అందుకోసమే:- - యామిజాల జగదీశ్
 మా అమ్మ  పొరుగింటి వారిని అప్పుడప్పుడు తక్కువ మోతాదులో 
ఉప్పు  అడిగి తీసుకుంటూ ఉంటుంది. ఒకరోజు ఉండబట్టలేక మా అమ్మను గట్టిగా అడిగేసాను..‌.ఎందుకమ్మా అలా అడుగుతుంటావు...మన ఇంట ఆ మాత్రం ఉప్పు లేదా...నాన్న ఎప్పటికప్పుడు వంటింటికి అవసరమైన సామాన్లు కొంటూనే ఉంటారుగా అని.
అప్పుడు మా అమ్మ చెప్పిన మాట నన్ను ఆశ్చర్యపరిచింది‌. అమ్మ మంచితనం బోధపడింది.
ఇంతకూ అమ్మ చెప్పిన మాట ఇదే...
 
"అలా ఎందుకు అడుగుతున్నానంటే, మన దగ్గర లేక కాదు. మన పొరుగింటి వారు ఉన్నవారు కాదు. వారి ఆర్ధిక స్థోమత అంతంత మాత్రమే. దాంతో వాళ్ళు తరచుగా ఏదో ఒకటి మనల్ని  అడుగుతుంటారు. అలా అడిగేటప్పుడు వారి స్వరంలో ఓ సిగ్గూ, లేమితనం బాధా, అభిమానాన్ని చంపుకుని అడగటం వంటివి ధ్వనిస్తుంటాయి. ఇవన్నీ గ్రహించిన నేను వారెప్పుడైనా ఏదైనా కావాల్సి వస్తే నన్ను అడిగేటప్పుడు అలా ఫీలవకూడదనే ఉద్దేశంతో నేను  వారిని చవకైన ఉప్పుని తక్కువ మోతాదులో అడుగుతుంటాను. దీంతో వారు నేనడిగే టప్పుడు  మన అవసరాన్ని తీరుస్తున్నట్లు ఫీలై వారు మనల్ని చనువు తీసుకుని అడిగే వీలుంటుంది.    వారు తమకు కావలసిన దానిని ఏ బాధా లేకుండా అడగ్గలరు. వారు మానసికంగా బాధ పడకూడదనే నేను వారిని ఉప్పివ్వండని అడగటం" అని అమ్మ చెప్పడంతో నేను మా అమ్మ నుండి నేర్చుకున్నది ఇదే...
చెప్పలేనంత ఎక్కువ విలువలతో సానుభూతి, వినయం, మద్దతు ఇవ్వడం. 

కామెంట్‌లు