సునంద భాషితం : - వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయములు-752
"హసద్భిః క్రియతే కర్మ రుదద్భి రనుభూయతే" న్యాయము
******
హసద్భిః అనగా నవ్వుతూ. క్రియతే అనగా కర్మ అనగా రుదద్భి అనగా ఏడ్చుచూ,అనుభూతయే అనగా అనుభవింతురు అని అర్థము.
"నవ్వుతూ మహా సంతోషము పొందుతూ ఉన్న వారలచే చేయబడు కర్మ- ఏడ్చుచూ ఉన్న వారలచే అనుభవింపబడును". అని అర్థము.అనగా "పిల్లికి చెలగాటం -ఎలుకకు ప్రాణ సంకటం"అన్నట్లు.
 కొంతమంది ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ చలాకీగా వుంటారు. వాళ్ళను చూస్తుంటే వీళ్ళకు ఏ బాదర బంధీలు లేవా అనిపిస్తుంది. ఇక మరికొందరు ఏదో పోగొట్టుకున్న వారిలా దుఃఖంతో వుంటుంటారు. అలా  దుఃఖం వేదనతో ఉండే వారికి సంతోషంగా ఉన్న వారిని చూస్తుంటే మరింత దుఃఖం కలుగుతుంది.ఎదుటి వారు పచ్చగా ఎదుగుతూ, నవ్వుతూ వుంటే వీరు తట్టుకోలేరు.‌అంటే వారి అభివృద్ధి చూస్తున్నా కొద్ది వీరిలో మరింత కోపం,బాధ ఎక్కువ అవుతుంది.
 ఇక్కడ నవ్వుతూ సంతోషంగా ఉండటం అంటే ఏది జరిగినా విధి లిఖితం తప్పించుకోలేం అనుకోవడంలో మనసు ఎలాంటి ఆందోళనకు లోనవ్వదు. "అంతా కృష్ణార్పణం" అన్నట్లు భగవదర్పితం అనుకుంటే ఎక్కడ లేని నిశ్చింతగా ఉంటుంది...
ఆనందంగా ఉండే కొందరి మోముల్లో ఎప్పుడూ చిరునవ్వుతో కూడిన ప్రశాంతత వెలుగుతూ వుంటుంది.‌అందుకే వారు ఏ పని చేసినా అందరి విజయవంతం అవుతుంది.
ఇక పనిలో పనిగా  "పిల్లి వేట' గురించి నాలుగు మాటలు తెలుసుకుందాం. . పిల్లి  మాంసాహార జంతువు. ఇది ఎలుకను చాలా ఒడుపుగా పట్టుకుని  ఒక్కసారే చంపుకుండా దాన్ని అలా వదిలేస్తూ ఉంటుంది.అది "బతుకు జీవుడా!  అని వెళ్ళిపోయే ముందు చటుక్కున పంజాతో వెనక్కి లాగుతుంది. అలా దాన్ని ఒక్కసారిగా చావనీయకుండా దానిని హింస పెడుతూ ఆనందిస్తుంది.చిట్ట చివరికి అది చనిపోయిన తర్వాత ఆరగిస్తుంది.
 దీనిని మనిషి మనస్తత్వంతో పోలుస్తూ మరో కోణంలో చూస్తే మనిషి నైజం కూడా అలాంటిదే అని అంటారు. ఎందుకంటే కొందరు  వ్యక్తులు ఎదుటి వ్యక్తులను మానసికంగా, శారీరకంగా హింసించి అందులో ఆనందం  పొందుతుంటారు. వారి హింస వల్ల మంచివారు ఎన్నో రకాలుగా యిబ్బంది పడాల్సి వస్తుంది. 
అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏ జంతువు తమ జాతి జంతువును హింసించదు. కేవలం మానవ జాతి మాత్రమే పరులను పీడిస్తూ వికృతానందం పొందుతుంది అనే అర్థంతో చూడవచ్చు..
 ముఖ్యంగా ఈ "హసద్భిః క్రియతే కర్మ రుదద్భి రనుభూయతే " న్యాయము ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకోగలిగాం. ఆందోళన, ఆరాటం, దుఃఖంతో ఉన్న వారికి ఇంకా ఇంకా కలిగేవి బాధలే తప్ప సంతోషాలు కాదు.
 ఎవరైనా ఎన్ని బాధలు ఉన్నా వాటిని చిరునవ్వు అనే ఆయుధంతో చెదరగొట్ట వచ్చు. అనేది  ఈ న్యాయము ద్వారా మనం గ్రహించాల్సిన నీతి.
ఇదండీ! ఈ న్యాయము లోని అంతరార్థము. దీనిని గ్రహించి మనకు ఉన్న ఈ చిన్ని జీవితాన్ని పువ్వులా గడుపుదాం.ఆనందాల పరిమళాలు పంచుదాం.సుఖ శాంతులతో ఉందాం.

కామెంట్‌లు