అడవిలోని సున్నితమైన రాక్షసులు :- - యామిజాల జగదీశ్
 ఒరాంగుటాన్లు ఆగ్నేయాసియాలోని బోర్నియో, సుమత్రా దీవులలోని వర్షారణ్యాలలో మాత్రమే కనిపిస్తాయి. ఇవి జీవితాంతమూ దాదాపుగా చెట్లపైనే గడుపుతాయి. చెట్ల పైభాగాల్లో ఊగుతూ నిద్ర కోసం గూళ్ళు కట్టుకుంటూ ఉంటాయి. 
ఒరాంగుటాన్లలోని మూడు జాతులు, బోర్నియన్, సుమత్రన్, టపనులి. వీటి  ప్రవర్తనలో కొద్దిగా భిన్నంగా ఉంటాయి. బోర్నియన్, సుమత్రన్ జాతుల ఒరాంగుటాన్ లకు ఎర్రటి బొచ్చు ఉంటుంది. సుమత్రన్ ఒరాంగుటాన్లు పొడవైన ముఖ కలిగి ఉంటాయి. ఇవి బోర్నియన్ కంటే సన్నిహిత బంధాలను కలిగి ఉంటాయి. బోర్నియన్ ఒరాంగుటాన్లు అప్పుడప్పుడు చెట్లపై నుండి దిగి నేలపై తిరుగుతాయి.
 
ఒరాంగుటాన్ల మనుగడకు అటవీ నిర్మూలన వల్ల ముప్పు పొంచి ఉంది. 
బోర్నియన్ ఒరాంగుటాన్‌ను తీవ్రస్థాయిలో అంతరించిపోతున్న  జంతువుల జాబితాలో చేర్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఇవి సుమారు 1,04,700దాకా ఉన్నాయని అంచనా.  సుమత్రన్ ఒరాంగుటాన్లయితే 14,000 కంటే తక్కువగానే ఉన్నాయి. టపనులి ఒరాంగుటాన్లయితే 800 కంటే తక్కువగా ఉన్నాయి. ఒక శతాబ్దం క్రితం, 2,30,000 కంటే ఎక్కువ ఒరాంగుటాన్లు అడవిలో సంచరించేవి. 
వృద్ధ ఒరాంగుటాన్లు స్వభావరీత్యా ఒంటరిగా ఉంటాయి. కానీ చిన్నవి  తమ తల్లులతో ఎనిమిది సంవత్సరాల వరకు ఉంటాయి. 
ఒరాంగుటాన్లు దాదాపు అరవై శాతందాకా పండ్లనే తింటాయి. వీటిలో లీచీలు, మాంగోస్టీన్లు, మామిడి పండ్లు, అంజూర పండ్లు తింటాయి. ఆకులు, రెమ్మలు, కీటకాలు, చెట్ల బెరడు, అప్పుడప్పుడు గుడ్లనూ తింటాయి. 
ఒరాంగుటాన్లలో ముసలి మగవి ఐదు అడుగుల పొడవు (సుమారు 153 సెంటీమీటర్లు) వరకు ఉంటాయి.
వీటి బరువు 300 పౌండ్ల (136 కిలోలు) వరకు ఉంటుంది. చెమట పట్టకుండా దాదాపు 500 పౌండ్ల (227 కిలోలు) బరువును అతి సులభంగా ఎత్తగలవు.
ఇవి బలమైనవే అయినప్పటికీ  ఒరంగుటాన్లు జంతు రాజ్యంలో అత్యంత సున్నితమైన జీవులుగా వీటిని పరిగణిస్తారు. ఇవి ఘర్షణను కోరుకోవు. ఆధిపత్యం కోసం గొడవ పొడవు. ఇవి అడవిలో ప్రశాంతత నిశ్శబ్దంగా సంచరిస్తుంటాయి.

-

కామెంట్‌లు