సిగ్గుపడాల్సింది మనిషి.:- డా.చీదెళ్ళ సీతాలక్ష్మి-హస్తినాపురం,హైదరాబాద్
 
కాలానుగుణంగా మార్పు సహజం
పుట్టిన ప్రతీది పోవడం ఖాయం!!

కానీ ఉన్నంత సేపు పచ్చదనాన్ని నింపుకొని 
ప్రాణికోటికి ప్రాణ వాయువు నందించి
గూడు కూడు నీడ ఇచ్చి
సాయం అందించి ఆలంబనగా
నిలిచిన పత్రాలు
వచ్చిన పని ముగియగానే 
కాలం ఒడిలో జారుకొను!!

వృక్షమాత మోడైనా
అంతరంగమంతా తడే
కళ్ళ ముందు బిడ్డలు రాలినా
రేపటి వసంతం కోసం ఎదురు చూపు!!

ఒక్కొక్క ఆకు పుడమిని ముద్దాడ
తన్మయత్వంతో ముద్దుగా చూస్తున్న చెట్టు
పచ్చదనం కోల్పోయినా
కొద్దికాలమే కదా అనే సర్దుబాటు!!

స్వార్థంతో మనిషి హింసించినా
మళ్ళీ ఆశతో చిగురించే చెట్టు
చెట్టంత ఎదిగినా మానవత్వం
లేక అహంకారంతో అడుగంటి
పోతూ జాలిలేక కాలం గాలంలో
చిక్కగా వసంతం వచ్చేనా 
సిగ్గు పడేది మనిషే
శిశిరం తన పనిలో తానే!!

ఆశా జీవి కదా ఎంతైనా
ప్రకృతిని చూసి నేర్చుకో
కాలమే పాఠం చెపుతూ
దాన్ని ధర్మాన్ని అది పాటిస్తుంది
విలువల వలువలు విప్పి
ధర్మం తప్పేది మానవుడే!!

కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
ప్రకృతి ధర్మం, మానవనైజం ల మధ్య సారూపత, భేదాన్ని మీ కవిత లో వ్యక్తం చేశారు చాలా బాగుంది