ఖాళీ కుండ:- డా.రామక కృష్ణమూర్తి-బోయినపల్లి,సికింద్రాబాద్.

 బంగారు తెలంగాణంటివి,
మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె.
ప్రాజెక్టుల పరవళ్ళంటివి,
కూట్లో రాయి దీయలేయనోడు
ఏట్ల రాయి దీస్తడా.
కడుపు నిండా బువ్వంటివి,
కరువు భత్యం కాజేస్తివి.
ఏతులకువోయి కోట్లు కోట్లు కుమ్మరిస్తివి,
యాడ యేసిన గొంగడి ఆడనే ఉండె.
ఉచిత పథకాలని ఊడ్చి పెడ్తివి,
మింగలేక కక్కలేక చస్తుండిరి.
ఆడంబరాల ఆగమాగం జేస్తివి,
మూతిపళ్ళు రాలి మూలకు గూసోబెడితివి.
అమ్ముకుందామంటే జాగ లేకుండా జేస్తివి,
అప్పు పుట్టించుకొని అంగలారుస్తుంటిమి.
ఫీజు మాఫీ,ఋణమాఫీలంటివి,
పీన్గులెల్లుతున్నా మిన్నకుంటివి.
త్యాగాలు జేయాలట ఉద్యోగులు,
ప్రజాప్రతినిధులు మట్కు జీతం దీస్కోని ప్రజాసేవ చేస్తరట.
రంది వడకుమని జెప్పుకుంటు
కాలమెల్లదీసుడు గాని,
పండుగ యెట్ల జేసుకొనుడో తెల్వకపాయె.
పంటలు జూసుకుంట పాశమొండుకొని,
పండ్లికిలించుకుంట ఉపాసముండుమంటిరి.
ఏ రాయైతే యేంది పండ్లూడగొట్టుకునేందుకని.
సర్వేల పేరిట టక్కుడెక్కులు జేసుడు గాని,
ఆత్మగౌరవం మాట అటకెక్కించిరి.
ఏమున్నది సెప్పుకోనీకి,
పొయ్యి మీది నుండి పెనంల బడ్డట్లున్నది.
ఓట్ల పండుగొచ్చేదాకా ఓపిక బట్టండి,
బట్ట గాల్చి మీద ఎయ్యనీకి.

కామెంట్‌లు