శ్రీకాకుళం జిల్లాకు చెందిన కడుము పాతపొన్నుటూరు పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయులు కుదమ తిరుమలరావు, ఆడవరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు భోగెల ఉమామహేశ్వరరావులు జాతీయ స్థాయి లేఖ ఏన్యువల్ అవార్డ్స్ -2024 కళారత్న బిరుదాంకిత పురస్కారాలను అందుకున్నారు. శిష్టకరణ లేఖ ఐక్యవేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎన్.ఐ.ఎమ్.ఎస్.ఎమ్.ఇ. శిక్షణా కేంద్రం ఆడిటోరియంలో ఈనెల ఏడవ తేదీన జరిగిన సమావేశంలో ఈ ఇద్దరు ఉపాధ్యాయులూ ఎంపికైనట్లు లేఖ చీఫ్ ఎడిటర్ జన్నుమహంతి వెంకట చంద్రబాబు, లేఖ ఫౌండర్ పబ్లిషర్ శేఖరమంత్రి నరహరినాథ్ లు ప్రకటించారు. ఈ ఇరువురి కళారత్న అవార్డులను శిష్టకరణ లేఖ ఐక్యవేదిక ప్రతినిధుల తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటీ వైస్ ఛైర్మన్ పి.జగన్మోహనరావు చేతులమీదుగా కుదమ తిరుమలరావు, భోగెల ఉమామహేశ్వరరావులు స్వీకరించి నేడు సత్కారాలు పొందారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో గల రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయంలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో వీరికి కళారత్న బిరుదాంకిత పురస్కారాలను ప్రదానం గావిస్తూ వీరి సేవలను కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతులైన శిష్టకరణాలను పదకొండు విభాగాల్లో ఎంపిక చేసి ఈ లేఖ ఏన్యువల్ అవార్డ్స్ -2024 పేరిట బిరుదాంకిత పురస్కారాలను ప్రదానం చేసారు. అందులో కళారత్న విభాగంలో తిరుమలరావు, ఉమామహేశ్వరరావులను జన్నుమహంతి వెంకట చంద్రబాబు, శేఖరమహంతి నరహరినాథ్ ల నేతృత్వంలో ఎంపికైనట్లు జగన్మోహనరావు తెలిపారు. తొలుత ప్రతిభా పాటవాలు కలిగియున్న శిష్టకరణాల వివరాలను సేకరించుటలో భాగంగా అంతర్జాలం ద్వారా నామినేషన్ యాప్ లను ఉపయోగించారు. సీనియర్ శిష్టకరణ న్యాయనిర్ణేతల బృందం చేపట్టిన ఎంపిక ప్రక్రియలో, తమకు స్థానం కల్గించుట పట్ల తిరుమలరావు, ఉమామహేశ్వరరావులు కృతజ్ఞతలు తెలిపారు.
వీరిద్దరూ లేఖ కళారత్న బిరుదాంకిత పురస్కారాలు పొందుట పట్ల ఆలిండియా శిష్టకరణ సంఘ అధ్యక్షులు డబ్బీరు కృష్ణారావు, తెలంగాణ రాష్ట్ర శిష్టకరణ అధ్యక్షురాలు డి.రమ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శిష్టకరణ అధ్యక్షులు పోలుమహంతి ఉమామహేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెలగాం జయబాబు, శిష్టకరణ ప్రతినిధులు సింహగిరి పట్నాయక్, పట్నాయకుని రామకృష్ణా రావు రామతాత, డా.బి.ప్రవీణ్ సాయి, శ్రీకాకుళం జిల్లా శిష్టకరణ అధ్యక్షులు డబ్బీరు వాసు, జిల్లా గౌరవాధ్యక్షులు బలివాడ మల్లేశ్వరరావు తదితరులు హర్షం వ్యక్తం చేసారు. తిరుమలరావు, ఉమామహేశ్వరరావులు నటన, దర్శకత్వం, గానం, చిత్రలేఖనం, రచన, స్వరకల్పన, నృత్య రూపకాలందు ఘనమైన కృషిచేస్తూ సత్ఫలితాలను సాధిస్తూ రానున్న శిష్టకరణ తరాలకు ఎంతో ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి