ఆవేదనే నివేదన:- డా పివిఎల్ సుబ్బారావు,-9441058797.
85.
ఆకలి అన్నవారికి ఓ ముద్ద, అన్నమే వడ్డించండీ!

మాన రక్షణ పాత వస్త్రమే, చాలు సరి దానమండీ!

నిలువ నీడ లేదంటే మీ, గుండెల గూడే దాచుకోండీ!

దీన జన సేవే శ్రీవారి ,
సేవ కన్నా మిన్న కదండీ!

ఆవేదనే నివేదన ఆలకించు, 
 మా సింహాచలేశా!
86.
మనమేమన్నా కారణ,
జన్ములమా? కాలనిర్దేశమే!

జన్మ కారకులం నిజమే, సకారణంగా జీవిద్దామే! 

సామాజిక స్పృహ మంచే, పెంచి పంచుతూ బతికేద్దామే!

రాబోయే తరాల కోసం,
  ఆదర్శ పథమే నిర్మిద్దామే!

ఆవేదనే నివేదన ఆలకించు,
   మా సింహాచలేశా!
87.
స్వాంత సుఖాయ భావనే, 
     సగటు మనిషి జీవనమే!

పరజనహితాయా ఎరుకే, 
         జీవితాన సార్ధకమే!

సర్వేజనాసుఖినోభవంతు,,    ఋషి కృషే ఉత్తమమే!
త్యాగమేగా! అమృత జీవనం, 
      ఇల అదే శాశ్వతమే!

ఆవేదనే నివేదన ఆలకించు,
 మా సింహాచలేశా!
________


కామెంట్‌లు