మూర్ఖపు రాజు :-డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

 ఒక ఊరిలో ఒక రాజు ఉండేటోడు. ఊరందరిదీ ఒక దారైతే వులిపి కట్టెది ఒక దారన్నట్లు ఏ పనైనా సరే ఎవరూ చేయనట్లు చేయాలి. అప్పుడే మనల్ని జనాలంతా పది కాలాలపాటు గుర్తు పెట్టుకుంటారు అనుకునేటోడు. రాజు మాటకు రాజ్యంలో తిరుగులేదు. నించోమంటే నించోవాలి. కూర్చోమంటే కూర్చోవాలి. ఎదురు తిరిగి నోరు తెరిచి ఎవరైనా మాట్లాడితే వానికి అదే ఆఖరు రోజు. ఈ భూమ్మీద నూకలు చెల్లిపోయినట్లే. దాంతో జనాలంతా భయపడి లోపల్లోపల తిట్టుకోవడమేగానీ బయటకు మాత్రం పల్లెత్తు మాట కూడా అనేటోళ్లు కాదు. రాజు ఏం చెప్పినా సరే ఆహా ఓహో అని ఒకటే పొగడ్డం.
ఒకసారి ఆ రాజుకు ఒక ఆలోచన వచ్చింది. ఈ లోకంలో అందరూ రాత్రి పూట పడుకొని, పగలు పని చేస్తా వుంటారు కదా. దానిలో గొప్పేముంది. మన రాజ్యంలో జనాలంతా పగటి పూట పడుకొని రాత్రి పూట పని చేస్తే మన రాజ్యం పేరు చుట్టుపక్కలంతా మారుమోగిపోతుంది అనుకున్నాడు. ఆలోచన వచ్చిందే తడువుగా ఆదేశాలు జారీ చేశాడు. జనాలు అదిరి పోయినారు. కానీ అసలే రాజు. దానికి తోడు కొంచెం తిక్క. ఎదురు తిరిగితే అంతే... లోపలేసి తన్నిన చోట తన్నకుండా తంతాడు. దాంతో ఏం చేయలేక నెమ్మదిగా జనాలంతా పగటిపూట పండుకొని రాత్రిపూట పని చేయడం మొదలు పెట్టినారు.
ఒకసారి ఒక గురువు తన శిష్యులతో కలసి దేశ సంచారం చేస్తా చేస్తా... ఆ ఊరికి చేరుకున్నాడు. చూస్తే ఇంకేముంది వీధులన్నీ నిర్మానుష్యంగా వున్నాయి. చిన్న చప్పుడు కూడా లేదు. అంగళ్లన్నీ తాళాలు వేసి వున్నాయి. తలుపులు మూసి వున్నాయి. ఎంత వెతికినా ఒక్కడంటే ఒక్కడు కూడా కనబడలేదు. ఇంత పట్టపగలు ఎవరూ బయట తిరగడం లేదేమి అనుకున్నారు. రాత్రి కాగానే ఊరంతా అంగళ్లు తెరుచుకోవడం మొదలు పెట్టినాయి. ఎవరి పనులు వాళ్ళు చకచకా చేసుకోసాగినారు. వీధులన్నీ కళకళలాడ సాగినాయి.
గురుశిష్యులు ఇద్దరికీ ఆకలి దంచేస్తోంది. పొద్దున్నుంచి తినడానికి ఏమీ దొరకలేదు కదా... దాంతో ఒక అంగడికి పోయినారు. అక్కడ ఏమి కొనుక్కున్నా ఎంత తిన్నా ఒక్క రూపాయే. మాంచి రుచికరమైన బిర్యానీ తిన్న రూపాయే. ఉత్త పప్పన్నం తిన్నా రూపాయే. అది రాజు ఆజ్ఞ. ఎక్కువకు అమ్మినా తక్కువకు అమ్మినా శిక్ష ఖాయం. అది చూసి శిష్యుడు చానా సంబరపడ్డాడు.
ఆహా... ఇంత తక్కువకు ఏ దేశంలో కూడా ఏమీ దొరకదు. మనము ఇక్కన్నే వుండిపోదాం. హాయిగా కాలుమీద కాలేసుకుని కులాసాగా బతకొచ్చు అన్నాడు.
కానీ గురువు దానికి ఒప్పుకోలేదు. ఒరేయ్‌... ఇది పిచ్చివాళ్ళ రాజ్యం. ఏది ఎటుపోయి ఎటు వస్తుందో  ఎవరికీ తెలియదు. ఇక్కడ న్యాయం ధర్మం అంటూ ఒక పద్ధతి ఏమీ ఉండదు. రాజు ఏమి చెబితే అదే వేదం. కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ చోటు వదిలి వెళ్లడం మంచిది అని చెప్పాడు.
   కానీ శిష్యుడు అందుకు ఒప్పుకోలేదు. రాకరాక మంచి అవకాశం వచ్చింది. ఎప్పటి నుంచో తినాలి తినాలి అనుకున్నవన్నీ అతి తక్కువ ధరలో అందుబాటులో వున్నాయి. నాకు కావలసినవన్నీ బాగా తిని కోరికలన్నీ తీర్చుకొని వస్తా. అంతవరకు ఇక్కడ నుంచి కదిలేదే లేదు అన్నాడు. సరే నీ కర్మ అంటూ గురువు ఆ రాజ్యం వదిలి వెళ్లిపోయినాడు.
శిష్యుడు అక్కన్నే వుంటూ మూడు పూటలా హాయిగా నచ్చినవన్నీ తింటూ తిరగసాగాగినాడు. పనీపాట లేకపోవడంతో ఆరునెలలు తిరిగేసరికి బాగా లావుగా చిన్న ఏనుగు పిల్ల లెక్క బలిసినాడు.
ఆ రాజ్యంలో ఒక దొంగ వున్నాడు. వాడు ఒక రోజు పెద్ద ధనవంతుని ఇంటికి దొంగతనానికి పోయినాడు. ఆ ఇంటి గోడ చానా ఎత్తుగా వుంది. అదీగాక కట్టించి చానా కాలమయింది. దాంతో అది బాగా పాతబడిపోయింది. వీడు పైకి ఎక్కుతా వుంటే ఆ గోడ కూలి వారి మీదనే పడింది. అది బాగా పెద్ద గోడ కదా... లోపల లావు లావు రాళ్ళు వున్నాయి. అవన్నీ ఆ దొంగ మీద ఒక దానిమీద ఒకటి దబ దబ దబ పడిపోయినాయి. అంతే... వాడు ఉక్కిరిబిక్కిరై గాలి ఆడక వాటి కింద పడి చచ్చి పోయినాడు.
   ఆ దొంగకు ఒక కొడుకు వున్నాడు. వాడు జరిగింది తెలుసుకొని రాజు దగ్గరికి పోయినాడు. రాజా.. ఈ లోకంలో ఎవరి వృత్తి వాళ్లు న్యాయంగా చేసుకొని బతుకుతా వున్నారు. మా తాత ముత్తాతల నుంచి దొంగతనం మా వృత్తి. ఈ ఆచారాన్ని ఎంతో కాలం నుండి కష్టపడి కొనసాగిస్తున్నాం. కానీ ఈ ధనవంతుడు ఇంటి గోడ సరిగా కట్టించక పోవడంతో మా నాయన దాని కిందపడి చచ్చి పోయినాడు. మేమింకా చిన్న పిల్లలం. దొంగతనాలు చేయడం సరిగా రాదు. మరి ఇప్పుడు మేము ఎలా బతికేది. కాబట్టి దీనికంతా కారణమైన ఆ ధనవంతునికి తగిన శిక్ష వేసి, మాకు నష్టపరిహారం ఇప్పించండి అని వేడుకున్నాడు.
దానికి రాజు ఆలోచించి నిజమే కదా వీడు చెప్పింది. అరవై నాలుగు కళల్లో చోరకల కూడా ఒకటి అని మన పెద్దలు చెప్పినారు. దాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనందరిదీ. దొంగలే లేకపోతే రాజభటులు సోమరులు అయిపోతారు. ఈ ధనవంతుని వలన అనవసరంగా పాపం ఆ దొంగ చచ్చి పోయినాడు. పోండి పోయి వాన్ని పట్టుకొని ఉరి తీయండి అంటూ సైనికులను పంపించినాడు.
   భటులు పోయి ఆ ధనవంతున్ని పట్టుకొని వచ్చినారు. వాడు జరిగిందంతా తెలుసుకొని గడ గడ గడ వణికిపోతా రాజా... ఇందులో నా తప్పేమీ లేదు. ఆ గోడ కట్టించింది నేనే అయినా కట్టింది మన రాజ్యంలో పేరుపొందిన తాపీ మేస్త్రి. వానికి అడిగినంత డబ్బిచ్చాను. అయినా వాడు సరిగా కట్టలేదు. కాబట్టి తప్పంతా వానిదే అన్నాడు.
ఆ మాటకు రాజు నువ్వు చెప్పింది కూడా నిజమేలే. నువ్వు ఎంత ఖర్చు పెట్టినా వాడు సరిగా కట్టకపోతే నువ్వేం చేస్తావ్‌ అంటూ సైనికుల వంక తిరిగి ...  పోండి... పోయి ఆ తాపీమేస్త్రిని పట్టుకొని రండి అన్నాడు. దాంతో ఆ సైనికులు వెతుక్కుంటా పోయి ఆ తాపీ మేస్త్రిని పట్టుకొని వచ్చినారు.
ఆ తాపీమేస్త్రి జరిగిందంతా విని రాజా... ఆ గడనే కాదు ఆ ఇండ్లు కూడా నేను కట్టిందే. కానీ ఎన్ని రోజులైనా ఇంటిలో ఒక్క ఇటుక కూడా కదల్లేదు. కానీ సరిగ్గా ఆ గోడ కట్టే సమయంలో మన సైనిక అధికారి రోజూ రెండు పూటలా అటువైపు వస్తుండేవాడు. ఆయన గుర్రం మీద వచ్చేటప్పుడు, పోయేటప్పుడు ప్రతి ఒక్కరూ గౌరవంగా లేచి నిలబడాలి. నిలబడక పోతే వెంట వచ్చే భటులు కొరడాలతో కొడతారు. దాంతో నేను భయంతో ఎప్పుడూ ఆ దారి వంకే చూస్తూ ఆ గోడ సరిగా కట్టలేక పోయాను. కాబట్టి తప్పంతా ఆ సైనిక అధికారిదే అన్నాడు.
   ఆ మాటలకు రాజు నువ్వు చెప్పింది కూడా నిజమేలే. అయినా ఆ సైనిక అధికారి రోజుకొక వీధిలో తిరగుతూ ప్రజల బాగోగులు చూసుకోవాలి గానీ ప్రతి రోజూ ఒకే దారిలో తిరిగితే ఎలా. పోండి పోయి వాన్ని పట్టుకొని వచ్చి ఉరి తియ్యండి అన్నాడు. దాంతో భటులు పోయి సైనికాధికారిని పట్టుకొచ్చినారు.
ఆ సైనికాధికారి జరిగిందంతా విని రాజా... నేను రోజూ ఆ దారిలో అదేపనిగా కొద్ది రోజులు నడిచినాను కానీ తప్పు నాది కాదు. ఎందుకంటే ఆ వీధిలో ఒక బంగారు హారాలు తయారుచేసే కంసాలి వున్నాడు. నా చిన్న కూతురి కోసమని అతను అడిగినంత ధనమిచ్చి ఒక అందమైన హారం చేయమన్నాను. వాడు సరేనని సరిగ్గా వారం రోజుల్లో చేసి చేతిలో పెడతానని మాటిచ్చి ... ఆ తరువాత ఆ హారం చేయకుండా రేపు ఎల్లుండి అంటూ పది రోజుల పాటు అదేపనిగా తిప్పించుకున్నాడు. కాబట్టి నాతో అలా తిప్పించుకున్న కంసాలిదే తప్పు కానీ నాది కాదు అన్నాడు.
దానికి రాజు అవునులే ఇస్తానని చెప్పి ఇవ్వకుంటే నువ్వు మాత్రం ఏం చేస్తావ్‌. మాటమీద నిలబడని కంసాలిదే ఈ తప్పంతా అంటూ సైనికుల వంక తిరిగి పోండి... పోయి ఆ కంసాలిని పట్టుకొని రాపోండి అన్నాడు. దాంతో వాళ్లు పోయి కంసాలిని వెతికి పట్టుకొచ్చినారు.
   ఆ కంసాలి జరిగిందంతా విని రాజా మాట మీద నిలబడకపోవడం నా తప్పే. కానీ నేను కావాలని అలా చేయలేదు. నేను బాడుగకు వుంటున్న ఇంటి యజమాని తన కూతురి పెళ్లికి నగలు చేయడం కోసం నన్ను పిలిపించినాడు. అందరికన్నా ముందు తనకే నగలు చేసి ఇవ్వాలని లేకుంటే అంగడి ఖాళీచేసి పోవాలని బెదిరించినాడు. సైన్యాధికారి హారం పూర్తయిన తర్వాత మీ నగలు చేస్తానన్న ఒప్పుకోలేదు. దాంతో ఏమీ చేయలేక ఇచ్చిన మాట తప్పి రేపు ఎల్లుండి అంటూ తప్పించుకున్నాను. కాబట్టి నేను అలా మాట తప్పడానికి కారణం మా ఇంటి యజమానే. కానీ ఆయన చచ్చిపోయి ఇప్పటికి పది సంవత్సరాలయ్యింది అన్నాడు.
దానికి రాజు ఆయన చచ్చిపోతేనేమి. కొడుకు వున్నాడు కదా. ఆస్తులు మాత్రమే కాదు అప్పులు శిక్షలు కూడా తీసుకోవాలి కొడుకంటే. పోండి... పోయి వాన్ని పట్టుకొని రాపోండి అన్నాడు దాంతో వాళ్లు పోయి కంసాలి ఇంటి యజమాని కొడుకును పట్టుకొచ్చినారు.
వాడు నాకే పాపము తెలీదు. నన్ను వదిలెయ్యండి అంటూ కిందామీద పడి మొత్తుకుంటున్నాడు. ఐనా ఏమీ పట్టించుకోకుండా వాన్ని ఉరికంబం దగ్గరికి తీసుకెళ్లినారు. కానీ ఉరి వెయ్యలేక పోయినారు. ఎందుకంటే వాడు ఆ రాజ్యంలో అందరికన్నా సన్నగా వున్నాడు. ఎంత సన్నగా అంటే వాని మెడకు ఉరితాడు పట్టలేదు.
ఉరి తాడు ఎంత లావుగా వున్న వాళ్ళనైనా సరే మోయడానికి వీలుగా చానా లావుగా బలంగా తయారు చేసినారు. దాంతో అది దగ్గరికి లాగినప్పుడు మధ్యలో కొంచెం ఖాళీ స్థలం వస్తుంది. వాని మెడ ఎంత సన్నగా వుందంటే ఆ తాడులో వాని మెడ బిగుసుకోవడం లేదు. దాంతో సైనికులు సక్కగా రాజు దగ్గరికి పోయి జరిగిందంతా చెప్పినారు.
దానికి రాజు అలాగా... అయితే మన రాజ్యంలో అందరికంటే సన్నగా వున్న వీని బదులుగా అందరికన్నా లావుగా వున్న వాన్ని వెతికి తెచ్చి వురెయ్యండి సరిపోతుంది అన్నాడు.
   దాంతో సైనికులు రాజ్యంలో అందరికన్నా లావుగా వున్న వానికోసం వెతకడం మొదలు పెట్టినారు. అలా వెతుకుతా పోతావుంటే వాళ్లకు ఈ శిష్యుడు కనబన్నాడు. వాడు రోజు బాగా తినీ తినీ చిన్న ఏనుగు పిల్లంత బలిసినాడు కదా. దాంతో వాన్ని పట్టుకొనిపోయి రాజు ముందు  నిలబెట్టినారు. వాడు కిందా మీదా పడి ఏడ్చినా, నేను ఏ తప్పూ చేయలేదు నన్ను వదిలెయ్యండి అని నెత్తినోరూ కొట్టుకున్నా రాజు పట్టించుకోలేదు. తరువాత రోజు ఉదయం ఐదు గంటలకి ఉరి తియ్యమని ఆజ్ఞాపించినాడు.
అప్పుడు ఆ శిష్యునికి పిచ్చివాని పరిపాలనలో ఒక్క క్షణం కూడా ఉండకూడదు. ఎప్పుడు ఏది ఎట్లా తిరిగి ఎవరి మీదకు వస్తుందో ఆ దేవుడు కూడా చెప్పలేడు అంటూ తన గురువు చెప్పిన మాట గుర్తుకు వచ్చింది. కుమిలి కుమిలి ఏడుస్తా... గురుదేవా నీ మాట విననందుకు నాకు తగిన శాస్తి జరిగింది. నన్ను మన్నించు. నువ్వే నన్ను ఎలాగైనా కాపాడాలి అని కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు.
ఆ గురువు అందరిలాగా మామూలు వాడు కాదు. చానా మహిమలు వున్నవాడు. శిష్యుడు పడుతున్న బాధను దివ్యదృష్టితో గ్రహించి మరుక్షణంలో అక్కడికి వచ్చినాడు. రాజు ముందుకు పోయి రాజా... వీడు నా శిష్యుడు. వీడు తప్పు చేసినా ఒప్పు చేసినా ఆది గురువునైన నాకే చెందుతుంది. కాబట్టి వీని బదులుగా నాకు రేపు ఉదయం  ఐదు గంటలకు ఉరి వెయ్యండి. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకూడదు. ఇంత మంచి అవకాశం మరలా నాకు ఎప్పటికీ రాదు అంటూ బ్రతిమాలాడుకున్నాడు.
   అది చూసి రాజు ఆశ్చర్యపోయినాడు. ఎవరు చూసినా నన్ను వదిలెయ్యి , నన్ను చంపొద్దు అని వేడుకుంటాడరు గానీ, ఈ గురువేంది నన్ను ఉరి వెయ్యమని వెంట  పడుతున్నాడు. ఇందులో ఖచ్చితంగా ఏదో మతలబు వుంది అనుకొని గురువును పక్కకు పిలుచుకొని పోయి... మహాత్మా... మీరు ఇంతలా మీకే ఉరి వెయ్యమని పట్టు పట్టడానికి కారణమేమి. నిజం చెప్పండి. మహాత్ములు చేసే ప్రతి పనిలోనూ ఏదో గొప్ప  అంతరార్థం ఉంటుంది అంటారు పెద్దలు అని వేడుకున్నాడు. అప్పుడా  గురువు ఏమీ లేదు రాజా... రేపు ఐదు గంటలకు దివ్యమైన ముహూర్తం వుంది. వెయ్యేళ్లకు ఒకసారి మాత్రమే అలాంటి అద్భుతమైన ముహూర్తం వస్తుంది. ఆరోజు ఎవరినైతే ఉరి వేస్తారో... వాళ్లు తరువాత జన్మలో ఈ చుట్టుపక్కల రాజ్యాలన్నింటికీ చక్రవర్తిగా పుడతారు అని చెప్పినాడు.
దాంతో రాజు ఆలోచనలో పడినాడు. ఆయనకు చక్రవర్తి కావాలని ఎప్పటి నుంచో ఆశ. కానీ ఇప్పుడు ఉన్నటువంటి చక్రవర్తి చానా బలవంతుడు. అతన్ని జయించడం ఎవరితరము కాదు. దాంతో ఏమీ చేయలేక అతనికి పన్ను కడుతూ సామంతునిగా వుంటున్నాడు. మనసులో కోరికను చంపుకున్నాడు. రాజు బాగా ఆలోచించినాడు. ఐతే
నాలాంటి రాజు చక్రవర్తి కావాలి గానీ ఇలా దారినపోయే సన్యాసులంతా చక్రవర్తులు ఐతే ఎలా అనుకొని వెంటనే మంత్రిని పిలిచి... ఓ మహా మంత్రీ... మారు మాట్లాడకుండా ఆ గురుశిష్యులు ఇద్దరిని వదిలేసి వాళ్ల బదులుగా రేపు ఉదయం ఐదు గంటలకు నన్ను ఉరి తియ్యండి అని ఆజ్ఞాపించినాడు. మహామంత్రి రాజు చెప్పినట్లే తరువాత రోజు ఉదయమే ఆ పిచ్చి రాజును ఉరి తీసినాడు. అట్లా ఆ రాజ్యానికి పట్టిన పీడ వదిలి పోయినందుకు ప్రజలంతా చాలా సంతోషించి ఆ గురువును మెచ్చుకొన్నారు.
***********

కామెంట్‌లు