కన్నీళ్ళు ఉబికి వస్తున్నాయి.
కళ్ళు తదేకంగా శూన్యంలోకి చూస్తున్నాయి.
జ్ఞాపకాల అలలు ఉవ్వెత్తున లేస్తున్నాయి.
అంతరంగమంతా అనుభవాల శూలాలతో గుచ్చినట్లనిపిస్తున్నది.
తెల్లారితే తెగిపోయే అనుబంధాలు గుర్తొచ్చి మనసు బరువెక్కుతున్నది.
చివరికోరిక అడిగినప్పుడు చిగురించిన ఆశొకటి, మాట్లాడించినప్పుడు నెరవేరింది.
రాత్రి అలా సాగిపోతూనే ఉంటుంటే బాగుండనిపించింది.
గతస్మృతులన్నీ ఒక్కటొక్కటిగా గిర్రున కళ్ళముందు తిరుగుతున్నాయి.
స్వేదం అవిశ్రాంతిగా అభిషేకం చేస్తున్నది.
నిద్ర ఉపవసించి జాగారం జరుపుతున్నది.
రక్తపోటు,చక్కెర స్థాయిలు కొంచెం పెరిగి,
నాడీ సమస్థితిలో కొట్టుకుంటున్నది.
నా శ్వాస నాకే వినిపిస్తున్నా,
నా హృదయధ్వని మరణమృదంగం మోగిస్తున్నా,
ఉషోదయపు కిరణాల ఆనవాలు పొడసూపకున్నది.
కునుకు తీస్తున్న కోడి కూతెప్పుడు పెడుతుందో తెలియకున్నది.
గతం తాలూకు గాయాలెన్నో రేగుతున్న వేళ,
వర్తమానం తాజావార్త కాబోతున్నది.
భవిష్యత్తు లేని జీవితానికి బాధే సోపతవుతున్నది.
ముత్తైదవుగా ఉరికంబం ముస్తాబై క్రతువు నిర్వహించబోతున్నది.
చెక్క ప్రక్కకు తొలిగి,కాళ్ళు వేలాడే దృశ్యం కనబడుతుంటే,
ఆత్మ విమోకమై,ఉసురు ఉసూరుమనే వేళ ఆసన్నమైంది.
ఉరిశిక్ష ఉయ్యాలపాటై, జోల పాడబోతున్నది.
మనసు,శరీరం అచేతనమై అంతర్థానమై పోబోతున్నది.
ఉరితాడు కర్తవ్యనిర్వహణకు ఉవ్విళ్ళూరుతున్నది.
తలారి విద్యుక్తధర్మాన్ని విధి తప్పించనంటున్నది.
ఒక తల్లి కడుపులోని పేగు కలుక్కుమని,
ఒక భార్య పుస్తె పుటుక్కుమని తెగిపోయి,
ఒక తండ్రి గుండెలోని తడి ఆరిపోయి,
నిశ్శబ్ద మావరించింది.
కరుణ లేని మృత్యువు కాలనేమియై గమిస్తున్నది.
======================================
(బ్లడ్ మనీ అనే తమిళచిత్రంలో కువైటులో ఉరిశిక్ష పడ్డ ఖైదీ అంతరంగ మథన చూచి స్పందించి)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి