సుప్రభాత కవిత : - బృంద
కొండ కోనల కావల 
రెండు మబ్బుల మాటున 
నిండు నింగిని వెలిగిస్తూ
మెండు కాంతులు కురిపిస్తూ..

వడిగా దిక్కులు ఆక్రమిస్తూ 
జడిగా వెలుగులతో కమ్మేస్తూ 
తడి నీడల లోతున తాకి 
నడి ఏరున మణి దీపజ్యోతిలా..

కడలి చేరు క్రమంలో నదికి 
బడలిక తీరేలా ముద్దుపెట్టి 
నడకలలో తడబాటన్నది లేక 
కడవరకు  సాగుమని  దీవించే 

కన్నతండ్రిలా  ధైర్యమిస్తూ 
చిన్న చెల్లికి అండదండగా 
అన్నలా వెన్ను తట్టి పంపే
వెన్నలాంటి మనసున్న కర్మసాక్షికి 

వేల జోతలు మదిలో  నింపి 
వేకువకై వేచిన జగతికి 
వేలుపులా  వేంచేసి  
వేగముగా వరముల నిమ్మని వేడుతూ 

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు