ఎవరైనా కోరితే.....:- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
ఎవరైనా కోరితే
చెవినిస్తా
చెప్పినవిషయాలు
వింటా

ఎవరైనా అడిగితే
నోరుతెరుస్తా
తేనెపలుకులు
చిందుతా

ఎవరైనా వేడుకుంటే
గళంవిప్పుతా
కోకిలకంఠం
వినిపిస్తా

ఎవరైనా ఆశిస్తే
ఉన్నదందిస్తా
దాపరికాలు
చెయ్యకుంటా

ఎవరైనా అభ్యర్ధిస్తే
అభినందిస్తా
పొగడ్తలు
కుమ్మరిస్తా

ఎవరైనా వాంఛిస్తే
సలహాలిస్తా
దీవెనలు
అందిస్తా

ఎవరైనా కాంక్షిస్తే
అక్షరాలువిసురుతా
అనుభూతులను
తెలుపుతా

ఎవరైనా అర్ధిస్తే
పదాలుప్రేలుస్తా
పసందును
కలిగిస్తా

ఎవరైనా కావాలంటే
అందాలుచూపుతా
అంతరంగాలను
ఆనందపరుస్తా

ఎవరైనా ఇవ్వమంటే
కవితలందిస్తా
కమ్మదనాలు
పంచిపెడతా


కామెంట్‌లు