సునంద భాష్యం:- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు-873
గుణాః సర్వత్ర పూజ్యంతే పితృవంశో నిరర్థకః న్యాయము
*****
గుణా అనగా గుణము,లక్షణం, స్వభావము,నాణ్యత,ఆస్తి.త్రాడు, అల్లెత్రాడు  సర్వత్రా అనగా ప్రతిచోటా, అన్నిచోట్లా, అంతటా,అన్ని ప్రదేశాలలో.పూజ్యంతే అనగా పూజింపబడుతారు, గౌరవింపబడుతారు. పితృవంశో అనగా తండ్రి వంశం,తండ్రి ద్వారా. నిరర్థకః అనగా  అర్థం లేనిది, ప్రయోజనం లేనిది,నిష్ఫలమైనది అనే అర్థాలు ఉన్నాయి.
గుణముల వల్లనే గౌరవము వస్తుంది. పితృ వంశం వల్ల  కాదు.ఏమీ ప్రయోజనము లేదు అని అర్థం. అనగా  ఒక వ్యక్తి యొక్క గుర్తింపు అతని గుణగణాల ద్వారానే వస్తుంది.కానీ తండ్రి వంశం తండ్రి ద్వారా రాదు అనీ, మంచి గుణాలు కలిగిన వ్యక్తి సర్వత్రా గౌరవింపబడతాడు అనే భావంతో ఈ న్యాయమును మన పెద్దవాళ్ళు ఉదాహరణగా చెబుతుంటారు.
దీనికి చక్కని ఉదాహరణ ప్రహ్లాదుడే. ప్రహ్లాదుడు రాక్షసుడైన హిరణ్య కశిపుడి కుమారుడు. దేవతలకు బద్ధ శత్రువులైన రాక్షస జాతిలో జన్మించాడు. అంతే కాకుండా తన తండ్రికి విరోధి అయిన శ్రీమహావిష్ణువునే స్మరించి గొప్ప హరి భక్తుడిగా జన్మ ముక్తి పొందాడు.
ముందుగా గుణాలు ఎన్ని రకాలుగా ఉంటాయో భగవద్గీత గుణ త్రయ విభాగంలో వివరించబడింది అవేమిటో చూద్దాం.
గుణములు మూడు రకాలు.ఒకటి సత్వ గుణము:-ఇది పూర్తిగా మంచితనం, మానవత్వానికి ప్రతీక. తన స్వార్థం చూసుకోకుండా ఇతరుల మేలు కోరుకునే తత్త్వం ఉంటుంది.సత్యం, జ్ఞానం, శాంతి, ఆనందం, సానుకూలత వంటి మంచి లక్షణాలను కలిగి ఉండే గుణం సత్త్వ గుణం. సత్త్వ గుణం ఎంతో పవిత్రమైనది.
 వీరే  తమ వంశం వల్లనో, తండ్రి వల్లనో  కాకుండా మరియు కులానికి, మతానికి అతీతంగా  తమ యొక్క జ్ఞాన సంపదతో సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందుతారు. విజ్ఞానం, వివేకం కలిగి  కొందరు ఆధ్యాత్మికత వైపు కూడా ఆకర్షితులవుతుంటారు. వీరు ఎల్లప్పుడూ సమాజంతో మంచి  సంబంధాలు కలిగి ఉంటారు.
రెండోది రజో గుణం:- ఈ రజో గుణం వల్ల వ్యక్తుల్లో ప్రాపంచిక భోగాల పట్ల, విషయాల పట్ల ఆసక్తి కలుగుతుంది.వాటితో పాటు లోభము, చురుకుదనం ఆవేశము వీటితో పాటు అశాంతితో  తమ కోరికల వెనక పరుగెత్తుతూ  ఉంటారు.
మూడవది తామస గుణం. లేదా తమో గుణం. ఇది అజ్ఞానం, జడత్వం, మోహము ,నిర్లక్ష్యం, దుఃఖము వంటి లక్షణాలతో  పాటు ఇతరులను హింసించడంలో ఆనందం పొందడం ఈ గుణంలో కనిపిస్తుంది.
 మనిషికి ఉండవలసిన మంచి గుణాలు. ఎవరినీ ద్వేషించకుండా అందరితో స్నేహంగా వుండటం. అతి మమకారం కూడదు. అహంకారం అసలే ఉండకూడదు.ఆత్మ తృప్తి, ప్రశాంతత, ఓర్పు, సహనం ఉండాలి.ఫలితం ఆశించకుండా మంచి పనులు చేస్తూ ఉండాలి.ఈర్ష్య అసూయలకు ఆమడ దూరంలో ఉండాలి.కోరికలకు దూరంగా, ఉన్న దానితో సంతృప్తి పొందాలి.
ఇలా పై మూడు గుణాలలో ఒక వ్యక్తిని గొప్ప వాడిని చేసే గుణాలు సత్త్వ గుణంలోనే  ఉంటాయి.అలాంటి గుణాలు సహజంగా వస్తాయి.అవి వంశ పారంపర్యంగానో, కులం వంశం వల్లనో మాత్రం రావు.
ఇలాంటి సత్త్వ గుణం వలన వారిలో ఒకానొక తేజస్సు కలుగుతుంది.అలాంటి తేజోమూర్తులు రామాయణ ,భారత భాగవత పురాణం కథల్లో కనిపిస్తారు. ప్రహ్లాదుడి వలెనే ఎందరో తేజోగుణ సంపన్నులు కనిపిస్తారు.
 శ్రీరాముడు, శ్రీకృష్ణుడు మానవ రూపంలో దేవతలుగా పూజింపబడినారు. బలి చక్రవర్తి,శిబి చక్రవర్తి, దధీచి ,రంతి దేవుడు, హరిశ్చంద్రుడు మొదలైన వారు తమ గుణాల చేత  గొప్ప వ్యక్తులుగా చరిత్ర పుటల్లో నిలిచి మంచికి మానవతకు మార్గదర్శకులు అయ్యారు. వీరందరికీ తమ వంశం ద్వారానో, తండ్రి ద్వారానో రాలేదు.సహజ సిద్ధంగా వచ్చాయనేది  స్పష్టంగా తెలుస్తుంది.
 కాబట్టి మనిషి  తనలోని మంచి గుణాలను గుర్తించి వాటికి మెరుగు పెట్టుకొని, వాటిని ఆచరణలో చేసి చూపితే ఆ మనిషి తప్పకుండా  మంచి గుణ,తేజో సంపన్నుడుగా సమాజంలో గుర్తింపు పొందుతాడు.
మరి ఈ న్యాయము ద్వారా మనం అలవర్చుకోవలసిన సత్త్వ,తేజో గుణాలు ఇవే. ఇవే సర్వత్రా పూజనీయమై గౌరవ మర్యాదలు పొందుతాయి.ఇదే ఈ గుణాః సర్వత్ర పూజ్యంతే పితృవంశో నిరర్థకః న్యాయము లోని అంతరార్థము. తెలుసుకున్నాం.అలాగే మసలుకుందాం.

కామెంట్‌లు