జమీందార్ మానయ్య :- ఉండ్రాళ్ళ రాజేశం-సిద్దిపేట-9966946084
 చక్రపురం అనే గ్రామంలో మానయ్య అనే జమీందారు ఉండేవాడు. మానయ్య ఏది చెప్తే అదే న్యాయం, ధర్మంగా గ్రామస్తులు భావించేవారు. జమీందారు మానయ్యను ఎవరు ఎదురు ప్రశ్నించక పోయేవారు కాదు. మానయ్య చెప్పిందే వేదంగా గ్రామస్తులు నడుచుకునేవారు.
                   ఒకసారి గ్రామంలో దొంగతనం జరిగింది. దాచుకున్న డబ్బులు దొంగలు ఎత్తుకపోయారు. అందరూ కలిసి జమీందారు మానయ్య వద్దకు వెళ్లారు. తమ ఇండ్లలో దొంగతనం జరిగిందని, కాపాడమని వేడుకున్నారు. జమీందారు మానయ్యకు ఏం చేయాలో పాలుపోలేదు. 
              మానయ్య బాగా ఆలోచించి, దొంగతనం జరిగిన ప్రతి ఇంటికి వెళ్లి, ఆనవాలు కోసం వెతకసాగాడు. చివరికి మానయ్యకు ఒక చెప్పు దొరికింది. మానయ్య ఆ చెప్పును సంచిలో దాచి, గ్రామ కచేరి వద్దకు ప్రజలందరిని పిలిపించాడు. అందరినీ కచేరి అరుగుపై కూర్చోబెట్టి, రెండు కాళ్లు చాపమన్నాడు. ప్రజలందరూ జమీందార్ మానయ్య మాటకు  ఆశ్చర్యపోయారు. అయినా చేసేది లేక అందరూ అరుగుపై కూర్చొని ముందుకు కాళ్ళు చాపారు. 
               మానయ్య సరాసరి దుర్గయ్య వద్దకు వెళ్లి, సంచిలోంచి చెప్పు తీసి, నీవే ఇండ్లలో దొంగతనం చేశావు. చూడు ఈ చెప్పు అడుగుకు ఉన్న మోల కారణంగా నీ కాలు పాదానికి అదే స్థలంలో గాయమైంది. నీవే దొంగవు అంటూ గద్దిరించాడు. చెప్పు ను చూడగానే దుర్గయ్య చేసేది లేక జమీందారు మానయ్య పాదాలపై పడి క్షమించమన్నాడు. ప్రజలందరూ కోపంతో దుర్గయ్యను శిక్షించబోగా, మానయ్య అందరిని అడ్డుకొని, అందరికీ డబ్బులు దుర్గయ్యచే ఇప్పించాడు. దుర్గయ్యకు తన పొలంలో ఉపాధి కల్పించి, దొంగతనం మాన్పించి, మంచి మనిషిగా మార్చాడు. జమీందారు మానయ్య దొంగను గుర్తించి, మంచి వ్యక్తిగా మార్చినందుకు ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేశారు.  


కామెంట్‌లు