లక్ష్మీపతి బాగా డబ్బున్న వ్యక్తి. అయినా ధనవంతుడుననే గర్వం ఉండేది కాదు.నియమ నిష్ఠలతో క్రమ పద్ధతిలో జీవనం సాగించేవాడు. దైవచింతన ఎక్కువ.దేశంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ దర్శించుకున్నాడు. దేవాలయాల్లోని హుండీల్లో లక్షలకు లక్షలు వేసేవాడు. ఆయన తిరగని పుణ్యక్షేత్రం లేదు,దర్శించని పుణ్యతీర్ధం లేదు.ప్రసిద్ధి చెందిన దేవాలయాలన్నిటిని మళ్ళీ మళ్ళీ దర్శించుకున్నాడు. అన్ని పుణ్య స్థలాలు దర్శిస్తూ,దేవుళ్లను కొలుస్తూ,కానుకలు సమర్పిస్తున్నా లక్ష్మీపతికి ఏదో వెలితిగా ఉండేది.
ఒకసారి గ్రామ ప్రజలు,పెద్దలు లక్ష్మీపతిని కలిసి మీరు ఆధ్యాత్మికంగా ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శించుకున్నారు.మీలాంటి పెద్దవారు మన గ్రామంలో ఒక దేవాలయం నిర్మించాలి అని కోరారు.మీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది అని అన్నారు.వారి అభ్యర్థన మేరకు గ్రామంలో పెద్ద ఆలయాన్ని నిర్మించాడు. భక్తులందరూ లక్ష్మీపతిని మెచ్చుకున్నారు.
ఇప్పుడు లక్ష్మీపతి తన వ్యాపార వ్యవహారాలు చూసుకుంటూ దేవాలయం కార్యకలాపాలు కూడా చూసుకుంటూ ఉన్నారు.
ఇంతలో కరోనా మహమ్మారి వచ్చింది. అయినవాళ్లు కానివారయ్యారు పేదల బ్రతుకులు దుర్భరమైనాయి. ఒకరికి ఒకరు సహాయం చేసుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి.కరోనాతో చనిపోయిన వారిని దహన సంస్కారాలు చేయడానికి కూడా ఎవరూ దరిచేరని పరిస్థితి.నెలల తరబడి పనులు లేక ప్రజలు పస్తులు ఉండాల్సిన దుస్థితి దాపురించింది.
ఒక పేద భక్తురాలు దేవాలయంలోకి వచ్చి "దేవుడా కనిపించని నీకు గుళ్ళు గోపురాలు కట్టించి పూజిస్తారు ఈ పెద్దవాళ్లు.కళ్ళ ఎదుట ఆకలితో అలమటిస్తూ చనిపోతున్నా పట్టించుకోరు నీవైనా చెప్పు దేవుడా" అంటూ మొరపెట్టుకుంది. ఆ మాటలు విన్న లక్ష్మీపతి మనసు ఆలోచనలో పడింది. నేను గుడి కట్టిస్తే ప్రజలు సంతోషిస్తారు అనుకున్నాను కానీ ఆపదలో ఉన్న ప్రజలకు మేలు చేయడమే అసలైన దైవ సేవ అని ఒక నిర్ణయానికి వచ్చాడు.
లక్ష్మీపతి ఇరవై మందితో బృందం ఏర్పాటు చేసి ఆ ఊరిలోని పేదలందరికి ఆహార పదార్థాలు సరఫరా చేయించేవాడు. చనిపోయిన వారిని దహన సంస్కారాలు చేయించడానికి ఎవరూ రాకపోయినా తన బృందంతో దగ్గరుండి చేయించేవాడు. ఇటువంటి ప్రాణాపాయ పరిస్థితుల్లో కూడా లక్ష్మీపతి చూపిస్తున్న మానవతను ప్రజలందరూ ముక్తకంఠంతో "నీవు దేవుడవయ్యా!దేవుడు ఎక్కడున్నాడో తెలియదు కానీ మా ప్రాణాలు నిలబెట్టిన దేవుడువయ్యా!" అంటూ వేనోళ్ళ కీర్తించారు.మానవసేవే మాధవ సేవ అని లక్ష్మీపతి తెలుసుకున్నాడు.
కరోనా తదనంతరం కూడా తన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ పేదలకు సహాయం చేయడం,కైలాస రథాలు అందుబాటులో ఉంచడం,అనాధ శవాలను దగ్గరుండి సంస్కారాలు చేయించడం,పేద పిల్లలను చదివించడం, వైద్య సహాయం అందించడం మొదలగు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మనసుల్లో దేవుడై కొలువైనాడు.తన తదనంతరం ఈ సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగేలా ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి నిధులు సమకూర్చి ప్రజల మనుషుల్లో దేవుడులా చిరస్థాయిగా నిలిచిపోయాడు లక్ష్మీపతి.
-×-
మానవత - ద్వారపురెడ్డి జయరాం నాయుడు(ఉపాధ్యాయుడు)-MPPS చటాకాయ- -ఏలూరు జిల్లా. సెల్ ; .9441519570
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి