సుప్రభాత కవిత : -బృంద
చూపులకు తోచని రూపేదో
మాపులను తరిమేసే తూరుపున
రేపటి వెలుగులు కొని తెచ్చే
ఆపలేని ఆనందాల  మోపు!

హిరణ్య వర్ణముతో ప్రభవించి
అరుణ వర్ణముతో అంబరాన్ని నింపి
తరుణ కాంతుల కిరణాలతో
కరుణ చూపగ వచ్చిన వేలుపు!

రాదారిని రాజు రథము 
తరలి వచ్చు వేళలో 
తరియించగా దర్శనముతో 
మురిసి నిలిచిన మొయిళ్లు!

బంగారుకలలు పండగ 
బ్రతుకే ఒక పండుగవగా
నిన్నలేని అందమేదో నింగిని
కన్నులకు మిన్నగా తోచెకాదా!

అవనిలోని అణువణువూ...
ఆదిత్యుని ఆగమన వేళ
అలుపు తీరిన ఉత్సాహముతో
ఆహ్వానించగా అంజలి ఘటించే!

🌸🌸సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు