శ్వాస పైనే ధ్యాస
 
ధ్యానం చేస్తున్నంతసేపు శ్వాస పైనే ధ్యాస ఉంచి ధ్యానం చేయాలని శ్రీ జగన్నాథ్ పిరమిడ్ ధ్యాన మందిరం ప్రతినిధి, దిమిలి మాజీ సర్పంచ్ దారపు వాసుదేవరావు అన్నారు. పాతపొన్నుటూరు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో జరిగిన ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వాసుదేవరావు మాట్లాడుతూ ధ్యానం వలన ఏకాగ్రత పెరుగుతుందని, జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుందని, చేసే పనుల్లో సామర్థ్య నైపుణ్యాలు పెంపొందుతాయని, సోమరితనం వీడునని,  విచక్షణా జ్ఞానం కలుగునని అన్నారు. సభాధ్యక్షులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుర్రాల కృష్ణారావు మాట్లాడుతూ బుద్ధి కుశలత, స్వచ్ఛత, సంకల్పశక్తి, ఆత్మవిశ్వాసం, మానసిక స్థైర్యం,  ప్రశాంతతలకు ధ్యానమే సరైన మార్గమని అన్నారు. ఉపాధ్యాయులు అందవరపు రాజేష్ మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ధ్యానం చేయడం వలన ఆందోళన, భయము, విరక్తి వంటివి సంపూర్ణంగా తొలగిపోతాయని తద్వారా ఆత్మస్థైర్యం పెంపొందునని అన్నారు. ఉపాధ్యాయులు బూడిద సంతోష్ కుమార్ మాట్లాడుతూ ధ్యానధర్మం, అహింసాధర్మం, మిత్రధర్మం, కరుణధర్మం, శాంతధర్మం, ఆరోగ్యధర్మం, స్వాధ్యాయధర్మం, వినయధర్మం,   దానధర్మంలనే నవవిధధర్మాలను ఆచరించడం వలన ప్రతి పనిలోనూ అభ్యుదయాన్ని పొందుతామని, ఇవి ప్రగతికి సోపానాలని, గొప్ప ధర్మాచరణకు ముక్తి మార్గాలని అన్నారు. ఉపాధ్యాయులు పైసక్కి చంద్రశేఖరం మాట్లాడుతూ దేవతా మూర్తులు సైతం ధ్యానాలు చేసిన వాళ్లేనంటూ పురాణాలు తెలిపే అంశాన్ని గుర్తు చేస్తూ, ధ్యానం అనేది ఒక పవిత్రమైన ప్రక్రియ అని అన్నారు. ఉపాధ్యాయని యిసై సౌజన్యవతి మాట్లాడుతూ ధ్యానం వల్ల ఆయురారోగ్యాలు కలుగునని, శారీరక మానసిక వికాసాలకు దోహదపడునని అన్నారు. ఉపాధ్యాయులు కుదమ తిరుమలరావు మాట్లాడుతూ నిరంతర ధ్యాన సాధన వలన నాడీ మండలం శుద్ధి జరుగునని, ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞానం, ఆత్మవిశ్వాసం, ఆత్మసాక్షాత్కార ప్రాప్తి సిద్ధిస్తాయని అన్నారు. అనంతరం పాఠశాల విద్యార్థులచే పదిహేను నిమిషముల పాటు శ్వాసపైనే ధ్యాస ఉంచేలా ధ్యానం చేయించారు. తొలుత వాసుదేవరావు ధ్యానం చేస్తున్నంతసేపు ఎలాంటి ఆలోచనలు వచ్చిననూ వాటిని విడనాడి శ్వాస పైనే ధ్యాసపెట్టి ధ్యానం చేయాలని ముందుగా సూచించారు. ధ్యానం చేసే ముందు ఒక్కొక్కరిచే అయన గ్లాసెడు నీళ్లు త్రాగించారు.

కామెంట్‌లు