పుట్టినరోజు కానుక : - పగిడిపాటి
 సాయంకాల సమయం. చీకటి పడుతోంది. వీధి దీపాలు ఒక్కొక్కటి వెలగడం ప్రారంభమైనాయి. అతిథులు ఒక్కొక్కరుగా రావడం మొదలుపెట్టారు. ఆ రోజు చిన్నారి చిట్టి పుట్టినరోజు. ఇల్లంతా ఒకటే సందడి. చిన్నారి చిట్టి దీపాల కాంతిలో మెరిసిపోతోంది. 
       బంధుమిత్రుల కోలాహాలం మధ్య చిట్టి కేకును కట్ చేసి అందరికి పంచి వారి అభినందనల అనంతరం భోజన కార్యక్రమం ప్రారంభమైంది. రకరకాల వంటకాలు పిండివంటలు పాయసం అన్ని రకాల పండ్లు అతిథులను ఆరగించమని ఆహ్వానిస్తున్నాయి. నోరూరించే వంటకాలను చూసిన అతిథులు ఎంతో సంతోషంగా ఒక్కొక్క వంటకాన్ని ఆరగిస్తూ ఆనందపడుతున్నారు. 
        నచ్చిన వంటకాన్ని పూర్తిగా తిని నచ్చని వంటకాన్ని పక్కకు తోస్తూ విందారగించిన అనంతరం వాళ్లు పడేసిన విస్తరాకులను చూస్తున్న ఒక అమ్మాయి వాటిలో  మిగిలిన తిను బండారాలను ఏరుకోవడం ప్రారంభించింది. అది గమనించిన కొందరు ఆమెను అక్కడ నుండి వెళ్లగొడుతుండగా చిన్నారి చిట్టి ఆ దృశ్యాన్ని చూసింది. ఆ అమ్మాయిని చూసి ఎంతగానో జాలి పడింది. 
           వెంటనే తన తండ్రిని పిలిచి ఆ దృశ్యాన్ని చూపించి " లక్షల రూపాయలు ఖర్చు చేసి నా పుట్టినరోజును ఘనంగా జరిపించిన మీరు నా కోరిక మేరకు ఈ అమ్మాయిని ఒక మంచి హాస్టళ్లో చేర్పించి బాగా చదివించి ప్రయోజకురాలిని చేయడమే నాకు గొప్ప పుట్టినరోజు కానుకగా భావిస్తానని " కోరింది. అందుకు ఆ తండ్రి నీవు అడిగిన పుట్టినరోజు కానుక తప్పకుండా ఇస్తానని ఒప్పుకోవడంతో హాలంతా చప్పట్లతో మార్మోగిపోయింది. 
=========================================================


             పగిడిపాటి నర్సింహ , GHM
      ZPHS Kamepally, Gundlapally Mandal 
                    Nalgonda District.
కామెంట్‌లు