మిఠాయి - జయా
రంగు రంగుల మిఠాయిల్ని
చూడటంతోనే
వయస్సు తగ్గిపోయింది
లెక్కించి లేనన్ని మిఠాయిలు
చిన్నతనంలోకి తీసుకుపోయాయి
నన్ను

స్కూలుకి వెళ్ళిన రోజుల్ని
జ్ఞప్తికి తెచ్చాయి
అయిదు పైసలు
జేబులో ఉన్నట్లు ఓ అనుభూతి

అయిదు పైసలతో
మిఠాయిలు కొనుక్కుతినడం

పొరపాటున మింగిన మిఠాయి
గొంతు మధ్యలో అడ్డుపడి
ఇబ్బంది పెట్టడం
కొరక లేక చొక్కా అంచున
మిఠాయి ఉంచి మడతపెట్టి
కొరికి
ఒకటీ అరా ముక్కలు మిత్రుడికివ్వడం
మెత్తటి తేనె మిఠాయి 
చప్పరిస్తూ లొట్టలేయడం
ఆ రోజులే రోజులు

ఈగల గుంపులా
మిఠాయి కోసం గుమికూడటం
అది ఆకుపచ్చని జ్ఞాపకమూ
తడారని జ్ఞాపకమూ

అయిదు పైసలు లేనప్పుడు
దిగాలు కనులు
నిస్సహాయ నవ్వులు
ఇదిగోరా అంటూ
మిత్రుడివ్వడం
నోట్లో వేసుకుని
ఆనందించడం

అప్పట్లో
యాభై పైసలు లేని కాలం

ఇప్పుడో
యాభై మిఠాయిలు కొనగలిగే
కాలం

కానీ
నోరూరించిన నాటి రోజులకే
నా మార్కులన్నీ

ఈ కాలం చేదెక్కింది
ఆ కాలం తీయనైంది

జేబులో ఏమీ లేకున్నా
ప్రశాంతంగా ఉన్న
కాలమది

జేబులో కొంచెం మిగులుండీ
బరువుగా సాగుతున్న
కాలమిది

మళ్ళీ వస్తాయా
ఆ రోజులు...

ఎందుకొస్తాయి, నా ఆశ 
అత్యాశేగా!?

పోనీ మిఠాయి కొనుక్కుని
కొరుక్కు తిందామంటే
ఒకటీ అరా మిగిలిన దంతాలు
వెక్కిరిస్తున్నాయి 
నువ్వు తినలేవంటూ నన్ను
కనుక 
మిఠాయిలను చూసి
చప్పరిస్తూ తిన్నట్టుగా
అలనాటి రోజుల్ని 
గుర్తుకు తెచ్చుకోవడంతో సరి!!


కామెంట్‌లు