కవితా!జోహార్!!:- కిలపర్తి దాలినాయుడు
-------------------------------------
సందర్భం:ప్రపంచ కవితా దినోత్సవం
-------------------------------------
ఒకప్పుడు 
కవిత రాజ్యరమకు చెలికత్తె 
భూమీశుని  వందిమాగథి 
తెలుగునగలో సంస్కృత రత్నాలను పొదుగుకొని 
రాచక్రీడలను రసరమ్యంగా 
కీర్తించేదే!

కవితా భవంతులలో 
చక్రవర్తులను నిలిపి అజరామరం చేసే చింతామణి

వరాలకు వంగి వంగి 
దీనారాలకు తొంగితొంగి 
సలామ్ చేసేది
గులాము అయ్యేది!

వీరశృంగారాలు
విరహగీతికలు
తననిండా నింపుకొన్న
ఆస్థాన నిలయ!

ఛందోపరిష్వంగణలో
పద్యపల్లవులనూదుతూ
గద్యచరణాలను పాడుతూ 
మార్గకవిత్వ మార్గ నిర్మాత !

అప్పుడు
దేశీయకవిత అచ్చతెనుగు 
చీరకట్టుకొని
పదంలాగనో పాటలాగనో 
పల్లెపదాల్లో ఘల్లుఘల్లుమని 
తృణకంకణాలు తొడుగుకొని 
పల్లెపాటకు ప్రాణంపోసింది!

నేడు...
పద్యం సంప్రదాయ వస్తువు
వచనం ఆధుని వస్త్రం
అసమానతలపై ఎక్కువ పెట్టిన 
అస్త్రం...
సిమిలీలు
మెటాలు 
పెరసానిఫికేషన్లు
ఐరనీలు 
కవితా పరిమళాలకు 
అద్దే సెంట్లు
భావపూరిత ,అభ్యుదయ,విప్లవ 
ఇతివృత్తాల వల్లరియై 
కవిత బావుటా ఎగురవేస్తుంది
ఓ కవితా 
రేపటి సవితా
జోహార్!
---------------------------------------


కామెంట్‌లు