ళు ఎవరో తేలికగా తెలిసిపోయేది.
ఇలా కేవలం కుల మతాలే కాదు ఆయా వ్యక్తులు ఉపయోగించే కొన్ని మాటలను బట్టి "పూలలో సువాసన మనిషిలో మంచితనం దాచితే దాగదు అన్నట్లు" వారి మనసు ఎలాంటిదో ఉపయోగించే పదజాలంతో తెలుసుకోగలిగే వాళ్ళం.
ఇదండీ! "రక్త పట న్యాయము"లోని అసలైన అర్థం. మాట,నడత,కట్టు బొట్టు వ్యక్తిత్వాన్ని తెలుసుకునేలా ఒకప్పుడు చేసేవి.
కానీ ఈరోజుల్లో ఎవరు ఎలాంటి వారో మాట తీరు వ్యవహారం అన్నీ అనూహ్యంగా మారిపోయాయి.అందువల్ల ఎవరు ఏమిటి తెలుసుకోలేక పోతున్నాం. ఎందుకనీ? కాల ప్రభావమా? మనిషితనమా? ఎవరికి వారు ప్రశ్నించుకోవాల్సిందే.
సునంద భాషితం :- వురిమళ్ల సునంద, ఖమ్మం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి