ఎడ్ల లక్ష్మి ‘చిలకలబండి పుస్తక ఆవిష్కరణ

 సిద్ధిపేటకు చెందిన ప్రముఖ బాల సాహితీవేత్త, కథా రచయిత్రి, గేయకర్త శ్రీమతి ఎడ్ల లక్ష్మి రచించిన కొత్త పుస్తకం ‘చిలకలబండి’ ఆవిష్కరణ ఈ రోజు జరిగింది. సిరిసిల్లలోని రంగినేని చారిటబుల్‌ ట్రస్ట్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ పుస్తకావిష్కరణ జరిగింది./ 
ప్రముఖ బాల సాహితీవేత్త, కథా రచయిత గరిపెల్లి అశోక్‌ అధ్యక్షతన జరిగిన ఆవిష్కరణ సభలో విశిష్ట అతిథిగా హాజరైన శ్రీమతి మాడభూషి లలితాదేవి పుస్తకాన్ని ఆవిష్కరించారు./ కార్యక్రమంలో ప్రముఖ కవి జూకంటి జగన్నాథం ముఖ్య అతిథిగా పాల్గొనగా, బాల సాహితీవేత్తలు స్వరాజ్యం వెంకటరమణమ్మ, డా.అమరవాది నీరజ, తెలుగు విశ్వవిద్యాలయ పురస్కార గ్రహీత ఎన్నవెళ్ళి రాజమౌళి, ఎడ్ల భూంరెడ్డి, పెందోట వెంకటేశ్వర్లు, ఉండ్రాళ్ళ రాజేశంలు పాల్గొన్నారు./   ఎడ్ల లక్ష్మి ఈ బాల గేయ సంపుటిని ప్రముఖ బాల సాహితీవేత్త, కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత డా. పత్తిపాక మోహన్‌`డా. సిరిసిల్ల చందన దంపతులకు అంకితం చేశారు. ముఖ్య అతిథి జూకంటి జగన్నాథం మాట్లాడుతూ తెలంగాణలో ఇవ్వాళ్ళ బాల సాహిత్య వికాసం అద్భుతంగా  జరుగుతోందని, అందుకు ఈ పుస్తకాలు నిదర్శనమన్నారు. 
ఆవిష్కర్త మాడభూషి లలితాదేవి మాట్లాడుతూ, ‘ఎడ్ల లక్ష్మి ప్రతిభావంతురాలైన బాల గేయకర్త అని, గృహిణిగా ఉంటూ పదికిపైగా బాల సాహిత్య రచనలు చేయడం విశేషమని, కేవలం బాల సాహిత్యమే కాకుండా చిత్రకారిణిగా, కథా రచయిత్రిగా, మంగళహారతుల కర్తగా విశేషమైన సేవ చేస్తున్నారని, కొత్త పుస్తకం చిలకల బండి చక్కని, చిక్కని బాల గేయాల కలకండ అంటూ ఆవిడ ప్రశంసించారు. కవయిత్రి శ్రీమతి ఎడ్ల లక్ష్మి మాట్లాడుతూ, వందలాది మంది పిల్లల మధ్య ఈ ఆవిష్కరణ జరగడంవల్ల తాను ఎవరికోసమైతే రచనలు చేస్తున్నానో వారికి పుస్తకం అందిందని అన్నారు. కార్యక్రమంలో సిద్ధిపేట, సిరిసిల్ల, కరీంనగర్‌కు చెందిన పలువురు బాల సాహితీవేత్తలు, కవులు, రచయితలు పాల్గొన్నారు.
కామెంట్‌లు