ఎలుగుబంటి అడవిలో అంగడి పెట్టాలనుకుంది. చీరల అంగడి పెడదామా, గాజుల అంగడి పెడదామా, రంగుల అంగడి పెడదామా, బొమ్మలు అంగడి పెడదామా అని తెగ ఆలోచించింది. ఏ జంతువుకైనా మూడు పూటలా కావలసింది తిండే కాబట్టి మంచి రకరకాల ఫలహారాలు తయారు చేసే అంగడి పెడదాము బాగా జరుగుతుంది అనుకుంది.
అడమంతా తిరిగింది. రకరకాల అంగళ్లు కనపడ్డాయి. పూరీలు, దోసెలు, వడలు, కాఫీలు, టీలు... ఇలా అన్నిచోట్ల అవే. రోజంతా పనిచేయాలి. అలాగాక కేవలం సాయంకాలం మాత్రమే నడిపే అంగడి పెడదామనుకుంది.
బజ్జీల అంగడి గుర్తుకు వచ్చింది. ఎక్కడ చూసినా మిరపకాయ బజ్జీలు, ఆలూ బజ్జీలు, ఉల్లిపాయ బజ్జీలు మాత్రమే కనబడుతున్నాయి. కొత్తరకం బజ్జీలు రుచి చూపిస్తే అందరూ తన అంగడికి ఎగబడతారు అనుకుంది.
వెంటనే పక్కనే ఉన్న నగరానికి పోయి, కొత్త కొత్తవి ఏమేమి చేయొచ్చో కనుక్కొని, ఒక మూడు నెలల్లో వాటన్నింటినీ నేర్చుకొని మరలా అడవికి వచ్చింది. ఒక మంచిరోజు చూసి పని మొదలుపెట్టింది. వంకాయ బజ్జీ, కాకరకాయ బజ్జీ, తమలపాకు బజ్జీ, అరటికాయ బజ్జీ... ఇలా రకరకాలవి చేసి, కమ్మని మసాలాలు వాటి మీద చల్లి తయారు చేసింది. ఏ బజ్జీలు అయినా సరే 40 రూపాయలు మాత్రమే అనే ఒక అట్టముక్క మీద రాసి ముందువైపు తగిలించింది.
అడవిలో తిరిగే జంతువులన్నీ ఆ అంగడిని చూస్తున్నాయి, వెళుతున్నాయి. కానీ ఏవీ దగ్గరికి రావడం లేదు. ఏదో అప్పుడప్పుడు కొన్ని మాత్రమే వస్తున్నాయి. రోజులు గడుస్తున్నాయి గానీ పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రావడం కష్టంగా మారింది. ఎందుకబ్బా అని విచారంగా దిగులు పడసాగింది.
ఒకరోజు ఒక జింకపిల్ల ఆ అంగడికి వచ్చింది. అది ఎప్పుడూ కొంచెం దూరంలో ఉండే వేరే అంగడికి పోయేది. కానీ ఆరోజు ఎందుకో వాళ్ళు మూసేశారు. ఆకలితో వేరే అంగడి కోసం వెతుకుతా వుంటే ఈ ఎలుగుబంటి అంగడి కనపడింది. చూస్తే ధరలు ఎక్కువగా ఉన్నాయి. తిట్టుకుంటానే ఒక వంకాయ బజ్జి కావాలి అంది.
వంకాయలు నూనెలో కాల్చి, విడిపోకుండా మధ్యకు కోసి, మసాలా కూరి, శెనగపిండిలో ముంచి, వేడివేడి నూనెలో వేసి దోరగా వేయించింది. కత్తితో ముక్కలు కోసి, కొంచెం కారం, మసాలా పైన చల్లి, తరిగిన ఉల్లిపాయలు ఒక మజ్జిగ మిరపకాయ వేసి అందించింది. తింటావుంటే కమ్మగా, అద్భుతంగా, గాలిలో తేలిపోతున్నట్లుగా అనిపించింది.
"ఆహా... ఏం రుచి. నేను పుట్టి బుద్ధి ఎరిగినప్పటినుంచి ఈ అడవిలో ఇంత కమ్మని బజ్జీ ఎప్పుడూ తినలేదు. ఆహా ఓహో అద్భుతం" అంటూ తమలపాకు బజ్జి, ఆలూ బజ్జి, కాకరకాయ బజ్జి అలా ఒకదాని వెనుక ఒకటి వరుసగా లొట్టలు వేసుకుంటా లాగించేసింది.
చుట్టూ వున్న అంగళ్ళన్నీ జనాలతో కిటకిటలాడుతూ వున్నా అక్కడ మాత్రం ఎవరూ లేరు. అది చూసి జింకపిల్ల "నీ బజ్జీలు అద్భుతంగా వున్నప్పటికీ నీవు పెట్టిన ధర చాలా ఎక్కువగా ఉంది. అందుకే ఎవరూ నీ దగ్గరికి రావడం లేదు. కొంచెం తగ్గించుకో" అంది.
"నేను మంచి నూనె, కల్తీ లేని సరుకులు వాడుతుండడం వల్ల పెట్టుబడి ఎక్కువ అవుతుంది. అందుకే ధర గూడా ఎక్కువ పెట్టాను. ఇంతకంటే తక్కువకి ఇస్తే నాకు గిట్టుబాటు కాదు" అని చెప్పింది.
"ఎలుగుబంటి మామా... నువ్వు చెప్పింది నిజమే. కానీ నీ దగ్గరికి వచ్చి ఒకసారి రుచి చూస్తే కదా నీ బజ్జీల గొప్పదనం తెలిసేది. సరే ధర తగ్గించకుండా అందరూ వచ్చే ఇంకొక ఉపాయం చెబుతా. అలా చేయి" అంటూ ఏం చేయాలో చెప్పింది.
తర్వాతరోజు అక్కడికి కొంచం దూరంలో మరొక బజ్జీల అంగడి ఎలుగుబంటి తన మిత్రుడు నక్కతో పెట్టించింది. అందులో కూడా ఇక్కడ దొరికే బజ్జీలు అన్నీ ఉన్నాయి. కానీ బయట "ఏది తిన్నా యాభై రూపాయలు మాత్రమే" అని రాసి ఉన్న పెద్ద అట్టముక్క పెట్టించింది.
అడవిలోని జంతువులు అది చూసి "అబ్బా... మరీ యాభై రూపాయలా. పక్కనే ఎలుగుబంటి దగ్గర చూడు. నలభై రూపాయలకే దొరుకుతుంది" అంటూ ఎలుగుబంటి దగ్గరికి రాసాగాయి. ఒకసారి తింటే చాలు ఆ రుచికి ఎవరైనా సరే వంగి సలాం చేయాల్సిందే కదా... దాంతో వ్యాపారం నెమ్మదిగా వూపందుకోసాగింది. తిన్నవాళ్లే మరలా మరలా రావడం మొదలుపెట్టారు. చుట్టుపక్కల వాళ్ళకు కూడా చెప్పసాగారు. చూస్తుండగానే "బజ్జీలు తినాలంటే ఎలుగుబంటి అంగడికే పోవాలా" అనే పేరు అడవంత మోగిపోయింది. ఆ తరువాత కొద్ది రోజులకు ఎలుగుబంటి పక్కనున్న బజ్జీల కొట్టును తీసేసింది.
**********
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి