దోసిట్లో చందమామ:- వురిమళ్ల సునంద,S.A.తెలుగు జి.ప.ఉ.పా.పాపకొల్లు
ఆ అమ్మానాన్నలు అనుకొని వుండరు
అల్లరి చిల్లరిగా తిరిగే గారాలపట్టి
భారతావని గర్వించే పంతులమ్మ అవుతుందని!

జ్యోతి బా పూలే  అనుకొని వుండడు 
పసితనం వీడని వయసులో 
చేయిపట్టుకుని వచ్చిన  సావిత్రి భాయి
తన జీవితానికి అర్థం పరమార్థం తానే అవుతుందని!

ఆడదానికి చదువెందుకని విభేదించిన మామగారు
కలనైనా ఊహించలేదు
ఆమె తన వంశ గౌరవాన్ని  కోహినూర్ వజ్రంలా మెరిసేలా చేస్తుందని!

థూ! ఛీ!అని అవమానించిన  
కుల మత వర్గ ఛాందస వాదులు తెలుసుకోలేదు 
ఆమె భారత మాత గర్వించదగ్గ మహా  గురువు అవుతుందని!

 ఖచ్చితంగా అక్షరం అనుకునే వుంటుంది!
తానో అక్షరం రూపెత్తి
ఆడపిల్లల దోసిట్లో విద్దెల చందమామ అవుతుందని!

సాహసం పౌరుషం సంతోషపడి ఉంటాయి
మత ఛాందస వాదులను ఎదుర్కొనే ధీరోదాత్త సావిత్రి భాయి పూలేననీ!

మానవీయత అనుకునే వుంటుంది 
తన ప్రతిరూపంగా  ప్లేగు వ్యాధి బాలుని గుండెలకు హత్తుకుంటుందనీ

భరతమాత మురిసిపోయే వుంటుంది
తన లాంటి సావిత్రి భాయి ఫూలేకు
జన్మనిచ్చిన సవిత్రి తానే అయినందుకు...
============================

కామెంట్‌లు