న్యాయాలు-863
" జ్ఞాతిశ్చేదన లేనకిమ్" న్యాయము
****
జ్ఞాతి అనగా దాయాదుడు,తండ్రి వైపు బంధువు, తండ్రి యొక్క సోదరుడు,సోదరి మరియు వారి సంతతి.శ్చేద లేదా శ్చేదన అనగా విచ్ఛిన్నం ,పతనం.అనలం అనగా అగ్ని, నిప్పు.కిమ్ అనగా ఏమి, ఏది అనే అర్థాలు ఉన్నాయి.
"జ్ఞాతి వాడు ఉంటే అగ్గి వేరే అవసరం లేదు"అని అర్థము.దీనికి సంబంధించి ఏనుగు లక్ష్మణ కవి తెలుగులో రాసిన పూర్తి శ్లోకాన్ని చూద్దాం.
క్షమ కవచంబు,క్రోధమది శత్రువు, జ్ఞాతి హుతాశనుండు,మిత్రము దగు మందు, దుర్జనులు దారుణ పన్నగముల్,సువిద్య విత్తముచిత లజ్జ భూషణ ముదాత్త కవిత్వము రాజ్య మీ క్షమా ప్రముఖ పదార్థముల్ గలుగుపట్టున దత్కవచాదులేటికిన్.
అనగా ఓర్పు ఉంటే కవచము అక్కరలేదు. క్రోధము ఉంటే హాని కలిగించడానికి వేరే శత్రువుతో పని లేదు. దాయాది ఉంటే వేరే నిప్పు అవసరము లేదు.స్నేహితుడు వుంటే ఔషధము అక్కర లేదు.దుష్టులు ఉంటే భయంకరమైన సర్పాలే అవసరం లేదు.ఉదాత్తమైన కవిత్వం ఉంటే రాజ్యంతో పని లేదు. చక్కని విద్య ఉంటే సంపదతో ప్లయోజనము లేదు.తగు రీతిని సిగ్గు ఉంటే వేరే అలంకారము అక్కర్లేదు. ఈ ఓర్పు మొదలైన లక్షణాలన్నీ ఉన్న పక్షంలో కవచం మొదలైన వాటి అవసరం లేదు అని భావము.
దాయాది ఉంటే నిప్పు అవసరం లేదు అని తెలుసుకునే ముందు అసలు దాయాది అంటే ఏమిటో తెలుసుకుందాం. దాయం అంటే పంచుకోవడం.పంచుకోవలసిన వారు దాయాదులు. మరి వేటిని పంచుకోవడం అంటే ఒకే ఇంటి పేరు, గౌరవం, మర్యాదతో పాటు ఆస్తి,అంతస్తులు, ఆదాయం, అప్పులు, ఖర్చులు అన్నీ కూడా. పంచుకోవడం ఉంటుంది.
దాయాది ఉంటే నిప్పు అవసరం లేదు అని అనడంలోని అంతరార్థం ఏమిటంటే నిప్పులా ఎప్పుడూ రగిలిపోతూ ఏదో ఒక హాని ఒకరికి ఒకరు చేసుకుంటూ ఉంటారు.
దీనికి మంచి ఉదాహరణగా మనం మహా భారతంలోని కౌరవులు,పాండవుల గురించి చెప్పుకోవచ్చు. వీరి జ్ఞాతి వైరానికి రెండు కారణాలు ఉన్నాయి.1.హస్తినాపుర సింహాసనం కోసం వారి మధ్య పోటీ .2. పాచికల ఆటలో పాండవులు రాజ్యాం కోల్పోవడం. ఇవి రెండింటి వలన జ్ఞాతి వైరం నిత్యం నిప్పులా రగులుతూ వచ్చింది. ఎంతగా అంటే చివరికి వంశం నాశనము అయ్యేలా.
కౌరవ పాండవులలో ధర్మరాజు యువరాజుగా పట్టాభిషిక్తుడు కావడం దుర్యోధనుడికి నచ్చలేదు. అందువలన మాయా జూదం ఆడించి వారిని అరణ్యవాసం, ఆజ్ఞాన వాసం చేయించాడు.
ఇక ఆ తర్వాత ఎన్ని రకాలుగా చెప్పినా ఒప్పుకోని దుర్యోధనునితో కనీసం ఐదు ఊర్లు ఇమ్మని కోరుతూ శ్రీకృష్ణుడిని రాయబారం పంపుతారు. అయినా ఒప్పుకోక పోవడంతో కురుక్షేత్ర సంగ్రామం జరిగింది.
వారు కలిసి పెరిగినప్పుడు కూడా పాండవులకు ఎప్పుడూ ఏదో ఒక కీడు తలపెట్టేవారు. అందు వల్ల "దాయాది ఉంటే నిప్పు అవసరం లేదు"అనే నానుడి నిజమైంది.
మన పెద్దవాళ్ళు తరచూ అంటుంటారు "ఆడపిల్లలు చిన్నప్పుడు పూలు, గాజులు అలంకారాల కోసం గొడవ పడుతుంటారు. కానీ పెద్దయ్యాక జీవితాంతం ఒకరి కష్టసుఖాలు పంచుకుంటూ కలిసిమెలసి ఉంటారు. అదే మగపిల్లలు అయితే చిన్నప్పుడు ఎంతో కలిసిమెలిసి ఉంటారు.పెద్దయ్యాక ఆస్తుల కోసం అంతస్తుల కోసం బద్ధశత్రువుల్లా మారిపోతూ ఉంటారు" అని అర్థము. మన చుట్టూ ఉన్న సమాజంలో కొంతమందిని అలా చూస్తూ ఉంటే పెద్దలు చెప్పినది ఇలాంటి సామెతలు నిజమే అనిపిస్తుంటాయి.
ఇంకా పల్లె భాషలో "తోటి కోడళ్ళను, సవితిని ఉద్దేశిస్తూ యారాలు హెచ్చనీయదు చవితి సాగనీయదు అనే సామెత ఉపయోగిస్తారు. అనగా తోటి కోడళ్ళకు ఒకరి మించి ఒకరు ఉండాలని కోరుకుంటూ ఎవరికి ఎక్కువగా ఉన్నా ఓర్చుకోలేక గొడవలు పడుతుంటారు.
జ్ఞాతిశ్చేదన లేనకిన్" న్యాయము ద్వారా మనం గ్రహించాల్సిన విషయం ఏమిటంటే అలా జ్ఞాతి వైరం కూడదు. ఎవరో ఒకరు నా రక్త సంబంధమే కదా! ఎందుకు ఈ వైరం అనుకుని సర్థుకుపోతూ వుండాలి.
. అలాంటి వైరం తల్లిదండ్రులకు ఎంతగా మనస్తాపం కలిగిస్తుందో అర్థం చేసుకోవాలి.బంధాలు అనుబంధాలను నిలుపు కోవాలి. ఎలా ఉండాలో ఉండకూడదో ఈ న్యాయం ద్వారా మనం అర్థం చేసుకోవాలి.సిరి లేదా సంపద శాశ్వతం కాదు బంధాలు అనుబంధాల గొప్ప తనం తెలుసుకోవాలి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి