న్యాయములు-724
సమ వాయస సంబంధ న్యాయము
*****
సమ అనగా అన్నింటిలో సమ భావం కలిగిన.వాయస అనగా కాకి.సంబంధ లేదా సంబంధం అనేది సమ మరియు బంధం అనే సంస్కృత పదాల నుండి ఉద్భవించింది.సమానమైన మైత్రి అని అర్థము.
"సమ వాయస సంబంధం" అనగా కాకులు అన్నింటిలో సమభావం కలిగిన మైత్రి ఉంటుందని అర్థము. వాటి మైత్రి బంధంలో ఎప్పుడు ఎలాంటి మార్పు రాదు. మానవుల్లా కాదు అనే అర్థంతో ఈ "సమ వాయస సంబంధ న్యాయము"ను మన పెద్దలు ఉదాహరణగా చెబుతుంటారు.
మరి వాటి స్నేహ బంధం కలుపుకుని పోవడం, కలుపుగోలుతనం మొదలైన విషయాలను కూలంకషంగా తెలుసుకుందాం.
కాకులలో ఉన్న గొప్ప గుణం మానవుల్లో కనిపించనిది ముఖ్యంగా ఒకటుంది.అదేమిటంటే ఐకమత్యం. ఒక్క కాకికి కష్టం వస్తే వంద కాకులు ఏకమై వచ్చి ఓదార్చడం మనం చూస్తుంటాం. పైగా వాటిని "కాకుల మంద" అని ఈసడిస్తాం. ఇక పొరపాటున ఎవరైనా వ్యక్తి కాకుల్లో ఒకదానిని కొట్టడమో లేదా హాని కలిగించడమో చేస్తే మిగతా కాకులన్నీ మందగా వచ్చి ఆ వ్యక్తిపై దాడి చేస్తాయి. అలా కాకుల గుంపు లేదా మంద ఎక్కడ ఉన్నా తామంతా కలిసి మెలిసి ఉంటాయి.కేవలం మనుషులే కాదు ఇతర పక్షులు, జంతువులు ఏవైనా సరే సామూహికంగా తమ ప్రత్యర్థుల అంతు చూస్తాయి.
మరి మనుషులో ... పక్కింటిలో ప్రాణం పోతున్నా చూస్తూ నాకెందుకులే అనుకుంటారు. కేవలం బంధు మిత్రులు తప్ప ఇతరులు ఎవరూ పట్టించుకోరు.
ఇక కాకిలో ఉన్న మరో గొప్ప తనం/గుణం ఏమిటంటే ఆహారం ఎక్కడైనా కనబడితే ఆబగా ఒక్కతే అస్సలు తినదు.కావు , కావు మంటూ కాకుల మందను పిలిచి అన్నీ వచ్చిన తర్వాతే తింటాయి. తల్లి ప్రేమ గురించి చెప్పక్కర్లేదు.తన సంతానం కాకపోయినా చిన్నప్పుడు కోకిల గుడ్లను సైతం పొదుతుంది. ఆహారం తాను తినకుండా ముందు తన బిడ్డల నింపుతుంది.
ఇక తన గూటి నుండి కాకి పిల్ల కిందపడితే మిగిలిన కాకులన్నీ ఆ పిల్లకాకిని రక్షించమని చుట్టూ తిరుగుతూ గోల చేస్తాయి. అలా రక్షిస్తాడు అనుకున్న వ్యక్తిని ఏమీ చేయవట కూడా.
కాకులకు తెలివితేటలు, జ్ఞాపకశక్తి ఎక్కువట. మనం చిన్నప్పుడు చదువుకున్నాం కడవలో నీళ్ళు తాగడానికి గులక రాళ్ళు తెచ్చి వేసిందని,ఆ నీళ్ళు పైకి రాగానే తాగిందనీ. అలాగే అది నత్తగుల్ల పై పెంకు గట్టిగా ఉంటుంది కాబట్టి దాన్ని చెట్టు మీద నుంచి కిందకు విసిరి అది పగిలిన తర్వాత పై పెంకు ముక్కలు తీసి లోపలి నత్తను తింటుందట.అంటే దీనిని బట్టి కాకి ఎంత తెలివైనదో అర్థం చేసుకోవచ్చు.
ఇక కాకికి సంబంధించిన విషయం మహాభారతంలోని కర్ణపర్వంలో ఉంది.కురుక్షేత్ర యుద్ధంలో శల్యుడు కర్ణుడికి రథ సారథిగా ఉంటూ కర్ణుని కించపరిచే విధంగా హంసకాకియోపాఖ్యానం చెబుతాడు.అనగా హంసతో ఎగరడంలో కాకి పోటీ పడిందనీ సముద్రంలో ఎగరలేక పందెంలో ఓడిపోతే హంసే వచ్చి కాకిని రక్షిస్తుందని ఈ ఉపాఖ్యానంలో ఉంది.అయితే కాకి నూటొక్క రకాలుగా ఎగురగలదట.అంటే ఎగరడంలో రకరకాల విన్యాసాలు చేయగలదన్న మాట .
ఇక జ్ఞాపక శక్తి విషయానికి వస్తే ఒకసారి ఓ వ్యక్తి అవి చూస్తూ ఉండగా కాకి గూటిని కింద పడేశాడట. ఆ తర్వాత కాకులు మందగా వచ్చి అతన్ని తలపై పొడిని,గోర్లతో గీరాయట. దాంతో ఆ వ్యక్తి అటు వెళ్ళడానికే భయపడి పోయాడట. చాలా కాలం అతన్ని గుర్తు పెట్టుకుని ఆ విధంగా బాధించాయట.
ఇంకా వాటిని మన భారతీయ సంస్కృతిలో పితృదేవతలకు ప్రతినిధులుగా భావిస్తారు. మరణించిన వ్యక్తి ఆత్మ సంతృప్తిగా ఉంటే ఇంటివారు పెట్టిన ఆహారం తింటుందని, లేదంటే కాకి ముట్టదని అంటారు.'బలగం' సినిమా చూసిన వారందరికీ విషయం తెలిసిందే.
ఇలా కాకులు తమ సంఘజీవులు. ఐకమత్యంతో ఉంటాయి.ఏ ఒక్కదానికి ఏమి జరిగినా మిగతావి వెంటనే స్పందిస్తాయనీ తెలుసుకున్నాం.
ఈ సమ వాయస సంబంధం న్యాయము ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి ఏమిటంటే వాటిలా ఐకమత్యంతో ఉండాలి. ఆ చిన్న పక్షి ఇచ్చిన గొప్ప సందేశాన్ని ఎప్పుడూ గమనంలో ఉంచుకోవాలి. ఉన్నది పంచుకోవడంలోనూ,కష్టాల్లో ఆదుకోవడంలోనూ ఆత్మ తృప్తి,సేవా తత్వం దాగి వున్నాయని మనకు తెలిసిపోయింది.వాటిలా మనం కూడా ఉన్నప్పుడే కాకిలా మన జీవితం కూడా సార్ధకం అవుతుంది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి