దేవుడి గంటలు!!: - డా ప్రతాప్ కౌటిళ్యా.
ఆకులు ప్రసవించిన రంగుల ఆకర్షణ కోసం 
మృదువైన కిరణం ప్రాణం వదులుకుంది. 

దిగంతాల పాతాళ లోకాల్లోంచి పిలుపు వినిపించినట్లూ
నీరు వచ్చి వేరులోకి చేరింది. 

మెరుపులా మెరిసిన క్షణం ఒకటి 
కాలం ఎదలో మౌనం వీడి ప్రేమలో పడింది.

యవ్వన వనం ఎడారిని చూసి ఏడ్చింది. 
పడుచు నుదుట సింధూరం కోసం ఆకాశము అస్తమించింది. 

దిగ్బంధంలోంచి అగ్నిపర్వతం సముద్రాన్ని కన్నది. 
ఎగిసే కెరటాలు పసిడి చినుకులై పడగవిప్పిన సర్పంలా బుస కొడుతున్నవీ.

అర్థనిమీళిత నేత్రం అర్ధాంతరంగా బగ్గుమన్నది.
నిండు పున్నమి పై గండు తుమ్మెద వాలింది.
గుండె లోతుల్లో అఖండ దీపం వెలిగింది. 

పండువెన్నెల పందిట్లో స్నేహ హస్తం పండగ చేసుకుంది. 

పులకించిన పువ్వు పెదాలపై గులాబి రంగు చిగురు తొడిగింది. 

గుబులు గుడిలో దేవుడి గంటలు మ్రోగినవి. గర్భగుడిలో దీపం వెలిగింది.

డా ప్రతాప్ కౌటిళ్యా.

కామెంట్‌లు