సునంద భాషితం:- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు-786
గంధర్వ నగర న్యాయము
******
గంధర్వ అనగా దేవతలలో ఒక తెగకు చెందిన వాడు (దేవ గాయకుడు), గాయకుడు, గుఱ్ఱము,కస్తూరి మృగము,మగ కోయిల.నగర అనగా పట్టణము, నగరము అనే అర్థాలు ఉన్నాయి.
గంధర్వ నగరము అనగా మాయా ప్రపంచము.అసత్యము సత్యముగా కనిపిస్తుందనీ,క్షణ క్షణములో పుడుతూ నశిస్తూ అయోమయానికి గురి చేస్తూ వుంటుందని, మన పెద్దలు ఈ గంధర్వ నగరాన్ని మనము వుండే జగత్తుకు ఉదాహరణగా  చెబుతుంటారు.
 మరి ఈ గంధర్వ నగరం ఏమిటో? అదంటూ వుందా? దీనికి సంబంధించిన  విశేషాలు వివరాలు తెలుసు కుందామా..!
 గంధర్వులు అనగానే అద్భుతంగా  గానం చేసేవారికి ఇచ్చే ‌బిరుదు గుర్తుకు వస్తుంది. వెంటనే అపర గాన గంధర్వుడు  ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం గారు గుర్తుకు వస్తారు.అంటే గంధర్వులు తమ గానంతో బాగా అలరిస్తారని కొంత తెలిసిపోయింది.
అయితే ఈ గంధర్వుల గురించిన ప్రస్తావన వివిధ మతాల గ్రంథాలలో ఉండటం విశేషం.
హిందూ మతంలో వీరు దేవతల వద్ద సంగీత విద్వాంసులుగా పని చేసే ఖగోళ దేవతలుగా పిలవబడ్డారు.
గంధర్వ అనే ప్రస్తావన వేదాలలోనూ వుంది.దేవతల భవనాలలో వుండి దేవతల కోసం అందమైన సంగీతాన్ని వినిపిస్తారు.వీరు  ఎక్కువగా ఇంద్ర లోకంలో నివసిస్తూ ఇంద్రునికి సేవలు చేస్తారు.అయితే గంధర్వులకు "గంధర్వ లోకం అనే"స్వంత రాజ్యం లేదా నగరం ఉంది.ఆ నగరమే మాయా లోకంగా  చెప్పబడింది.
మరి ఈ గంధర్వుల గురించి కేవలం  హిందూ మతము లోనే కాదు బౌద్ధ,జైన మతములోనూ దేవతలుగా, దేవతలకు ప్రాతినిధ్యం వహించే వారిగానూ చెబుతూనే,వారి లోకం లేదా  నగరం ఎలాంటిదో కూడా చెప్పడం జరిగింది.
 వరాహ మిహురుడు రాసిన బృహత్సంహితలో గంధర్వ నగర వర్ణన ఉంది.ఇందులో మేఘాల అద్భుతమైన ఆకృతులను గురించి , సూర్యోదయం మరియు సూర్యాస్తమయం తర్వాత ఏర్పడే ఎర్రటి ఆకాశంలో  మేఘాల కల్పిత ఆకారాలతో గంధర్వ నగరాన్ని  ఊహించడం జరిగింది.
పురాణేతిహాసాలలో  మనిషి యొక్క వివిధ భ్రమల దృష్టి కారణముగా గ్రామాలు, నగరాలు ఆకాశంలోనూ, నదులు ,సముద్రాలపై పొరలోనూ  ఉన్నట్టు కనిపిస్తాయి. "ఇవి వాస్తవమైనవి కావు.మాయతో నిండిన ఈ జగత్తుతో పోలిస్తే ఇవి ఊహాత్మక నగరాలు. ఇవి ఎక్కువగా సంసార జీవనం గడిపేవారి ద్వారా కనిపిస్తాయని "అంటారు.
ఇక బౌద్ధ మతంలో కూడా ప్రధానమైన మహా యాన శాఖలో గంధర్వుల నగరం గురించి చెప్పడం జరిగింది. ఇందులోని ధర్మాలు గంధర్వుల నగరం లాంటివనీ అంటారు.సూర్యోదయం అయినప్పుడు రాజ భవనాలతో కూడిన నగరాన్ని చూస్తామనీ,ఇందులో ప్రజలు లోపలికి రావడం మరియు బయటికి వెళ్ళడం జరుగుతుందని అంటారు.సూర్యుడు ఉదయించే కొద్దీ ఈ నగరము  మరింత అస్పష్టంగా మారుతుంది. ఇది ఎటువంటి వాస్తవికత లేని భ్రమ మాత్రమేనని. ఇలా భ్రమలతో కల్పంచబడిన నగరాన్నే గంధర్వుల నగరమని చెప్పారు.
అయితే ఇలాంటివి మునుపు ఎన్నడూ చూడని వారు,కొత్త వారు గంధర్వ నగరం ఉండటం నిజమేనని నమ్ముతారు.అలా దానివైపు వెళ్ళేందుకు ఆరాటపడతారు.కానీ అటు వెళ్తూ ఉన్నప్పుడు వారికి అది వాస్తవం కాదనీ ఇదంతా ఓ మిధ్య అనే విషయం తెలుస్తుంది.
ఇక జైన మతం కూడా ఏమంటుందంటే "అనుబంధాల వలన ఎవరైనా సుఖ పడ్డారా? కలవర పడటమే కదా!""ఈ శరీరాన్ని రోగాలు నరికి వేయలేదా?" "మరణం నోరు తెరవ లేదా?' "విపత్తులు ప్రతిరోజూ హాని చేయడం లేదా?"నరకాలు భయంకరమైనవి కాదా?" "ఇంద్రియ సుఖాలు కలలా మోసం చేయడం లేదా? దాని కారణంగా ఇతరుల మరియు స్వంత ప్రయోజనాన్ని విస్మరించినందున ఇలాంటి ఊహాత్మక, ఎండమావి వంటి నగరాన్ని,ఆ ప్రపంచాన్ని వ్యక్తులు కోరుకుంటూ ఉన్నారని అంటుంది.
 ఇన్ని మతాలు, పురాణేతిహాసాలు, వేదాల ప్రకారం గంధర్వ నగరం గురించి ఆలోచిస్తే రెండు కోణాలు ఉన్నాయని మనకు తెలుస్తోంది.అయితే ఆ రెండింటి  సారం ఒక్కటే .ఎందుకంటే మనిషి ఎప్పుడూ కష్టాలను కోరుకోడు. సుఖాలకై జీవితమంతా వెంపర్లాడుతూ వుంటాడు.ఆ వెంపర్లాటలో భ్రమలు,కల్పనల జగత్తునే నిజమని నమ్ముతుంటారు.
 మొదట వీరికి ఈ సంసారమనేది లేదా  జీవితం అనేది ఓ స్వర్గంలా కనిపిస్తుంది.దూరపు కొండలంత నునుపుగా అనిపిస్తుంది.గంధర్వ నగరం లాంటి సంసార మాయకు దగ్గరగా అంటే అందులోకి ప్రవేశించిన తరువాతే తెలుస్తుంది .ఇది సుఖాల నగరం కాదు.ఇంద్రియ సుఖాలు కలలా మోసం చేస్తాయనీ, మరణం ఎప్పుడూ నోరు తెరిచి ఎదురు చూస్తుందని.. ఇవన్నీ  తెలిసినా ఈ వ్యామోహం అనేది అయస్కాంతంలా మనసునూ,మనిషినీ లాగుతుందన్న మాట.
మొత్తంగా ఈ గంధర్వ నగర న్యాయము ద్వారా గ్రహించ వలసింది  ఏమిటంటే ఈ మాయా జగత్తులోకి  ప్రవేశించకుండా ఉండాలంటే ముఖ్యంగా ఆత్మ నియంత్రణ కావాలి.
అందుకే ఆధ్యాత్మిక వాదుల దృష్టితో చూస్తే ఆత్మ యొక్క అంతిమ లక్ష్యం శాంతి మార్గం ద్వారా చేరుకోవడం కావాలి.ఇంతకూ ఆత్మ యొక్క అంతిమ లక్ష్యం ఏమిటంటే పునర్జన్మ నుండి విముక్తి పొందడం.
పురాణాలు,వేదాల ప్రకారం గంధర్వులు అనే వారు ఉండటం నిజం కావచ్చు కానీ వారి నగరం మాత్రం ఇలా కాల్పనికమైనదనీ మనకు అర్థం అవుతోంది.అది భ్రమలతో కూడినదనీ తెలిసింది కాబట్టి దాని జోలికి పోకుండా ఉండాలనీ, జీవితానికి అర్థం, పరమార్థం తెలుసుకోవాలని చెప్పడమే ఈ "గంధర్వ నగర న్యాయము" యొక్క ముఖ్యమైన ఉద్దేశ్యం.ముందుగా ఆ విషయాన్ని గ్రహిద్దాం.మాయా జగత్తు ఆకర్షణకు లోను కాకుండా ఆత్మ యొక్క అంతిమ లక్ష్యం వైపు ఆనందంగా అడుగులు వేద్దాం.

కామెంట్‌లు