విశ్వాసం :- గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.-సెల్.9491387977.-నాగర్ కర్నూల్ జిల్లా.
 పాలకుర్తి అను గ్రామములో పావని అను పాలవర్ధకురాలు ఉండేది. ఆమె శివ భక్తురాలు. మొదట శివునికి పాలాభిషేకం చేసిన తర్వాతనే పాలను విక్రయించేది. వచ్చిన విక్రయ ధనంతో జీవనము సాగిస్తుండేది. ప్రతిరోజూ ఒక శివాలయంలో అభిషేకార్థం పాలు తెచ్చి పోస్తుండేది. కానీ ఆమె అనుదినం ఆలస్యంగా వస్తుండడం వలన విసిగిపోయిన ఆలయ పూజారి ఒకనాడు"రేపటి నుంచి తొందరగా పాలు తేకపోతే ఆమె ఖాతాను తొలగిస్తానని హెచ్చరించాడు. పాపం! ఆమె చాలా బాధపడి"పూజారి గారు! పాలు తొందరగా తేవాలంటే నేను నదిని దాటి రావాలి. నదిని దాటించే పడవ వాడు తన బేరాల కోసం పడవను పెందరాళే కట్టడం లేదు. నన్నేం చేయమంటావు? అని దీనంగా ప్రార్థించింది. అందుకు ఆ పూజారి వేళాకోళంగా"భవసాగరాన్ని తరింపజేసే భర్గుడిఅభిషేకానికి పాలు తీసుకువస్తుంటే ఆలస్యం ఎందుకు ఉంటుంది? నువ్వా భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటే పడవ లేకుండనే నాది దాటి రాగలవు"అన్నాడు. చిత్తం చిత్తం అని ఆమె తిరిగి వెళ్ళిపోయింది.
       మరునాడు సరిగ్గా తగిన సమయానికి పాలను తెచ్చి అందించింది. పూజారి ఆశ్చర్యంగా చూసి" ఏమే! ఈరోజు పడవ వాడు పెందరాళే వచ్చాడా? అని అడిగాడు. అందుకు ఆమె నవ్వుతూ"లేదు లెండి పూజారి గారు! పడవ ఎక్కి వస్తే ఆలస్యం అవుతుందని, నిన్న మీరు చెప్పినట్లుగా ఆ శివుని నామస్మరణ చేస్తూ నది మీద నుండి నడిచి వచ్చాను"అంది. అదిరిపడ్డాడు పూజారి.
నది మీద నుంచి నడిచి వచ్చావా?
ఈశ్వర్ నామ స్మరణ చేస్తూ వచ్చావా? నేనేమైనా అమాయకుడివనుకుంటివా? నీ హరికథలు నమ్మడానికి అని గర్జించాడు. కానీ ఆమె మాత్రం నిశ్చలంగా, నిర్భయంగా నిలబడి"అయ్యో! కావాలంటే మీరే వచ్చి చూడండి. భవసాగరాన్ని తరింప చేయగల భగవంతుడికి, భక్తుల చేత నది దాటించడం పెద్ద పని కాదు. ఆయననే నమ్ముకుని, ఆయన నామాన్ని స్మరిస్తే ఈ నది ఒక లెక్కలోనిది కాదు" అన్నది.
        పూజారి వెంటనే ఆమె వెంట బయలుదేరాడు. నమశ్శివాయ ఓం నమశ్శివా అనుకుంటూ ఆ పాలవర్తకురాలు నది మీద నుంచి నడుచుకుంటూ వెళ్లిపోసాగింది. పూజారికి అది కలో నిజమో తెలియలేదు. తాను కూడా శివనామ స్మరణ చేస్తూ, నది మీద నిలవబోయాడు. కానీ అతనికి అది సాధ్యం కాలేదు.
      చూశారా పూజారి చెప్పిన విషయం పట్ల ఆ పాల వ్యాపారస్తురాలికి ఉన్న నమ్మకం భగవంతుని పట్ల విశ్వాసమయింది. తనను విశ్వసించిన వారిని ఏనాడు దాదా చేయని ఆ దైవం ఆమె నా నది మీద నడిపించాడు. కానీ ఇతరులకు చెప్పడమే తప్ప తను చూసి శివారాధన మీద కానీ, ఆరాధించే శివుని మీద గాని, జపించే శివనామం మీద గాని పూర్తి విశ్వాసం లేని పూజారి నదిని దాటలేకపోయాడు.
అందుకే మన పెద్దలు"నిత్యం ప్రేమ ఒక్కటే చాలదు. విశ్వాసం కూడా ఉండాలి. ఆ రెండూ ఉన్నప్పుడే మనకు భగవంతుని దయ లభిస్తుందని ప్రబోధిస్తూ చెప్పారు.

కామెంట్‌లు