చిలుక ముక్కు వూడిపాయ :- - డా.ఎం.హరికిషన్-కర్నూలు -9441032212

 పిల్లలకు జ్ఞాపకశక్తి పెంచడంకోసం మన పెద్దలు చెప్పిన అద్భుతమైన జానపద కథల్లో ఇది ఒకటి. ఇలాంటి కథలని గొలుసుకట్టు కథలు అంటారు. ఇక చదవండి-

**********
ఒకూర్లో ఒక చీమా, చిలుక కలసిమెలసి వుండేటివి. అవి రెండూ మంచి స్నేహితులు. ఒకరోజు ఆ రెండూ కలసి పాయసం చేసుకున్నాయి. పాయసం ఘుమఘుమలాడతా వాసనొస్తా వుంటే చీమకు నోట్లో నీళ్ళూరినాయి. ఎట్లాగుందో కాస్త రుచి చూద్దామని గిన్నె పైకి ఎక్కి రుచి చూడబోతా వుంటే పాపం కాలు జారి దభీమని పాయసంలో పడిపోయింది.
పాయసం బాగా వేడివేడిగా వుంది గదా, దాంతో పాపమా చీమ ''కాపాడండి! కాపాడండి!'' అని బాధతో అరవసాగింది. అది చూసిన చిలుక వెంటనే స్నేహితున్ని కాపాడదామని వురుక్కుంటా వచ్చి ముక్కుతో దాన్ని పట్టుకోబోయింది. వేడివేడి పాయసం తగిలి దాని ముక్కు కాస్తా వూడిపోయింది. పాపమా చీమ ఆ పాయసంలోనే చచ్చిపోయింది.
చీమ చచ్చిపోయినందుకు బాధపడతా ఆ చిలుక ఏడుస్తా వుంటే అప్పడే అటువేపుగా వచ్చిన కాకొకటి ఆ చిలుకను చూసి పకపకపక నవ్వుతా ''చిలుకా! చిలుకా! ఇప్పటివరకూ బాగానే వుంటివే. అంతలోనే నీ ముక్కెట్లా వూడిపాయ'' అనడిగింది.
వెంటనే ఆ చిలుక కోపంగా ''చీమ ఏమో చచ్చిపాయ, చిలక ముక్కు వూడిపాయ. నన్ను చూసి నవ్వినందుకు నీ కన్ను లొట్టపోవాల'' అనింది. వెంటనే కాకి కన్ను లొట్టపోయింది.
ఆ కాకి ఎగురుకుంటా పోయి ఒక చెట్టు మీద వాలి బాధపడతా వుంటే ఆ చెట్టు చూసి పకపకపక నవ్వుతా ''కాకీ కాకీ! ఇప్పటివరకూ బాగానే వుంటివే. అంతలోనే నీ కన్నెట్లా లొట్టపాయ'' అనడిగింది.
వెంటనే ఆ కాకి కోపంగా ''చీమ ఏమో చచ్చిపాయ, చిలక ముక్కు వూడిపాయ, నా కన్ను లొట్టపాయ. నన్ను చూసి నవ్వినందుకు నీ ఆకులు రాలిపోవాల'' అనింది. వెంటనే ఆ చెట్టు ఆకులన్నీ రాలిపోయినాయి.
ఆ చెట్టు ఆకులన్నీ రాలిపోయినందుకు బాధపడతా వుంటే, అప్పడే అటుగా వచ్చిన ఒక జింక చెట్టును చూసి పకపకపక నవ్వుతా ''చెట్టూ చెట్టూ! ఇప్పటివరకూ బాగానే వుంటివే. అంతలోనే నీ ఆకులెట్లా రాలిపాయ'' అనడిగింది.
వెంటనే ఆ చెట్టు కోపంగా ''చీమ ఏమో చచ్చిపాయ, చిలక ముక్కు వూడిపాయ, కాకి కన్ను లొట్టపాయ, నా ఆకులన్నీ రాలిపాయ. నన్ను చూసి నవ్వినందుకు నీ కొమ్ములిరిగిపోవాల'' అనింది. వెంటనే జింక కొమ్ములిగిపోయినాయి.
ఆ జింక కొమ్ములిరిగిపోయినందుకు బాధపడ్తా, చెరువుకాడికి పోయి నీళ్ళు తాగతా వుంటే ఆ చెరువు జింకను చూసి పకపకపక నవ్వుతా ''జింకా జింకా! ఇప్పటివరకూ బాగానే వుంటివే. అంతలోనే నీ కొమ్ములెట్లా విరిగిపాయ'' అనడిగింది.
వెంటనే ఆ జింక కోపంగా ''చీమ ఏమో చచ్చిపాయ, చిలక ముక్కు వూడిపాయ, కాకి కన్ను లొట్టపాయ, చెట్టు ఆకులు రాలిపాయ, జింక కొమ్ములిరిగిపాయ. నన్ను చూసి నవ్వినందుకు నీ నీళ్ళు ఎండిపోవాల'' అనింది. వెంటనే ఆ చెరువులోని నీళ్ళన్నీ ఎండిపోయినాయి.
చెరువులో నీళ్ళు ముంచుకోడానికి సంకలో బిందె పెట్టుకోనొచ్చిన కోడలుపిల్ల ఆ చెరువును చూసి పకపకపక నవ్వుతా ''చెరువా! చెరువా! ఇప్పటివరకూ బాగానే వుంటివే. అంతలోనే నీ నీళ్ళెట్లా ఎండిపాయ' అనింది.
వెంటనే ఆ చెరువు కోపంగా ''చీమ ఏమో చచ్చిపాయ, చిలక ముక్కు వూడిపాయ, కాకి కన్ను లొట్టపాయ, చెట్టు ఆకులు రాలిపాయ, జింక కొమ్ములిరిగిపాయ, నా నీళ్ళు ఎండిపాయ... నన్ను చూసి నవ్వినందుకు నీకు బిందె అంటుకుపోవాల'' అనింది. వెంటనే ఆమెకు బిందె అంటుకుపోయింది.
కోడలు కిందామీదా పడ్తా ఆ బిందెను పీక్కోలేక బాధపడ్తా వుంటే రోట్లో వడ్లు దంచుతా వున్న అత్త పకపకపక నవ్వుతా ''కోడలా కోడలా! ఇప్పటివరకూ బాగానే వుంటివే. అంతలోనే నీకు బిందెట్లా అంటుకపాయ'' అనడిగింది.
వెంటనే ఆ కోడలు కోపంగా ''చీమ ఏమో చచ్చిపాయ, చిలక ముక్కు వూడిపాయ, కాకి కన్ను లొట్టపాయ, చెట్టు ఆకులు రాలిపాయ, జింక కొమ్ములిరిగిపాయ, చెరువు నీళ్ళు ఎండిపాయ, నాకు బిందె అంటుకుపాయ, నన్ను చూసి నవ్వినందుకు నీకు రోకలి అంటుకపోవాల'' అనింది. వెంటనే ఆమె చేతికి రోకలి అంటుకుపోయింది.
ఆమె రోకలిని పీక్కోలేక సస్తా వుంటే పీట మీద కూచోని అది చూస్తా వున్న ఆమె కొడుకు పకపకపక నవ్వుతా ''అమ్మా! అమ్మా! ఇప్పటివరకూ బాగానే వుంటివే. అంతలోనే నీ చేతికి రోకలెట్లా అంటుకపాయ'' అనడిగినాడు.
వెంటనే ఆమె కోపంగా ''చీమ ఏమో చచ్చిపాయ, చిలక ముక్కు వూడిపాయ, కాకి కన్ను లొట్టపాయ, చెట్టు ఆకులు రాలిపాయ, జింక కొమ్ములిరిగిపాయ, చెరువు నీళ్ళు ఎండిపాయ, కోడలికి బిందె అంటుకపాయ, నాకు రోకలి అంటకపాయ. నన్ను చూసి నవ్వినందుకు నీకు పీట అంటకపోవాల'' అనింది. వెంటనే వానికి పీట అంటకపోయింది.
వాడు ఆ పీటను విడిపించుకోలేక దాంతోనే పెండ్లికి పోతే ఆడున్నోళ్ళందరూ పకపకపక నవ్వుతా ''ఏరా! ఇప్పటివరకూ బాగానే వుంటివే. అంతలోనే నీకు పీటెట్లా అంటకపాయ'' అనడిగినారు.
వెంటనే వాడు కోపంగా ''చీమ ఏమో చచ్చిపాయ, చిలక ముక్కు వూడిపాయ, కాకి కన్ను లొట్టపాయ, చెట్టు ఆకులు రాలిపాయ, జింక కొమ్ములిరిగిపాయ, చెరువు నీళ్ళు ఎండిపాయ, నా పెండ్లానికి బిందె అంటకపాయ, మా అమ్మకు రోకలి అంటకపాయ, నాకేమో పీటంటకపాయ... నన్ను చూసి నవ్వినందుకు మీకు కుర్చీలంటకపోవాల' అన్నాడు. అంతే అక్కడున్నోళ్ళందరికీ కుర్చీలంటకపోయినాయి.
వాళ్ళందరూ ఆ కుర్చీలు విడిపించుకోలేక కిందా మీదా పడ్తూ అటూ ఇటూ తిరుగుతా వుంటే నెత్తిన కుండలు పెట్టుకోని మజ్జిగ అమ్ముకుంటున్నామె వాళ్ళను చూసి పకపక నవ్వుతా ''ఏమైంది! ఇప్పటివరకూ బాగానే వుండిరే. అంతలోనే మీకు కుర్చీలెట్లా అంటకపాయ'' అనడిగింది.
వెంటనే వాళ్ళు కోపంగా ''చీమ ఏమో చచ్చిపాయ, చిలక ముక్కు వూడిపాయ, కాకి కన్ను లొట్టపాయ, చెట్టు ఆకులు రాలిపాయ, జింక కొమ్ములిరిగిపాయ, చెరువు నీళ్ళు ఎండిపాయ, కోడలికి బిందె అంటుకపాయ, అత్తకి రోకలంటకపాయ, కొడుక్కి పీటంటకపాయ, మాకేమో కుర్చీలంటకపాయ... మమ్మల్ని చూసి నవ్వినందుకు నీకు కుండ అంటక...'' వాళ్ళ నోటి నుండి అంటకపోవాలనే మాట ఇంకా పూర్తిగా రాక ముందే ఆమె అదిరిపడి దభీమని నెత్తి మీదున్న కుండలన్నీ కింద పడేసింది.
దాంతో... కుండ ఆమెకు అంటుకోలేదు. వెంటనే పెళ్ళోళ్ళకు కుర్చీలూడిపోయినాయి. కొడుక్కి పీటూడిపోయింది. అత్తకు రోకలూడిపోయింది. కోడలికి బిందూడిపోయింది. చెరువుకి నీళ్ళు వచ్చేసినాయి. జింకకు కొమ్ములు వచ్చేసినాయి. చెట్టుకు ఆకులు వచ్చేసినాయి. కాకికి కన్ను వచ్చేసింది. చిలుకకు ముక్కొచ్చేసింది. చీమ బతికి బైటకొచ్చేసింది.
***********
కామెంట్‌లు