సునంద భాషితం:- వురిమళ్ల సునంద, ఖమ్మం

 
న్యాయములు -731
సుభగా బాలోది తాఖ్యాయికా న్యాయము
****
సుభగా అంటే అనకూలవతి యగు భార్య. బాలో అనగా చిన్నతనమునకు, బాలునికి.ఉదితా అనగా చెప్పబడినది , పుట్టినది. ఖ్యా అనగా చెప్పు,వెల్లడించు అనే అర్థాలు ఉన్నాయి.
ఒక అనుకూలవతియైన స్త్రీ లేదా  భార్య తన పిల్లవానికి/ బాలునికి చెప్పిన కథ వలె.
ఒకానొక వనిత తన పిల్లవాడిని/ కుమారుడిని ఆడిస్తూ వాడి కోరిక మేరకు ఓ కథను ఈ విధంగా చెప్పింది.
"అనగనగా ఒక రాజు.ఆ రాజుకు ముగ్గురు కొడుకులు వారిలో ఇద్దరు పుట్టారు.మరొకడు కడుపులోనే ఉన్నాడు కానీ ఇంకా పుట్టలేదు. ఆ ముగ్గురు కొడుకులు కలిసి ఆడుకొంటూ ఉండేవారు.ఒకరోజు వాళ్ళు ముగ్గురూ కలిసి ఉళక్కి పట్టణమునకు వేటకు బయలు దేరారు.త్రోవలో వారికి ఆకాశము మీద పండ్లతో వంగి యున్న చెట్టొకటి కంటబడింది.వెంటనే వారా చెట్టు దగ్గరికి వెళ్ళారు.ఆ చెట్టు ఉన్న నగరం పేరు భవిష్యన్నగరం. ఆ ముగ్గురు పిల్లలు భవిష్యన్నగరంలో ఇంకనూ వేటాడుతూనే ఉన్నారు.అని చెప్పారావిడ.." పిల్లవాడు కథ నిజమే అనుకుని ఊ కొట్టుచూ వింటున్నాడు.
వింటున్న పిల్లవాడు చిన్నవాడు కాబట్టి  అమ్మ చెప్పే దాంట్లో  నిజం ఉందా లేదా తెలుసుకోలేని స్థితి.ఇంకా పుట్టని పిల్లవాడితో ఎలా కలిసి వెళ్తారు? పైగా ఉళక్కి పట్టణము అంటే ఉత్తుత్తి పట్టణం.వేటకు బయలుదేరడం. వేటకు పట్టణానికి  కాదు కదా వెళ్ళేది. ఆకాశం మీద పండ్లతో వంగి యున్న చెట్టు. ఇదో అసత్యం. పైగా చెట్టు ఉన్న పట్టణం పేరు భవిష్యత్తును సూచిస్తుంది. ఆ ముగ్గురూ భవిష్యత్తు నగరంలో వేటాడుతూనే ఉన్నారట.
ఉళక్కి పట్టణము అన్నప్పుడే నిజం తెలుసుకోవాలి. తల్లి ఊహాలోకాన్ని, అబద్ధాలతో మేళవించి చెప్పిన మాటలని, అంతా  మాయ అని మనకు తెలుస్తూనే ఉంది కదా!
మరి ఎందుకలా చెప్పి వుంటుంది.అందులో ఏమైనా మతలబు ఉందా? పెద్దవాళ్ళు ఈ "సుభగా బాలోది తాఖ్యాయికా న్యాయము" ను ఉదాహరణగా చెప్పడానికి గల కారణాలు ఏమిటో తెలుసుకుందాం....
వారి దృష్టిలో సంసారము కూడా  ఓ మాయ లాంటిదే.స్త్రీ పురుషులు మాయచే ఆవరించబడి అనేక కష్టముల బారిన పడతారు. ఆశా పాశముల చుట్ట పాపపు పనుల్లో మునిగి మృతులయ్యాక కర్మఫలాలకు అనుకూలంగా మరో జన్మ మెత్తి మరోచోట నశిస్తాడు.అలా జనన మరణాలు సంభవిస్తాయి.. 
అయినా సంసారం నిజమే అనే నమ్మకంతో పడరాని పాట్లు పడుతున్నారు.ఎవరో  కొందరే అలా పడుతున్నారనీ, .సంసారమనే మాయ నిజమనే అనే భ్రమలో పడి అసలు విషయం మాట మరిచిపోతున్నారు.ఇలా సంసారం నిజమే అనుకుంటూ అందులోనే  జీవితం అనుకుంటూ ... మునగుతూ తేలుతూ,దారి కానరాక గమ్యం తెలియక  పడరాని పాట్లు పడుతున్నారు ఈ విధంగా మాయలో పడకుండా చూసుకోవాలనీ, ఒకవేళ అందులో పడితే విచక్షణతో బయటకు వచ్చేందుకు వీలుగా చూసుకోవాలి అంటూ తల్లి పాత్ర ద్వారా మనకు చెప్పించారు.
ఇదండీ "సుభగా బాలోది తాఖ్యాయికా న్యాయము లోని అంతరార్థము.
ఈ న్యాయము చదువుతున్న మనకు "అంతా వట్టిదే.. వస్తా వట్టిదే - పోతా ఒట్టిదే నరుడా! అంటూ తాత్వికులు పాడే పాట గుర్తుకు వస్తుంది కదా!
మనమూ, మన చుట్టూ ఉన్నదే మాయా ప్రపంచం అయినప్పుడు తప్పించుకునే వీలు ఎలాగూ ఉండదు. అలాగని అందులోనే పడి కొట్టుకు పోకుండా బయట పడేందుకు "మా(మ)నవ" ప్రయత్నం చేయాలి. అంతే కదండీ!మరి మన ప్రయత్నం చేద్దాం.
===========================================
గత రెండు సంవత్సరాలుగా  సంస్కృత న్యాయాలకు నేను  రాస్తున్న తెలుగు వ్యాఖ్యానాలను ఎంతో ఆదరిస్తున్న మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ...వచ్చే నూతన సంవత్సరం కూడా ఇలాగే కొనసాగిస్తానని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి లాగే ఆదరిస్తారని ఆశిస్తూ... 🙏
మీ సునంద వురిమళ్ల, ఖమ్మం

కామెంట్‌లు